దమ్ముంటే అరెస్టు చేయండి

4 Feb, 2015 04:15 IST|Sakshi
దమ్ముంటే అరెస్టు చేయండి

కేంద్రానికి కేజ్రీవాల్ సవాల్
 విరాళాలపై సీబీఐతో దర్యాప్తునకు సిద్ధమని ప్రకటన
 అన్ని పార్టీల విరాళాలపై నిగ్గు తేల్చాలంటూ సీజేఐకి లేఖ

 
 న్యూఢిల్లీ: ‘‘ప్రభుత్వం మీది. పోలీసు, దర్యాప్తు సంస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. సీబీఐ, ఈడీ, ఐబీ, ఐటీ విభాగాలు మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. మీకు దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి..’’ అంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బోగస్ కంపెనీ నుంచి ఆప్ రూ.2 కోట్లు వసూలు చేసిందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ విషయంలో సీబీఐతో సహా ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
 
 మంగళవారం త్రిలోక్‌పురి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికల ముంగిట తనపై బురద చల్లేందుకే బీజేపీ ఈ దిగజారుడు ఆరోపణలకు దిగుతోందని విమర్శించారు. కాగా, తమకు వచ్చిన నిధులతోపాటు కాంగ్రెస్, బీజేపీలకు అందుతున్న నిధులపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని ఆప్ డిమాండ్ చేసింది.
 
 ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ చేయించాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి లేఖ రాసింది.  ఒకవేళ తాము తప్పు చేసినట్లు తేలితే పార్టీ గుర్తింపు రద్దు చేయాలని, ఇతర పార్టీల అక్రమాలు వెల్లడైనా అదే రీతిలో స్పందించాలని పేర్కొంది. ఈ దర్యాప్తునకు ఒప్పుకోవాల్సిందిగా కోరుతూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కూడా లేఖలు రాశారు.
 
 ఆప్ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది: నకిలీ కంపెనీల నుంచి రూ.2 కోట్ల నిధులు తీసుకుంటూ ఆప్ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. వివిధ కంపెనీల పేరిట అటూ ఇటూ తిప్పి నల్లధనాన్ని ఇలా పొందారని ఆరోపించారు. దీనిపై సంబంధిత అధికారులు సరైన సమయంలో కచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ అంశంపై ఆప్ సుప్రీంకోర్టు దర్యాప్తు కోరిందన్నారు.
 

>
మరిన్ని వార్తలు