ఉత్తరభారతంలో భూకంపం.. జనం పరుగులు

12 May, 2015 13:31 IST|Sakshi
ఉత్తరభారతంలో భూకంపం.. జనం పరుగులు

నేపాల్లో పుట్టిన భూకంపం మరోసారి ఉత్తర భారత దేశాన్ని కూడా చిగురుటాకులా వణికించింది. పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావాన్ని ప్రజలు స్పష్టంగా చూశారు. మూడో అంతస్థులో ఉండి పని చేసుకుంటున్న తాము ఉన్నట్టుండి అటూ ఇటూ ఊగిపోయామని, ఏం జరిగిందో అర్థమయ్యేలోపే భూకంపం అన్నారని దాంతో వెంటనే కిందకు పరుగులు తీశామని ఢిల్లీకి చెందిన ఓ గృహిణి తెలిపారు. తాను పాఠం చెబుతుండగా ఓ పిల్లాడు ఉన్నట్టుండి భూకంపం వచ్చిందన్నాడని, ముందు ఏదో జోక్ వేశాడనుకుంటే ఈలోపు బల్లలు కూడా ఊగడంతో వెంటనే అర్థం చేసుకుని అంతా బయటకు పరుగులు తీశామని ప్రైవేటు స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడు ఒకరు చెప్పారు. ఢిల్లీలో భూకంపం కారణంగా మెట్రో రైలు సర్వీసులను కాసేపు నిలిపివేశారు. నోయిడాలోని పలు షాపింగ్ మాల్స్ నుంచి జనం బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి తీవ్రంగా ప్రకంపించిందని, అపార నష్టం సూచనలు ఉన్నాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ తెలిపింది.

నేపాల్లోని ఢోలాక-సింధుపల్చోక్ మధ్య భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదైంది. కఠ్మాండు నుంచి తూర్పుదిశగా ఉన్న భిర్కోట్ కేంద్రంగా భారీ భూకంపం వచ్చింది. హిమాలయ పరివాహక ప్రాంతమంతా ప్రకంపనలు వచ్చాయి. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ప్రభావం ఎక్కువగా ఉంది. భూ ప్రకంపనలతో కఠ్మాంటు ఎయిర్పోర్టు నుంచి జనం పరుగులు తీశారు. భూమి కంపించడం మొదలుపెట్టగానే పెద్దగా కేకలు వేస్తూ ఎయిర్పోర్టు నుంచి బయటకు పారిపోయారు.

నేపాల్తో పాటు బంగ్లాదేశ్, చైనా, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో కూడా భూకంప ప్రభావం కనిపించింది. నేపాల్లో భూమికి 19 కిలోమీటరల్ లోపల భూమి కంపించినట్లు అమెరికా భూగర్భ శాఖ తెలిపింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా