కొనసాగుతున్న కశ్మీర్‌ అశాంతిపై ఉత్కంఠ!

8 Aug, 2016 17:14 IST|Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో గత 30 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తత ఇప్పటికీ సద్దుమణుగకపోవడంతో.. ఈ విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి.. లోయలో సాధారణ పరిస్థితుల్ని ఎలా పునరుద్ధరిస్తాయన్నది ఉత్కంఠగా మారింది. ఉగ్ర సంస్థ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని జులై 8న భద్రతాదళాల ఎన్‌కౌంటర్లో చనిపోయిననాటి నుంచి కశ్మీర్‌లో ఆందోళనలు, అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి సోమవారం ఢిల్లీకి వచ్చి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. కశ్మీర్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఏం చేయాలనే దానిపై వీరు చర్చించారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ అంశంపై రాజ్యసభలో స్పందించింది. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా రాజకీయ ప్రక్రియను చేపట్టాలని, దీనిని శాంతిభద్రతల అంశంగా పరిగణించరాదని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ సూచించారు. కశ్మీర్‌ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేయాలని కోరారు. ఈ విషయమై అఖిలపక్ష భేటీని నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు కశ్మీర్‌ తాజా అలర్ల విషయంలో ముఖ్యమంత్రి మెహబూబా తీరుపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కశ్మీర్‌ అల్లర్లలో 50కిపైగా మంది చనిపోయి.. 31 రోజులపాటు ఘర్షణలు కొనసాగిన తర్వాత మెహబూబా ఎట్టకేలకు రంగంలోకి దిగారని, ఇన్నాళ్లు కొనసాగించిన తన యథాతథ స్థితి ధోరణని మార్చుకొని, ఇప్పటికైనా ఆమె ఢిల్లీకి వెళ్లి చర్యలకు ఉప్రకమించారని ఒమర్‌ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు