కోటి రూపాయల బొమ్మకూ సై..

12 Sep, 2013 12:07 IST|Sakshi
కోటి రూపాయల బొమ్మకూ సై..
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మనసుకు నచ్చితే చాలు కోటి రూపాయల ప్రతిమను సైతం భారత్‌లో కొనేవారు ఉన్నారు. ఇక్కడివారు ఇంటిని, కార్యాలయాన్ని అందంగా మలచుకుంటారు. ఇందుకు ఖరీదైన పోర్సిలిన్ బొమ్మలను కోరుకుంటున్నారని స్పెయిన్ కంపెనీ లాడ్రో వైస్ ప్రెసిడెంట్ ఏంజిల్స్ లాడ్రో అన్నారు. రామ్ దర్బార్ లిమిటెడ్ ఎడిషన్ ప్రతిమలను ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆమె సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. పోర్సిలిన్ తయారీలో ప్రపంచ అగ్రగామిగా లాడ్రో నిలిచిందని చెప్పారు. ఒక్కో బొమ్మ తయారీకి సంవత్సరాలు కూడా పడుతుందని అన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
 
 మాస్టర్ పీస్‌కే రెండేళ్లు..
 పోర్సిలిన్ అనేది ఒక రకమైన పింగాణి. దీని తయారీలో కావోలినైట్ అనే ఖనిజం ప్రధాన ముడిపదార్థం. ఫెల్‌స్పర్, బాల్ క్లే, గాజు, ఎముకల పొడి, క్వార్ట్జ్, పెటుంట్సె తదితర ముడిపదార్థాలను 1,200-1,400 డిగ్రీల సెల్సియస్‌లో కరిగిస్తే పోర్సిలిన్ తయారవుతుంది. గట్టిగా ఉండడమేకాదు కాంతి సారకత (మసకగా) దీని ప్రత్యేకత. ఇక రామ్ దర్బార్‌లో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడి విగ్రహాలున్నాయి. వీటి ఖరీదు రూ.8.10 లక్షలు. ప్రతిమ ప్రోటోటైప్ తయారీకి ఏడాదిపైగా పట్టింది. మాస్టర్ పీస్ రూపొందించడానికి మరో రెండేళ్ల సమయం తీసుకుంది. దీని ఆధారంగా ఒక్కో బొమ్మ తయారీకి 45 రోజులు పడుతుంది. అన్ని ప్రతిమలు పూర్తిగా చేతితో చేసిందే. మొహం, పూలు, గొలుసుల తయారీకి, రంగులు వేయడానికి వేర్వేరు నిపుణులుంటారు. ప్రతిమ తయారీకి ముందు మా నిపుణుల బృందం భారత్‌లోని ఆలయాలను సందర్శించింది. 
 
 హైదరాబాద్‌లోనూ కస్టమర్లు..
 ‘‘క్వీన్ ఆఫ్ ద నైల్’’ అన్ని బొమ్మల్లోకెల్లా ఖరీదైనది. ధర రూ.1.4 కోట్లు. హై పోర్సిలిన్‌తో తయారైంది. లిమిటెడ్ ఎడిషన్‌లో 100 పీసులే తయారు చేశాం. ఇప్పటికి 90 అమ్ముడయ్యాయి. భారత్‌లో 11 పీసులు విక్రయించాం. రూ.7.5 లక్షల విలువైన గణేశుడి ప్రతిమలు 499 పీసులు మూడు నెలల్లో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రూ.7.5 లక్షల విలువైన లక్ష్మి దేవి ప్రతిమ భారత్‌లో 100 విక్రయించాం. వీటిలో పదింటిని హైదరాబాదీయులు కైవసం చేసుకున్నారు. ‘‘డే డ్రీమింగ్ బై ద పాండ్ లే’’ అనే బొమ్మను అయిదుగురు భాగ్యనగరవాసులు దక్కించుకున్నారు. దీని ధర రూ.4 లక్షలు. ఆంధ్రప్రదేశ్‌లోని 600 మంది కస్టమర్లలో 10 శాతం మంది హైదరాబాద్ వెలుపల ఉన్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానం హైదరాబాద్‌దే. లాడ్రో మొత్తం అమ్మకాల్లో భారత్ వాటా 10 శాతం. ఇక్కడ వృద్ధి రేటు 30 శాతముంది.
 
 బహుమతికే ఎక్కువ..: ప్రపంచవ్యాప్తంగా చూస్తే లాడ్రో ఔట్‌లెట్లలో అమ్ముడవుతున్న ప్రతిమల్లో 65-70 శాతం బహుమతి ఇవ్వడానికే కొంటున్నారు. భారత్‌లో ఇది 60 శాతం ఉంది. భారతీయ కలెక్షన్‌లో 30 శాతం అమ్మకాలు అమెరికాలో నమోదు అవుతున్నాయి. స్పెయిన్, హాంకాంగ్, ఇండోనేసియా, జపాన్‌లోనూ వీటిని కొంటున్నారు. రానున్న రోజుల్లో భారత్ కోసం ప్రత్యేక ప్రతిమలు తయారు చేస్తాం. లాడ్రో ఏటా 100కుపైగా కొత్త బొమ్మలను పరిచయం చేస్తోంది. ఇందులో లిమిటెడ్ ఎడిషన్ వాటా 80 శాతం. స్పెయిన్‌లోని వలెన్సియాలో ఉన్న ఏకైక ప్లాంటులో ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. 120 దేశాల్లో విక్రయిస్తున్నాం. జపాన్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాకు ప్రాధాన్య దేశాలు. ప్రస్తుతం భారత్‌లో హైదరాబాద్‌లో ఒకటి, మిగిలిన ప్రాంతాల్లో ఏడు ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లు, పది షాప్ ఇన్ షాప్స్ నిర్వహిస్తున్నాం. 
 
మరిన్ని వార్తలు