ఆ నరహంతకుడిని అరెస్ట్‌ చేశారు

17 Jan, 2017 09:23 IST|Sakshi
ఆ నరహంతకుడిని అరెస్ట్‌ చేశారు

ఇస్తాంబుల్‌: టర్కీలోని ఇస్తాంబుల్‌ నైట్‌ క్లబ్‌లో న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా కాల్పులు జరిపి 39 మందిని పొట్టనపెట్టుకున్న నరహంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసు ఆపరేషన్లో దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్టు మంగళవారం ఉదయం టర్కీ మీడియా వెల్లడించింది.

ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు ఎసెన్యుర్ట్ జిల్లాలోని ఓ ఇంట్లో నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. కిర్జిస్థాన్కు చెందిన ఓ స్నేహితుడు ఇంట్లో ఆశ్రయం పొందినట్టు టర్కీ మీడియా పేర్కొంది. నిందితుడిని ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ఖదీర్‌ మషరిపోవ్‌గా గుర్తించినట్టు వెల్లడించింది. అబ్దుల్ఖదీర్‌తో పాటు మరో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేసింది. అతనికి భార్య, ఏడాది కూతురు ఉన్నట్టు పేర్కొంది. కాగా పోలీసులు ఈ విషయాలను అధికారికంగా ప్రకటించలేదు. నిందితుడికి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం విచారణ కోసం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్కు తరలించారు. టర్కీ ఉప ప్రధాని నుమన్‌ కుర్టుల్మస్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మెవ్లుట్‌ కవుసోగ్లులు.. నిందితుడి అరెస్ట్‌ వార్తను ధ్రువీకరించారు. పోలీసులను, ఇంటలిజెన్స్ సంస్థలను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

జనవరి 1వ తేదీ వేకువజామున కాల్పుల ఘటన జరిగిన తర్వాత ఈ దాడికి తమదే బాధ్యతని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. సిరియాలో టర్కీ మిలటరీ ఆపరేషన్లకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు వెల్లడించింది.

(ఇస్తాంబుల్‌ దాడిలో ఇద్దరు భారతీయుల మృతి)

మరిన్ని వార్తలు