కులాల మధ్య టీడీపీ చిచ్చు | Sakshi
Sakshi News home page

కులాల మధ్య టీడీపీ చిచ్చు

Published Sat, Feb 6 2016 2:49 AM

కులాల మధ్య టీడీపీ చిచ్చు - Sakshi

కాకినాడ : బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్‌కమిటీ డిమాండ్ చేసింది. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ విషయంలో టీడీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందంటూ సమావేశం మండిపడింది. కాపు రిజర్వేషన్ల వ్యవహారం కాపులు-ప్రభుత్వానికి మధ్య సమస్య అని, దీనిని బీసీలు, కాపుల మధ్య వివాదంగా సృష్టించవద్దని సమావేశం హితవు పలికింది. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అధ్యక్షతన శుక్రవారం కాకినాడ కళా వెంకట్రావు భవనంలో డీసీసీ విస్తృత సమావేశం జరిగింది.

ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చే విషయంలో ప్రభుత్వం బీసీలను రెచ్చగొడుతూ కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ముద్రగడ చేపట్టిన ఆమరణ దీక్షకు తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు డాక్టర్ కె.సుధాకర్‌బాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్థినీడి సుజాత తదితరులు పాల్గొన్నారు.

 చంద్రబాబుది ద్వంద్వవైఖరి
 మధురపూడి : ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ ఎంపీల కన్వీనర్ వి.హనుమంతరావు విమర్శించారు. శుక్రవారం స్పైస్‌జెట్ విమానంలో మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమం న్యాయమైనదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారం పొందాక మాట మార్చడం దుర్మార్గమని అన్నారు.

Advertisement
Advertisement