ముఖ్యమంత్రిని కడిగి పారేసిన షుంగ్లు కమిటీ

6 Apr, 2017 08:21 IST|Sakshi
ముఖ్యమంత్రిని కడిగి పారేసిన షుంగ్లు కమిటీ

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేసిందని ముగ్గురు సభ్యులతో కూడిన షుంగ్లు కమిటీ కడిగి పారేసింది. ఈ కమిటీని పాత లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నియమించారు. పార్టీ కార్యాలయం కోసం ఆప్‌కు భూమి కేటాయింపు, మంత్రి సత్యేంద్ర జైన్ కుమార్నెతను ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మిషన్ డైరెక్టర్‌గా నియమించడం, పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను సలహాదారులుగా వేసుకోవడం లాంటి నిర్ణయాలను తూర్పారబట్టింది. భారత రాజ్యాంగంలోని 239ఎఎ (3)ఎ ప్రకారం ఢిల్లీ అసెంబ్లీకి బదిలీ అయిన అన్ని విషయాల్లోనూ లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఏమాత్రం సంప్రదించాల్సిన అవసరం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలిన అధికారులకు సూచిస్తూ కేజ్రీవాల్ స్వయంగా 2015 ఏప్రిల్ నెలలో ఇచ్చిన ఉత్తర్వులను కూడా కమిటీ తప్పుబట్టింది.

ఆమ్ ఆద్మీ పార్టీ కోసం కార్యాలయ భవన నిర్మాణానికి ఆప్ ప్రభుత్వమే భూమి కేటాయించడం ఏ విధంగానూ చెల్లుబాటు కాదని, అలాగే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌కు నివాస భవనం ఎలా కేటాయిస్తారని కూడా షుంగ్లు కమిటీ ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ప్రశ్నిస్తూ కమిటీ దాదాపు 100 పేజీల నివేదిక సిద్ధం చేసింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను సంప్రదించకుండా సలహాదారులను నియమించుకునే అధికారం కేజ్రీవాల్‌కు గానీ, ఆయన మంత్రివర్గానికి గానీ లేదని తెలిపింది. అలాగే అవినీతి నిరోధక శాఖలో అధికారుల నియామకాలు, బదిలీలపై నిర్ణయాలు తీసుకోవడాన్ని కమిటీ ప్రశ్నించింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా మంత్రులు విదేశీ ప్రయాణాలు చేయడం, న్యాయవాదులను నియమించడం లాంటివాటినీ తప్పుబట్టింది. ఈ కమిటీ ఏవైనా అక్రమాలను గుర్తిస్తే, కేజ్రీవాల్ క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉండొచ్చని గతంలో నజీబ్ జంగ్ అన్నారు. ఇప్పుడు పరిస్థితి దాదాపు అలాగే ఉంది. దీనిపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు