మృత్యు‘సాగరం’

18 Sep, 2016 09:48 IST|Sakshi
మృత్యు‘సాగరం’

ఒకరిని రక్షించేందుకు మరొకరు వెళ్లి ఐదుగురు విద్యార్థుల మృత్యువాత
మృత్యువులోనూ వీడని స్నేహం


ధర్మసాగర్‌ : ఐదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల మృతితో ధర్మసాగర్‌ దుఃఖసాగరంగా మారింది. ఎక్కడో పుట్టి పెరిగిన పిల్లలు ఆహ్లాదం కోసం వచ్చి ఇక్కడ ప్రాణాలు విడవడంతో తల్లడిల్లింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు రిజర్వాయర్‌ ప్రాంతంలో మిన్నంటాయి. రిజర్వాయర్‌లో జరుగుతున్న వరుస ఘటనలతో స్థానిక ప్రజలు కలత చెందుతున్నారు. వరంగల్‌ నగర శివారు బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ సీఎస్‌ఈ(కంప్యూటర్‌ సైన్స్‌ ఎలక్ట్రానిక్స్‌) థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులైన పత్తి శ్రావ్యరెడ్డి(20), పోలినేని వినూత్న(20), కర్నె శివసాయి(20), ఉత్పల శ్రీనిధి(20), ఎంసెట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటున్న పోలినేని శివసాయికృష్ణ(18) శనివారం ధర్మసాగర్‌ మండల కేంద్రం శివారులోని రిజర్వాయర్‌కు విహారయాత్రకు ఉదయం 10.30 గంటలకు టూ వీలర్లపై వచ్చారు. వీరితోపాటు కలిసి వచ్చేందుకు సిద్ధమైనప్పటికీ ఆలస్యం కావడంతో వంగాల రమ్యప్రత్యూష అనే మరో విద్యార్థిని వీరి వెనకాల ఆటోలో బయల్దేరింది. రిజర్వాయర్‌ వద్ద తాము ఎక్కడ ఉన్నది శ్రావ్యరెడ్డి ఆమెకు ఫోన్‌ చేసి చెప్పింది.

రమ్యప్రత్యూష వీరి వద్దకు వచ్చేలోపు వీరంతా చెరువుకట్టపై కొద్దిసేపు గడిపారు. ఆ తర్వాత నీళ్లలో కాళ్లు పెట్టుకొని వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను తినే ఉద్దేశంతో కట్ట దిగువభాగంలో ఉన్న బండపైకి చేరుకున్నారు. నీళ్లలో కాళ్లు వేసి సరదాగా ఆడిస్తూ మాట్లాడుకుంటుండగా కర్నె శివసాయి నీటిలోకి ఒక్కసారిగా జారిపడిపోయాడు. అక్కడ లోతును అంచనా వేయని ఉత్పల శ్రీనిధి, పోలినేని శివసాయికృష్ణ అతడిని బయటకులాగే ఉద్దేశంతో చేయందించగా అప్పటికే నీటిలో మునిగిపోతున్న శివసాయి వీరిద్దరిని గట్టిగా పట్టుకోగా వారు కూడా నీటమునిగారు. దీంతో కంగారుపడిన పోలినేని వినూత్న కూడా తన తమ్ముడు, స్నేహితులను కాపాడేందుకు నీటిలో దిగేందుకు ప్రయత్నించి అందులో పడిపోయింది.

వెంటనే పత్తి శ్రావ్యారెడ్డి తన స్నేహితురాలిని రక్షించేందుకు యత్నించి ఆమె కూడా నీటిపాలైంది. ఈలోగా వంగాల రమ్య ప్రత్యూష ఘటన స్థలానికి చేరుకునేసరికే శ్రావ్యరెడ్డి నీటి మునుగుతూ కనిపించింది. దీంతో ఆమె హెల్ప్‌.. హెల్ప్‌ అంటూ గట్టిగా కేకలు వేస్తూ చున్నీతో ఊపుకుంటూ నీటిపైపు పరుగులు తీసింది. ఆమెను గమనించిన దూరంగా ఉన్న నలుగురు యువకులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నలుగురు విద్యార్థులు నీటమునిగిపోగా ఒడ్డుపక్కన పడిపోయి ఉన్న శ్రావ్యరెడ్డిని వారు ఒడ్డుకు చేర్చారు. కొనఊపిరి ఉన్నట్లు గమనించి 108, 100కు సమాచారమిచ్చారు. 108 సిబ్బంది  ఘటన స్థలానికి చేరుకునేసరికి శ్రావ్యరెడ్డి మృతిచెందింది. మృతుల్లో పోలినేని వినూత్న, శివసాయికృష్ణ ఇద్దరు అక్కాతమ్ముడు. వీరి తల్లిదండ్రులకు ఇద్దరే సంతానం. వీరిద్దరూ మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.  

పాకురు ఎక్కువగా ఉండటంతో ఘటన
విద్యార్థులు నీట మునిగిన ప్రదేశంలో లోతు అధికంగా ఉండటంతోపాటు, వీరు కూర్చున్న ప్రాంతంలో బండ పూర్తిగా పాకురు పట్టి ఉండడం, విద్యార్థుల్లో ఎవరికి ఈత రాకపోవడతో ఒకేసారి మృత్యువాతపడ్డారు. వీరు కూర్చున్న చోట ఒక్కఅడుగు నీటిలో కాలు మోపినా ఒక్కసారిగా మనిషి పూర్తిగా నీటమునిగిపోయేంత లోతు ఉంటుంది. బండలను పట్టుకుని ఒడ్డుకు చేరాలని ప్రయత్నించినప్పటికీ బండపూర్తిగా పాకురు పట్టి ఉండటంతో పట్టు దొరకని పరిస్థితి నెలకొంది. ఈత వచ్చిన వారు సైతం ఒడ్డుకు చేరడానికి బయటి వ్యక్తి సాయం అవసరం ఉంటుందని స్థానిక జాలర్లు తెలిపారు.

ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం..
పొలినేని సంపత్‌రావు, వసంత దంపతులు హన్మకొండ హంటర్‌ రోడ్డులోని నందినిహిల్స్‌లో నివాసముంటున్నారు, వారికి వీరిద్దరే సంతానం. మృతుల్లో హన్మకొండ ఎక్సైజ్‌కాలనీ, కనకదుర్గ కాలనీకి చెందిన మరో విద్యార్థి కర్నె శివసాయి తండ్రి రవీందర్‌ గతంలో మృతి చెందగా, తల్లి మంజులారాణి ఎస్సార్‌ఎస్పీలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తోంది. ఆమెకు కూడా శివసాయి ఏకైక సంతానం కావడంతో బోరున విలపిస్తోంది. వడ్డెపల్లిలోని పరిమళకాలనీకి చెందిన ఉత్పల శ్రీనిధి ఇంటికి పెద్ద కుమారుడు. తండ్రి దాశరథి ఎలక్ట్రీషియన్‌ కాగా తల్లి అనురాధ ప్రైవేట్ టీచర్‌. మరో మృతురాలు పత్తి శ్రావ్యరెడ్డి స్వగ్రామం కరీంనగర్‌ జిల్లా వీణవంక కాగా ఆమె తండ్రి సత్యనారాయణరెడ్డి హన్మకొండ, అశోకకాలనీలో స్థిరపడి రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.


కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పోలినేని సంపత్‌రావు, రజిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో తమ ఇద్దరు పిల్లల ఉన్నత చదువుల కోసం గత కొన్నేళ్లుగా హన్మకొండలోని నందీహిల్స్‌లో నివాసముంటున్నారు. వారి కూతురు వినూత్న ఎస్‌ఆర్‌ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్‌ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో చదివింది. బీటెక్‌  వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాలలో చేస్తుంది. కుమారుడు శివసాయికృష్ణ కేయూ క్రాస్‌రోడ్డులోని ఎస్‌పీఆర్‌ పాఠశాలలో పదో తరగతి చదువుకోగా హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌లోలాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు.

చూస్తుండగానే నీట మునిగింది : వంగాల రమ్యప్రత్యూష
చూస్తుండగానే తన స్నేహితురాలు నీటమునిగిందని, అప్పటికే ఇతర విద్యార్థులు నీటమునిగారని ఆలస్యంగా గమనించినట్లు ఘటన స్థలానికి వీరికన్నా ఆలస్యంగా ఆటోలో వచ్చిన వంగాల రమ్యప్రత్యూష తెలిపింది. హెల్ప్‌ అంటూ అరవటంతో కొద్ది దూరంలోని నలుగురు యువకులు అక్కడికి చేరుకున్నట్లు ఆమె వెల్లడించింది.

గుడికి వెళతానని.. దేవుడి దగ్గరికి పోయిండు : కర్నె శివసాయి తల్లి మంజుల
‘నా కొడుకు గుడికి వెళ్లొస్తానని చెప్పి.. నన్ను వదిలిపెట్టి ఆ దేవుడి దగ్గరికే వెళ్లిపోయిండు. నా కొడుకును ఒకసారి బతికించు దేవుడా.. నా ఆయుష్షు వానికి పోయి దేవుడా.. నాకు అన్యాయం చేయకూ.. నేను ఎవరిని చూసుకొని బతకాలి దేవుడా’ అంటూ శివసాయి తల్లి మంజుల రోదించిన తీరు ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించింది. శివసాయి తండ్రి గత నాలుగేళ్ల క్రితం క్యాన్సర్‌తో మృతిచెందగా తల్లి మంజుల కారుణ్య నియామకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగిగా చింతగట్టు క్యాంపులో ఇరిగేషన్‌ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. మంజుల కుమారుడు శివసాయి బీటెక్‌ థర్డియర్‌ చదువుతుండగా కూతురు కాత్యాయిని ఇంటర్‌ చదువుతోంది.
 

నన్ను కూడ తీసుకపోరా దేవుడా.. : వినూత్న, శివసాయికృష్ణ తల్లి రజిత
దేవుడా నా బిడ్డను, కొడుకును తీసుకపోయినవు. నన్నెందుకు ఉంచావురా దేవుడా.. నన్ను కూడ తీసుకపో.. నా ఆయుష్షు పోసి నా పిల్లలను బతికించు దేవుడా.. బిడ్డా నీకు పాలు పోస్తా రా బిడ్డ, నీకు అన్నం పెడుతా రా బిడ్డా’ అంటూ వినూత్న, శివసాయికృష్ణ తల్లి రజిత గుండెలవిసేలా రోదిస్తుండగా ఆపడం ఎవరివల్లా కాలేదు.

ముచ్చర్లనాగారం వెళతామని చెప్పారు : వినూత్న తండ్రి సంపత్‌రావు
కళాశాలకు సెలవు రావడంతో నా కూతురు వినూత్న, కుమారుడు శివసాయికృష్ణ స్నేహితులతో కలిసి ముచ్చర్ల నాగారం వెళ్తున్నామని  చెప్పారు. ఇంతలోనే ఈ వార్త తెలిసింది.

స్నేహితులతో వెళ్లింది : శ్రావ్యరెడ్డి తల్లిదండ్రులు
స్నేహితులతో వెళ్లొస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లావా బిడ్డా అంటూ శ్రావ్యరెడ్డి తల్లిదండ్రులు విలపించారు. శ్రావ్య తల్లిదండ్రులు  సత్యనారాయణరెడ్డి - రజిని హన్మకొండలోని అశోకా కాలనీలో  నివాసముంటున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇంటికి వచ్చిన ఆమె తన స్నేహితులతో బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. అనంతరం 12.30 గంటల సమయంలో రిజర్వాయర్‌లో పడి మృతి చెందిన సమాచారం కుటుంబ సభ్యులకు అందింది. శ్రావ్య చెల్లెలు రితీక ఇంటర్‌ చదువుతోంది.

ఆరు నెలల క్రితం బైక్‌ కొనిచ్చారు : శ్రీనిధి స్నేహితులు
శ్రీనిధి కోసం అతడి తల్లిదండ్రులు ఆరు నెలల కింద బైక్‌ కొనిచ్చారు. వాడు ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవాడు’ అని అతడి స్నేహితులు చెప్పుకొచ్చారు.​ కాగా శ్రీనిధి తల్లిండ్రులు దాశరథి-అనురాధ హన్మకొండలోని పరిమళకాలనీలో నివాసముంటున్నారు. శ్రీ నిధి తమ్ముడు శ్రీ వాత్సవ ఇంటర్‌ చదువుతున్నాడు.

శివసాయిని మరిచిపోలేం..  స్నేహితులు
శివసాయి గొప్ప స్నేహితుడు. వాడిని ఎప్పటికీ మరిచిపోలేం. వాని బతకాలనే కోరిక ఎక్కువగా ఉండేది. కళాశాలలో మాకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నంటూ మాకు దైర్యం చెబుతూ మాతో ఉండేవాడు.


కన్నీటి సంద్రమైన ఎంజీఎం మార్చురీ
ఎంజీఎం : తమ ఆశాదీపాలు ఆరిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోదిస్తూ తమ పిల్లలను జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మరో సంవత్సరంలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకొని ఉద్యోగాల్లోకి వెళ్లాల్సిన విద్యార్థుల మృతితో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లో పడి మృతిచెందిన వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఎంజీఎం మార్చురీకి తరలించారు.  మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తరలివచ్చి రోదించిన తీరును చూపరులను కలచివేసింది.

మరిన్ని వార్తలు