మన బంగారం..మహా ప్రియం!

12 Jan, 2014 02:10 IST|Sakshi
మన బంగారం..మహా ప్రియం!

భారతీయులకు బంగారమంటే మహా మోజు. ఇది ఏ స్థాయి మోజంటే... ఎంత ధరైనా కొనటానికి వెనకాడరు. ఎక్కువ డబ్బులు చేతికొచ్చినా, ఇంట్లో ఏ శుభకార్యం వచ్చినా బంగారం కొని తీరాల్సిందే. ఈ మక్కువను ఆసరా చేసుకుని ఇటు ప్రభుత్వం, అటు వ్యాపారులూ రెండువైపులా బాదేస్తుండటమే అన్నిటికన్నా ఘోరం. రెండు వైపులా చేస్తున్న అదనపు ‘‘వసూళ్లు’’ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసా? అక్షరాలా ఇరవై శాతం.  

ఆ వివరాలివిగో...
 బంగారం ఎక్కడ కొన్నా బంగారమే. ఏ దేశంలో కొన్నా బంగారమే. అలాంటపుడు ధర కూడా ఒకేలా ఉండాలి. కానీ మన దేశంలో మాత్రం అలా లేదు. అంతర్జాతీయంగా లభిస్తున్న ధరకంటే 20 శాతం అధికంగా ఉంది. దీన్లో కొంత ప్రభుత్వమే ‘దిగుమతి సుంకం’ పేరిట లాగేస్తుండగా.. మరికొంత ‘ప్రీమియం’ అంటూ వ్యాపారులు లాగేస్తున్నారు. పుత్తడి ట్రేడింగ్ ధరకు ప్రామాణికంగా తీసుకునే న్యూయార్క్, లండన్ మార్కెట్లలో ఈ శుక్రవారంనాటి ధర ఔన్సుకు (31.8 గ్రాములు) 1228 డాలర్లు. అంటే మన కరెన్సీలో డాలర్‌కు రూ.62 చొప్పున లెక్కిస్తే మొత్తం రూ.76,136 అవుతుంది. ఈ లెక్కన ఒక గ్రాముకు రూ.2,395. మరి 10 గ్రాముల ధర రూ.23,950 కావాలి కదా? మరి మన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీలో ఎంత పలుకుతోందో తెలుసా? సాక్షాత్తూ 28,930 రూపాయలు.

ఎందుకిలా...? దిగుమతి సుంకం పెంచేశారు...
 2011-2012 సంవత్సరాల్లో మన దేశం ఇబ్బడిముబ్బడిగా బంగారాన్ని దిగుమతి చేసుకుంది. దీంతో కరెంటు ఖాతా, వాణిజ్యలోటు బాగా పెరిగిపోయాయి. దీన్ని నియంత్రించడానికంటూ ప్రభుత్వం దిగుమతి సుంకాల్ని అమాంతం పెంచేసింది. మూడేళ్ల క్రితం 10 గ్రాములకు రూ.300 నిర్ణీత సుంకం వుండేది. అటు తర్వాత సుంకాన్ని దిగుమతి ధరలో 2 శాతంగా మార్చారు. దాన్నిపుడు 10 శాతానికి పెంచారు. ప్రస్తుతం అది రూ.2,400 వరకూ (ఇది ప్రపంచ మార్కెట్లో ధరను బట్టి పక్షం రోజులకోసారి మారుతుంది) ఉంది. సుంకం పెంపుతో పాటు దిగుమతులపై ప్రభుత్వం పలు నియంత్రణలు కూడా విధించింది.

ఇంతకుముందులా ఇక్కడ అమ్మడానికి ఎంతకావాలంటే అంత పుత్తడిని దిగుమతి చేసుకోకూడదు. ఆభరణ తయారీదారులు దిగుమతుల్లో తిరిగి 20 శాతం ఎగుమతి చేసే షరతుపైనే ఈ అనుమతి లభిస్తుంది. బ్యాంకుల దిగుమతులు, అమ్మకాలను రిజర్వుబ్యాంకు నిలుపుచేసింది. మనం వినియోగించే బంగారంలో ఇక్కడ ఉత్పత్తయ్యేది 2 శాతమే. రీసైకిల్ చేసిన పాత బంగారం కొంత మార్కెట్లోకి వస్తుంది. 80% వరకూ దిగుమతులపై ఆధారపడాల్సిందే.

 వ్యాపారులదీ అదే బాట...
 ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచింది సరే. అలా చూసుకున్నా 10 గ్రాములు రూ.26,350కి దొరకాలి. కానీ దానిపై వ్యాపారులు అధికారికంగానే మరో రూ.2,500 వడ్డిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో కొరత ఏర్పడింది కాబట్టి, డిమాండ్ ఉంది కాబట్టి ప్రీమియం ధరకు అమ్మాల్సివస్తుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇప్పుడు పసిడికి మునుపటంత డిమాండేమీ లేదు. అలాంటపుడుకొరత ప్రశ్న ఎక్కడిదనేది కొనుగోలుదార్ల ప్రశ్న.

 కొంపముంచిన రూపాయి...
 నిజానికి రూపాయి గనక ఇంత దారుణంగా పతనం కాకపోయి ఉంటే దిగుమతి సుంకం, వ్యాపారుల ప్రీమియం అన్నీ కలిపినా 10 గ్రాముల ధర పాతికవేల లోపే ఉండాలి. కానీ ఏడాదిన్నరగా రూపాయి క్షీణించిన ప్రభావం... పెట్రోల్, డీజిల్, వంటనూనెల వంటి దిగుమతి సరుకులతో పాటు అన్నిటికన్నా ఎక్కువగా పసిడిపై పడింది. దాంతో బంగారం గరిష్టస్థాయి 1920 డాలర్ల నుంచి 35% పతనమైనా... మన దగ్గర గరిష్ట ధర రూ.35,000తో పోలిస్తే 17 శాతమే తగ్గింది. 2010 మే నెలలో డాలరుతో మన రూపాయి విలువ రూ.45.57 దగ్గర ఉంది.

అప్పట్లో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకు 1,200 డాలర్లుండేది. అంటే మన కరెన్సీలో 10 గ్రాముల విలువ రూ.17,550. మధ్యలో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నా ఇంచుమించు ఇప్పుడు కూడా అంతర్జాతీయంగా బంగారం ధర అలాగే ఉంది. కానీ రూపాయి పతనం, ప్రభుత్వ సుంకం, వ్యాపారుల ప్రీమియం... అన్నీ కలిసి మన బంగారం 10 గ్రాముల ధరను రూ.28,930 వద్ద నిలబెట్టాయి. ఔరా! మనదెంత దురదృష్టమో కదా!!                 
 
 ఎన్నారైలు విదేశాల నుంచి తెస్తే..
 
 సరే! ఇక్కడ బంగారం కొంటే 10% దిగుమతి సుంకం, మరో 10% వ్యాపారుల ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. మరి విదేశాలకెళ్లినవారు అక్కడి నుంచి పుత్తడి తెచ్చుకోవచ్చా? దీనిపై ఏమైనా ఆంక్షలున్నాయా? దీన్ని చూసినపుడు... ఎన్నారైలు ఇక్కడికి వచ్చేటపుడు ఆభరణాల రూపంలో పురుషులైతే రూ.50,000, మహిళలైతే రూ.1,00,000 వరకు విలువ చేసే బంగారాన్ని తీసుకురావచ్చు. దీనిపై ఎలాంటి సుంకాలూ ఉండవు. అంటే నలుగురుండే కుటుంబమైతే గరిష్టంగా 3-4 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ఆభరణాల రూపంలో తేవొచ్చన్నమాట.

కాకపోతే ఇది పర్యాటకులు, ఇతరులకు వర్తించదు. ఏడాదికిపైగా విదేశంలో నివాసం ఉన్న ఎన్నారైలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఒకవేళ రూ.3 లక్షల విలువైన బంగారం తెచ్చుకుంటే ఇక్కడి ధరల ప్రకారం రూ.50వేల వరకూ లాభం పొందినట్లన్న మాట. ఈ లాభం పొందటానికి చాలామంది గల్ఫ్‌దేశాల్లో ఉంటున్న తమ స్నేహితులు, బంధుమిత్రుల ద్వారా బంగారం తెప్పించుకుంటున్నారు. దీంతో దుబాయ్‌లో గడిచిన ఐదారు నెలలుగా బంగారు ఆభరణాల అమ్మకాలు 50-60% వరకూ పెరిగాయట. ఇక ముడి రూపంలో దిగుమతి చేసుకునే బంగారంపై మాత్రం 9-13% దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది.

‘‘ఈ సుంకం చెల్లించి 1 కిలో ముడి బంగారాన్ని తెచ్చుకోవచ్చు. కాకపోతే అలా తెస్తున్న వారు విదేశాల్లో కనీసం 6 నెలలు ఉండాలి. ఈ లెక్కన చూసినపుడు ప్రీమియం రూపంలో కిలోపై దాదాపు రూ.2.5 లక్షలు లబ్ధి కలుగుతుంది’’ అని బులి యన్ రంగ నిపుణుడొకరు చెప్పారు. ఈ ఆంక్షల వల్ల ఇటీవల పరిమితిని మించి ఆభరణాలను ధరించి వస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్న కేసులూ పెరుగుతున్నట్లు కస్టమ్స్ అధికారులు చెపుతున్నారు.

మరిన్ని వార్తలు