ఈక్విటీ మార్కెట్లో ఈపీఎఫ్వో పెట్టుబడులు

18 Jul, 2016 14:09 IST|Sakshi
ఈక్విటీ మార్కెట్లో ఈపీఎఫ్వో పెట్టుబడులు

న్యూఢిల్లీ:  కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సంచలన ప్రకటన చేశారు.  పటిష్ఠంగా ఉన్న ఈక్విటీ మార్కెట్లలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పెట్టుబడి శాతాన్ని మరింత పెంచే యోచనలో ఉన్నట్టు తెలిపారు.   ఈ ఏడాది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్  నిధుల్లో దాదాపు 12 శాతం వరకు దీ్ర్ఘకాలిక పెట్టుబడులు పెట్టనున్నట్టు  ప్రకటించారు.  ఈనెల 22న జరగనున్న కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) సమావేశంలో, ఈటీఎఫ్‌లలో ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు.  ఈ అంశంపై  బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలతో కూడా చర్చలు జరుపుతున్నామని, గత ఏడాది కంటే ఎక్కువగానే పెట్టుబడులు ఉంటాయని దత్తాత్రేయ స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్లకు  నిధులు అవసరమని వివరణ ఇచ్చారు.

5 నుంచి 15 శాతం పెట్టుబడుటు పెట్టేందుకు  ఆర్థిక మంత్రిత్వ శాఖనుంచి తమకు  అనుమతి లభచిందన్నారు. దీర్ఘకాలంగా మార్కెట్లు నిలకడగా ఉండనున్నాయని భావించిన  మంత్రి  మార్కెట్ పరిస్థితులను బట్టి   దీర్ఘకాల పెట్టుబడి  10 నుంచి12 శాతానికి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు.  జూన్‌ 30 వరకు రెండు ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌)లలో ఈపీఎఫ్‌ఓ రూ.7,468 కోట్లు పెట్టుబడి పెట్టిందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఈ పెట్టుబడుల విలువ 7.45 శాతం పెరిగి రూ.8,024 కోట్లకు చేరిందని దత్తాత్రేయ తెలిపారు. సంస్థ నికర ఆదాయంలో   ఇప్పటికే వివిధ రూపాల్లో  పెట్టుబడులు పెట్టామని వాటిల్లో ఇది కూడా ఒకటని తెలిపారు.  ఈ సంవత్సరం, మదుపు ఆదాయం రూ 1.35 లక్షల కోట్లకు చేరుతుందని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.

మరోవైపు చందాదార్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ జోన్లను పెంచుతున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ప్రస్తుతం 10 జోన్ల సంఖ్యను 21కి పెంచుతున్నట్టు తెలిపారు.  ఆయా సంస్థల  అలాగే  గ్రామీణ, పట్టణ శివారు, అసంఘటిత రంగ, కాంట్రాక్టు కార్మికులను కూడా ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి తెస్తున్నందున పీఎఫ్‌ చందాదార్ల సంఖ్య ప్రస్తుత 6 కోట్ల నుంచి 9 కోట్లకు చేరుతుందని మంత్రి వివరించారు. ఇందుకోసం పార్లమెంట్ లోప్రతిపాదించిన ఈపీఎఫ్‌ చట్ట సవరణను కేంద్ర మంత్రిమండలి ఆమోదించాల్సి ఉందన్నారు. 

మరిన్ని వార్తలు