పార్లమెంట్‌ ఉభయసభల్లో రగడ

3 Feb, 2017 11:23 IST|Sakshi
పార్లమెంట్‌ ఉభయసభల్లో రగడ

న్యూఢిల్లీ: బడ్జెట్‌ ప్రకటన తర్వాత శుక్రవారం తిరిగి ప్రారంభమైన పార్లమెంటులో గందరగోళం నెలకొంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు పెద్ద పెట్టున నినాదాలు చేశాయి. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టేప్రయత్నం చేయగా, కాంగ్రెస్‌ సభ్యులు సభను అడ్డుకున్నారు. సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యుడైన ఇ.అహ్మద్‌ మరణాన్ని పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్‌ ప్రదేశపెట్టడం దారుణమని, ఆయన మరణవార్తను ప్రకటించడంలో కుట్రలు జరిగాయని ఆరోపిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్‌.. సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు.

అటు రాజ్యసభ మొదలవుతూనే తృణమూల్‌, జేడీయూ సహా ఇతర విపక్షాలు ఆందోళన చేశాయి. డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టగా, తమ ఎంపీల అరెస్టులపై తృణమూల్‌ నినాదాలు చేసింది. శారద చిట్‌ఫండ్‌ స్కాంలో తమ ఎంపీలు సుదీప్‌ బందోపాథ్యాయ, తపస్‌ పౌల్‌లను సీబీఐ అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికచర్య అని తృణమూల్‌ ఎంపీ ఒబ్రెయిన్‌ అన్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా టీఎంసీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. అంతకుముందు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఎంసీ సభ్యులు దీక్ష చేశారు.

ఎంపీ అహ్మద్‌ మృతి అంశాన్ని సభలో లేవనెత్తుతామని కాంగ్రెస్‌ పార్టీ సభా నాయకుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాలకు కొద్ది నిమిషాల ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. దివంతగ ఎంపీ అహ్మద్‌ను ప్రభుత్వం అవమానించిందని అన్నారు. మంగళవారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో గుండెపోటుకుగురైన మళప్పురం(కేరళ) ఎంపీ అహ్మద్‌ బుధవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి నేపథ్యంలో బడ్జెట్‌ను ఒకరోజు వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అందుకు నిరాకరించిన ప్రభుత్వం బడ్జెట్‌ను యధావిధిగా ప్రవేశపెట్టింది. దీనిపై ఆందోణ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది.

మరిన్ని వార్తలు