ట్రంప్‌ క్యాబినెట్‌ ఆస్తులు 450 కోట్ల డాలర్లు

13 Jan, 2017 22:59 IST|Sakshi
ట్రంప్‌ క్యాబినెట్‌ ఆస్తులు 450 కోట్ల డాలర్లు
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ క్యాబినెట్‌ కూర్పు చూస్తే కళ్లు తిరిగి పోవాల్సిందే. ప్రపంచాన్ని తలదన్నే ధనవంతులతో ఆయన తన క్యాబినెట్‌ను ఏర్చి కూర్చారు. వ్యక్తిగతంగా ట్రంప్‌ ఆస్తిపాస్తులను పరిగణనలోకి తీసుకోకుండానే ఆయన తన క్యాబినెట్‌కు ప్రతిపాదించిన వ్యక్తుల ఆస్తులను లెక్కగడితే 450 కోట్ల డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ అంచనావేసింది. ట్రంప్‌కు 370 కోట్ల డాలర్ల ఆస్తులున్న విషయం తెల్సిందే.
 
అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న బరాక్‌ ఒబామా కేబినెట్‌ ఆస్తులకన్నా ట్రంప్‌ ప్రతిపాదిత క్యాబినెట్‌ సభ్యుల ఆస్తుల విలువ 60 శాతం ఎక్కువ. ట్రంప్‌ క్యాబినెట్‌ సభ్యుల ఆస్తులతోపాటు వారి భార్యల ఆస్తులు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. వారు ఇటీవల దేశ పన్నుల విభాగానికి సమర్పించిన పత్రాల్లో వెల్లడించిన లెక్కలతోనే ఈ అంచనాలను రూపొందించారు. ఒబామా క్యాబినెట్‌ సభ్యుల ఆస్తుల మొత్తం విలువ 275 కోట్ల డాలర్లు మాత్రమే. వారిలో కూడా ఒకరిద్దరు సభ్యుల ఆస్తులే ఎక్కువే. వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ ప్రిట్జ్‌కర్‌కు వారసత్వ ఆస్తి కలుపుకొని 250 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. విదేశాంగ శాఖ మంత్రి జాన్‌ కెర్రీకి 15 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనకు ఈ ఆస్తులు సంక్రమించాయి. 
 
వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌కు 250 కోట్ల డాలర్లు
ట్రంప్‌ వాణిజ్యమంత్రిగా ఎంపిక చేసిన విల్బర్‌ రాస్‌కు 250 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. ‘డబ్లూఎల్‌ రాస్‌ అండ్‌ కో’ పేరిట 2000 సంవత్సరంలో ఈక్విటీ సంస్థను ఏర్పాటుచేశారు. దాన్ని దాన్ని 2006లో 37.50 కోట్ల డాలర్లకు విక్రయించారు. అయినప్పటికీ ఆయనే ఆ కంపెనీ చైర్మన్‌గా, వ్యూహాత్మక సలహాదారుగా కొనసాగుతున్నారు. 
 
విద్యాశాఖ మంత్రి బెట్సీకి 125 కోట్ల డాలర్లు   
ఆమ్‌వే సహ వ్యవస్థాపకులు రిచర్డ్‌ డివోస్‌ కోడలైన బెట్సీ డివోస్‌కు 125 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. రిచర్డ్‌ డివోస్‌కు నలుగురు పిల్లలున్నందున కుటుంబ ఆస్తిలో నాలుగోవంతు బెట్సీ డివోస్‌ కుటుంబానికి వస్తుందన్న అంచనాతో ఫోర్బ్స్‌ ఆమె ఆస్తులను అంచనా వేసింది.


విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్‌కు 32.50 కోట్ల డాలర్లు
విదేశాంగ మంత్రిగా ఎంపికైనా రెక్స్‌ టిల్లర్సన్‌ టెక్సాస్‌ యూనివర్శిటీలో విద్యభ్యాసం పూర్తి చేయగానే ‘ఎక్సాన్‌ మొబైల్‌’ కంపెనీని స్థాపించారు. కంపెనీ చైర్మన్‌గా, సీఈవోగా ఆయన గత మూడేళ్లలోనే 9 కోట్ల డాలర్లను జీతంగా పుచ్చుకున్నారు. 


ఆర్థిక శాఖ మంత్రి స్టీవ్‌కు 30 కోట్ల డాలర్లు
గోల్డ్‌మేన్‌ సాచ్స్‌లో ఒకప్పుడు భాగస్వామిగా వున్న స్టీవ్‌ మ్నూచిన్‌ ‘ఇండీమ్యాక్‌’ కంపెనీని 2009లో 160 కోట్ల డాలర్లకు కొని ఆరేళ్ల తర్వాత 340 కోట్ల డాలర్లకు విక్రయించారు. అవతార్, అమెరికన్‌ స్నైపర్‌ లాంటి హాలీవుడ్‌ చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. 
 
 
కార్మిక శాఖ మంత్రి ఆండీ పుజ్దర్‌కు 4.50 కోట్ల డాలర్లు
సీకేఈ రెస్టారెంట్లకు సీఈవోగా పనిచేస్తున్న ఆండీ పుజ్దర్‌ ఒక్క 2000 సంవత్సరంలోనే జీతాలు, బోనస్‌ కింద 2.50 కోట్ల డాలర్లను అందుకున్నారు. ఇప్పుడు ఆయనకు 4.50 కోట్ల డాలర్ల విలువైన ఆస్తులున్నాయి. 
 
గృహనిర్మాణ మంత్రి బెన్‌ కార్సన్‌కు 2.90 కోట్ల డాలర్లు
న్యూరోసర్జన్‌ అయిన బెన్‌ కార్సన్‌ రాసిన ఐదు పుస్తకాలు విశేషంగా అమ్ముడుపోయాయి. ఫాక్స్‌ న్యూస్, వాషింగ్టన్‌ టైమ్స్‌కు వైద్యానికి సంబంధించిన ఆర్టికల్స్‌ రాయడం ద్వారా కూడా ఆయన సంపాదించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆయనకు 2.90 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. ఆయనను గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ట్రంప్‌ ఎన్నుకున్నారు. 
 
రవాణా శాఖ మంత్రి ఎలైనే చావోకు 2.40 కోట్ల డాలర్లు
ప్రముఖ షిప్పింగ్‌ వ్యాపారి కూతురు, సెనేట్‌లో మెజారిటీ లీడర్‌ మిట్చ్‌ మ్యాక్‌కాన్నెల్‌ భార్యకు 2.40 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. ఇందులో ఆమె భర్త అస్తులను కలపడమే కాకుండా తండ్రి నుంచి వచ్చే ఆస్తులను కూడా కలిపి ఆస్తులను అంచనా వేశారు. మిగతా మంత్రులకు కూడా భారీగానే ఆస్తులున్నాయి. ఇంకా ఆయన తన క్యాబినెట్‌లోకి మరో ఇద్దరిని తీసుకోవాల్సి ఉంది. భారీగా ఆస్తులున్న వారిని క్యాబినెట్‌లోకి తీసుకోవడం పట్ల వివిధ వర్గాల నుంచి విమర్శలు రాగా, వ్యాపారం చేయడం వెనకనున్న వారి తెలివితేటలను పరిగణనలోకి తీసుకున్నానని ట్రంప్‌ సమర్థించుకుంటున్నారు.  
>
మరిన్ని వార్తలు