ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు నో ఫైన్!

10 Nov, 2016 10:08 IST|Sakshi
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు నో ఫైన్!
అహ్మదాబాద్ : సిటీల్లో ఎక్కడ వాహనం ఆపితే.. ఎక్కడ ఫైన్ వేస్తారోనని వాహనదారులకు తెగ భయపడుతుంటారు. పొరపాటున ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారో ఇక వారిపని అంతే. 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు జరిమానాను ముక్కు పిండి వసూలు చేస్తారు. కానీ  ప్రధాని నరేంద్రమోదీ 500, 1000 పెద్ద నోట్లను రద్దు చేస్తూ మంగళవారం రాత్రి తీసుకున్న సంచలన నిర్ణయంతో, ఇటు ప్రయాణికలు దగ్గర, అటు ట్రాఫిక్ పోలీసుల దగ్గర సరిపడ చిల్లర లేదా నగదు కరువైంది. దీంతో చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు రెండు రోజుల వరకు ఎలాంటి ఫైన్ విధించకూడదని నగర ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీఅయ్యాయి. దేశంలో నెలకొన్న నగదు సమస్య మెరుగయ్యేంత వరకు ప్రయాణికులకు ఫైన్ విధించకూడదని నిర్ణయించారు.
 
చిల్లర సమస్యను భరించలేని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని సిటీ పోలీసు కమిషనర్ ఏకే సింగ్ దగ్గరకు తీసుకెళ్లినట్టు డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనల్ సుభాష్ త్రివేదీ తెలిపారు. మానవతావాదంతో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారికి నగదు జరిమానాలు విధించకూడదని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అయితే ట్రాఫిక్ ఉల్లంఘనల నేరం పెద్దది అయితే, నాన్-కాగ్నిజేబుల్ కోర్టు మెమోను జారీచేస్తామని చెప్పారు. వాహనదారుడు ఈ జరిమానాను తర్వాత కోర్టుకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం ప్రకటించిన అనంతరం నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులందరూ జరిమానా కింద రూ.500, రూ.1000నోట్లనే తీస్తున్నట్టు తెలిపారు.      
మరిన్ని వార్తలు