మైక్రోసాఫ్ట్‌.. స్మార్ట్‌ ఆర్గనైజర్‌

15 Mar, 2017 03:46 IST|Sakshi
మైక్రోసాఫ్ట్‌.. స్మార్ట్‌ ఆర్గనైజర్‌

రోజూ పదులు, వందల సంఖ్యలో నోటిఫికేషన్స్, ఎస్‌ఎంఎస్‌లు అందుకునే కాలం ఇది. అర్జంటు అవసరం వచ్చి... ఒక ఎస్‌ఎంఎస్‌ను వెతకాలంటే? అబ్బో చాలా ఇబ్బంది... కష్టం కూడా! ఈ సమస్య మనందరికి ఏదో ఒకసారి వచ్చే ఉంటుంది కదూ. మైక్రోసాఫ్ట్‌ గారేజ్‌ బృందం ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారాన్ని ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్‌ ఆప్‌ రూపంలో వస్తున్న దీని పేరు సింపుల్‌గా ఎస్‌ఎంఎస్‌ ఆర్గనైజర్‌. అంతే! మనకు వచ్చే అన్ని ఎస్‌ఎంఎస్‌లను తనే సొంతంగా వర్గీకరించి ముఖ్యమైన వాటిని హైలైట్‌ చేస్తుందీ అప్లికేషన్‌. ఎల్లుండి మీరెక్కాల్సిన ఫ్లైట్‌ వివరాలు కావచ్చు... వెళ్లాల్సిన సినిమా టైమింగ్స్, థియేటర్‌ వివరాలు కావచ్చు... ఇలా అన్ని ముఖ్యమైన సందేశాలను తనంతటతానే వర్గీకరించడం భలే ఉంటుంది కదూ!  

వీటితోపాటు భార్య పుట్టిన రోజు, పెళ్లిరోజు.. చెల్లించాల్సిన బిల్లుల వివరాల వంటివి కూడా రిమైండర్‌ కార్డ్‌ల రూపంలో మీకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది ఇది. నిత్యవ్యవహారాలకు సంబంధించిన, వ్యక్తిగత, వ్యాపార సంబంధమైన సందేశాలను వేటికి వాటిని వేరు చేసేందుకు దీంట్లో మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీని ఉపయోగించారు. కేవలం మూడు మెగాబైట్ల సైజు మాత్రమే ఉండే ఈ ఆప్లికేషన్‌ ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా కూడా పనిచేస్తుంది. ఎస్‌ఎంఎస్‌ల వర్గీకరణ మొత్తం మన స్మార్ట్‌ఫోన్‌లోనే పూర్తవుతుంది కాబట్టి.. మనకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఇతరులకు తెలుస్తుందన్న బెంగ కూడా అవసరం లేదు. మనకు అవసరమైన ఎస్‌ఎంఎస్‌లను అవసరమైనప్పుడు సులువుగా కనిపించేలా కూడా చేసుకోవచ్చు. ఎస్‌ఎంఎస్‌ ఆర్గనైజర్‌ పేరుతో మరికొన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ దీన్ని తయారు చేసింది మైక్రోసాఫ్ట్‌ అన్నది గుర్తుంచుకోవాలి. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభించే ఈ అప్లికేషన్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు మాత్రమే పరిమితం.      
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

>
మరిన్ని వార్తలు