చైనా బరితెగింపు.. సంచలన వీడియో

20 Aug, 2017 10:02 IST|Sakshi
చైనా బరితెగింపు.. సంచలన వీడియో

- లడఖ్‌లో భారత జవాన్లపై రాళ్లు, రాడ్లతో దాడి
- డ్రాగన్‌ దుశ్చర్య వీడియో వైరల్‌.. అధికారుల మౌనం


న్యూఢిల్లీ:
భారత జవాన్లపై చైనా సైనికులు దాడిచేసిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. లడఖ్‌(జమ్ముకశ్మీర్‌)లోని ప్యాంగ్యాంగ్‌ సరస్సు వద్ద ఆగస్టు 15న ఈ ఘటన చోటుచేసుకుంది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన చైనా సైన్యం.. అక్కడ గస్తీకాస్తోన్న ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) బలగాలపై దుశ్చర్యకు దిగింది. రాళ్లు విసురుతూ, ఇనుపరాడ్లతో కొడుతూ బీభత్సం సృష్టించింది. ప్రతిగా భారత బలగాలు సైతం రాళ్లు విసిరాయి. పరస్పరం కాళ్లతో తన్నుకున్న దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి.

స్వాతంత్ర్యదినోత్సవం నాడే జరిగిన ఈ సంఘటనపై భారత్‌ నిరసనను వ్యక్తం చేసినప్పటికీ, చైనా మాత్రం దుందుడుకుగా సమాధానమిచ్చింది. ‘అవునా! మా వాళ్లు బోర్డర్‌ దాటిన సంగతి నాకు తెలియదు’అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యుంగ్‌ వెటకారాన్ని ప్రదర్శించారు. అయితే, తాజాగా వీడియో బహిర్గతం కావడంతో చైనా దుష్టత్వం బయటపడినట్లైంది. ప్యాంగ్యాంగ్‌ సరస్సు మూడొంతుల భాగం చైనా ఆధీనంలో ఉండగా, ఒక వంతు భారత్‌ ఆధీనంలో ఉంది.

భారత్‌ సంయమనం: ఆగస్టు 15న ప్యాంగ్యాంగ్‌ సరస్సు వద్ద చోటుచేసుకున్న ఘటనపై ఆ తర్వాతి రోజు(బుధవారం) కీలక సమావేశం జరిగిందని సైనిక వర్గాలు తెలిపాయి. చుషుల్‌(లేహ్‌) సెక్టార్‌లో ఇరుదేశాల అధికారుల భేటీలో.. భారత్‌ నిరసన తెలపగా, తప్పందా మీదేనని డ్రాగన్‌ ఎదురుదాడికి దిగింది. చైనా వాదన తప్పని నిరూపించడానికే ఇప్పటి వీడియో బహిర్గతపర్చినట్లు సమాచారం. ఈ విషయంపై భారత అధికారులు ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నారు. సిక్కింలోని డోక్లాం వద్ద చైనా రోడ్డు నిర్మాణానికి భారత్‌ అడ్డు తగలడంతో మొదలైన ఉద్రిక్తత.. గడిచిన రెండు నెలలుగా కొనసాగుతూనే ఉంది. మొత్తం ఐదు సరిహద్దుల వద్ద ఇరు దేశాలూ భారీగా సైన్యాన్ని మోహరించాయి. (వీడియోలో ఎడమవైపు ఉన్నది చైనా, కుడివైపు భారత జవాన్లు)