అనూహ్యం: కొత్త రక్షణమంత్రి నిర్మల!

3 Sep, 2017 14:28 IST|Sakshi
అనూహ్యం: కొత్త రక్షణమంత్రి నిర్మల!

సాక్షి, న్యూఢిల్లీ: తాజా కేంద్ర కేబినెట్‌ విస్తరణలో కీలకమైన రక్షణశాఖ ఎవరికి అప్పగిస్తారన్న అంశానికి తెరపడింది. అనూహ్యంగా నిర్మలా సీతారామన్‌కు ఈ కీలకమైన పదవి దక్కింది. ఎవరూ ఊహించనిరీతిలో ఆమెకు ఈ పదవి దక్కడం గమనార్హం. వాణిజ్య, జౌళి శాఖల సహాయమంత్రిగా సమర్థంగా పనిచేసిన నిర్మల పనితీరును మెచ్చి..  ప్రధాని మోదీ ఆమెకు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించారు. సరిహద్దుల్లో పాకిస్థాన్‌, చైనాతో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఒక మహిళకు ఈ పదవిని అప్పగించడం గమనార్హం. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్‌ ఘనత సొంతం చేసుకున్నారు.

ఇక, మిగతా పోర్ట్‌పోలియోల కేటాయింపు ఊహించినరీతిలోనే సాగింది. ఉత్తరప్రదేశ్‌లో వరుస రైలుప్రమాదాల నేపథ్యంలో సురేశ్‌ ప్రభు రైల్వేమంత్రిగా రాజీనామా చేయడంతో కీలకమైన ఈ శాఖ  పీయూష్‌ గోయల్‌కు దక్కింది. తాజా విస్తరణలో కేబినెట్‌ మంత్రిగా పీయూష్‌ ప్రమోషన్‌ పొందిన సంగతి తెలిసిందే. ఇక, వాణిజ్యశాఖ మంత్రిగా సురేశ్‌ ప్రభు, పెట్రోలియం, స్కిల్‌ డెవలప్‌మెంట్ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్‌, సమాచారశాఖ మంత్రిగా స్మృతి ఇరానీ, ఉపరితల రవాణా, జలవనరులశాఖ మంత్రిగా నితిన్‌ గడ్కరీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్‌ గజపతిరాజు (పౌరవిమానాయానం), సుజనాచౌదరి (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ)శాఖల్లో మార్పలేమీ చోటుచేసుకోలేదు.
 

రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లిపోవడంతో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ రక్షణశాఖ బాధ్యతలను అదనంగా మోస్తున్న సంగతి తెలిసిందే. ఈ శాఖను నిర్మలా సీతారామన్‌కు కేటాయించడంతో ప్రస్తుతం జైట్లీ వద్ద ఆర్థికశాఖతోపాటు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కూడా ఉంది. తాజా కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో అదనపు బాధ్యతల భారం నుంచి విముక్తి లభిస్తుందని భావిస్తున్నట్టు ఆర్థికమంత్రి జైట్లీ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో కొత్త మంత్రుల మంత్రిత్వశాఖలు ఇలా ఉండనున్నాయి.
మంత్రులు-మంత్రిత్వశాఖలు
రక్షణశాఖ: నిర్మలా సీతారామన్‌
ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ: అరుణ్‌ జైట్లీ
పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి శాఖ: ధర్మేంద్ర ప్రధాన్‌
పరిశ్రమలు, వాణిజ్య శాఖ: సురేశ్‌ ప్రభు
తాగునీరు,పారిశుద్ధ్యం శాఖ: ఉమాభారతి
రైల్వేశాఖ: పీయూష్‌ గోయల్‌
టెక్స్‌టైల్‌, సమాచారశాఖ: స్మృతి ఇరానీ
మైనారిటీ వ్యవహారాలశాఖ: ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ
ఉపరితల రవాణా, జలవనరులశాఖ: నితిన్‌ గడ్కరీ
గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, గనులు: నరేంద్ర తోమర్‌ (స్వతంత్ర హోదా)
విద్యుత్‌ శాఖ: రాజ్‌కుమార్‌ సింగ్‌ (స్వతంత్ర హోదా)
టూరిజంశాఖ: అల్ఫాన్స్‌ కన్నంథనమ్‌ (స్వతంత్ర హోదా)
పట్టణాభివృద్ధి, హౌజింగ్‌: హర్దీప్‌సింగ్‌ పూరి (స్వతంత్ర హోదా)
క్రీడలు, యువజన వ్యవహారాలు: రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ (స్వతంత్ర హోదా)
పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి: విజయ్‌ గోయల్‌
ఆర్థికశాఖ సహాయమంత్రి: శివప్రతాప్ శుక్లా
వైద్య, ఆరోగ్యశాఖ సహాయమంత్రి: అశ్వినీకుమార్‌ చూబే
స్కిల్‌ డవలప్‌మెంట్‌ సహాయమంత్రి: అనంత్‌కుమార్‌ హెగ్డే
వ్యవసాయశాఖ సహాయమంత్రి: గజేంద్రసింగ్‌ షెకావత్‌
మానవ వనరులశాఖ సహాయమంత్రి: సత్యపాల్‌ సింగ్‌
మహిళా, శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాల సహాయమంత్రి: వీరేంద్ర కుమార్‌