ప్రైవేటు బస్సు ఆపరేటర్లతో సర్కారు లాలూచీ | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సు ఆపరేటర్లతో సర్కారు లాలూచీ

Published Sun, Jan 12 2014 2:04 AM

ప్రైవేటు బస్సు ఆపరేటర్లతో సర్కారు లాలూచీ - Sakshi

సాక్షి, హైదరాబాద్: నేను కొట్టినట్టు నటిస్తా.. నువ్వు ఏడ్చినట్టు నటించు... అన్నట్టుగా తయారైంది రాష్ట్రప్రభుత్వం, ప్రైవేటు బస్సు ఆపరేటర్ల వ్యవహారం. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రభుత్వంతో ఓ ‘అవగాహన’కు వచ్చారు. ఆ మేరకు పైకి.. ప్రైవేటు బస్సుల నియంత్రణకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. లోలోన మాత్రం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరింది. ఇందుకోసం రవాణాశాఖ పెద్దలు, ప్రైవేటు ఆపరేటర్లు ఓ ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. ఈ ప్రణాళికను అనుసరించి..
 
-     ప్రైవేటు బస్సులపై దాడులు, బస్సుల సీజ్, టికెట్ బుకింగ్ ఏజెంట్లపై కేసులు.. రోజూ యధా ప్రకారం మీడియాలో వార్తల కోసం జరుగుతూనే ఉంటాయి.
  -   ప్రైవేటు బస్సుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేజి క్యారేజీలుగా తిరగనివ్వబోమంటూ రవాణామంత్రి ప్రకటనలు చేయడానికి, 1,700 బస్సులపై దాడులు చేసి కేసులు పెట్టామని లెక్కలు ఘనంగా చెప్పడానికి ఈ దాడులు ఉపయోగపడతాయి. కానీ, అధికారులు చేసే దాడులేవీ బస్సు ఆపరేటర్లకు ఇబ్బంది కలిగించేలా ఉండవు.
-     దాడులు కూడా ప్రయాణికులు లేని బస్సుల మీదే జరుగుతుంటాయి.
 -    దాడులు చేయడానికి వీలుగా ప్రైవేటు ఆపరేటర్లే కొన్ని బస్సులను ఏర్పాటుచేస్తున్నారు. ఈ ప్రణాళికను పకడ్బందీగా అమలుచేస్తున్నారు.
-     ఈ మేరకు ప్రభుత్వ పెద్ద ఒకరికి భారీగా సొమ్ము ముట్టజెప్పారని, ఫలితంగా ఆపరేటర్లు ‘సంక్రాంతి’ని సొమ్ముచేసుకోవడానికి సదరు నేత అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం.
 
 యథేచ్ఛగా తిరుగుతున్న స్టేజి క్యారేజీలు
 రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు స్టేజి క్యారేజీలుగా యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి. సాక్షాత్తూ రవాణా కమిషనర్ కార్యాలయం ముందు నుంచే పెద్ద సంఖ్యలో తిరుగుతున్నా.. అధికారులకు కనిపించవు. పికప్ పాయింట్ల వద్ద మినీ బస్సుల్లో ప్రయాణికులను ఎక్కించుకుని నగర శివార్లలో బస్సుల వద్దకు తరలిస్తున్నా.. పట్టించుకోరు. అంతేకాదు.. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనండంటూ మినీ బస్సులు, బస్సులపైన రాసుకుని తిరుగుతున్నా అధికారులు చూడనట్లే వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అన్ని ట్రావెల్స్ సంస్థలూ ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నాయి. అధికారులు చొరవ తీసుకుని కేసు నమోదు చేస్తే సైబర్ నేరం కింద పోలీసులు దర్యాప్తు చేపడతారు. కానీ ఈ కేసును నేరుగా యాజమాన్యంపైనే పెట్టాల్సి ఉండడంతో అధికారులు టికెట్ బుకింగ్ ఏజెంట్లు కొందరిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement