మోదీ ఆసనం.. నితీశ్ గానం!

20 Jun, 2016 19:44 IST|Sakshi
మోదీ ఆసనం.. నితీశ్ గానం!

ప్రపంచమంతా మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడానికి సిద్ధమవుతుండగా బిహార్ మాత్రం అందుకు భిన్నమైన రాగాన్ని ఎత్తుకుంటోంది.

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించవద్దని నిర్ణయించారు. దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి పూనుకోవాలని తాను ఇచ్చిన పిలుపును కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ పట్టించుకోకపోవడంతో అందుకు ప్రతిగా యోగా దినోత్సవానికి దూరంగా ఉండాలని నితీశ్ భావిస్తున్నారట.

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా ప్రపంచమంతా యోగాసనాలు వేస్తుండగా మరీ నితీశ్ ఏం చేయబోతున్నారంటే.. సంగీత రాగాలాపన చేయాలని ఆయన నిర్ణయించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంతోపాటు అంతగా ప్రాచుర్యంలేని ప్రపంచ సంగీత దినోత్సవాన్ని కూడా జరపుకొంటారు. కాబట్టి మంగళవారం బిహార్ లో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించాలని నితీశ్ సర్కార్ నిర్ణయించింది. మోదీకి, నితీశ్ కి రాజకీయ బద్ధవైరం ఉన్న సంగతి తెలిసిందే. మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి రంగం సిద్ధం చేయడంతో 2014లో ఆ పార్టీతో ఉన్న పొత్తును నితీశ్ తెగదెంపులు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు