ప్రపంచ వారసత్వ సంపదగా‘రాణి కీ వావ్’

23 Jun, 2014 00:32 IST|Sakshi
ప్రపంచ వారసత్వ సంపదగా‘రాణి కీ వావ్’

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ‘రాణి కీ వావ్’కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల (వరల్డ్ హెరిటేజ్ సైట్స్) జాబితాలో రాణి కీ వావ్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఖతార్‌లోని దోహాలో జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాల్లో యునెస్కో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడంలో నాటి సాంకేతిక అభివృద్ధికి రాణి కీ వావ్ అత్యద్భుత నిదర్శనంగా నిలిచిందని యునెస్కో కొనియాడింది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఏడు భూగర్భ అంతస్తుల బావి భారత్‌లో నాటి ప్రత్యేక భూగర్భ నిర్మాణ కౌశలానికి, కళాత్మకతకు ఉదాహరణగా నిలిచిందని ప్రశంసించింది.

 

వరదలకుతోడు నాటి భూగర్భ మార్పుల వల్ల సరస్వతి నది కనుమరుగు కావడంతో ఈ బావి దాదాపు ఏడు శతాబ్దాలపాటు మట్టిలో కూరుకుపోయింది. అనంతర కాలంలో భారత పురావస్తుశాఖ ఈ బావిని గుర్తించి అది పాడవకుండా చర్యలు చేపట్టింది. దీనిని పఠాన్ రాజు సిద్ధార్థజైసింగ్ నిర్మించారు. ఇందులో గంగాదేవి ఆలయం ఉంది.

మరిన్ని వార్తలు