ఆవుల మూత్రంలో బంగారం!

28 Jun, 2016 09:34 IST|Sakshi
ఆవుల మూత్రంలో బంగారం!

జునాఘడ్: గుజరాత్ లోని జునాఘడ్ జిల్లాలో ఎక్కువగా కనిపించే గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 400 గిర్ జాతి ఆవుల మూత్రంపై నాలుగేళ్ల పాటు విస్తృతంగా పరిశోధనలు జరిపిన జునాఘడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(జేఏయూ) లీటర్ మూత్రంలో మూడు మిల్లీ గ్రాముల నుంచి 10 మిల్లీ గ్రాముల వరకు బంగారం ఉన్నట్టు పేర్కొన్నారు. బంగారానికి సంబంధించిన ధాతువులు నీటిలో కలిసిపోయి ఆవుల మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

పూర్వీకుల చిత్రాల్లో మాత్రమే ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు తెలిసేదని, పరిశోధనలు చేయగా అది నిజమేనని తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని రకాల కెమికల్ పద్ధతులను ఉపయోగించి ఆవుల మూత్రం నుంచి బంగారాన్ని బయటకు తేవచ్చని చెప్పారు. ఒంటె, గేదే, గొర్రె, మేకలపై కూడా ఇలాంటి పరిశోధనలు చేశామని చెప్పారు. అయితే, వాటి మూత్రంలో వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి ఆధారాలేవీ కనిపించలేదని వివరించారు.

గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో అనేక రకాల వ్యాధులకు నిరోధకంగా పనిచేసే లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ పరిశోధనలు చేసే జేఏయూ ఫుడ్ టెస్టింగ్ లాబోరేటరీ ఏటా దాదాపు 50,000లకు పైగా పరీక్షలు జరుపుతుంది. ఎగుమతులు, డైరీ ప్రొడక్ట్స్, కూరగాయలు, దినుసులు, తేనే, పురుగుల మందులు తదితరాలపై పరిశోధనలు ఇక్కడ నిర్వహిస్తారు. ప్రస్తుతం గిర్ ఆవుల మూత్రం మనుషుల జబ్బులకు, వృక్షాల పెంపకానికి ఎలా పనిచేస్తుందో పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రజ్ఞులు వివరించారు.

మరిన్ని వార్తలు