బాలయ్య పీఏ vs టీడీపీ నేతలు | Sakshi
Sakshi News home page

బాలయ్య పీఏ vs టీడీపీ నేతలు

Published Fri, Feb 3 2017 11:25 AM

బాలయ్య పీఏ vs టీడీపీ నేతలు - Sakshi

హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్‌ మద్దతుదారులు ఒక వర్గంగా, అసమ్మతి నాయకులైన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ, వారి అనుచరులు మరో వర్గంగా ఏర్పడి సై అంటే సై అంటూ కాలు దువ్వుతున్నారు.  పరస్పరం ప్రదర్శనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు.

హిందూపురం :  కొన్ని రోజులుగా ఎమ్మెల్యే పీఏ శేఖర్‌పై మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు ఆయన మితిమీరిన జోక్యానికి చెక్‌పెట్టేలా చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్‌ ప్రాంతాల్లో అసమ్మతి సమావేశాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో ఆత్మరక్షణలో పడిన శేఖర్‌ వర్గీయులు బలప్రదర్శన ర్యాలీలు, బహిరంగ సభలకు దిగారు.

(చదవండి :  బాలకృష్ణ పీఏను తరిమేద్దాం )


ఇందులో భాగంగా గురువారం చిలమత్తూరు ఎంపీపీ నౌజియాబాను వర్గీయులు బలప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. బీసీ కాలనీలోని షాదీమహల్‌ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ పార్టీలో గ్రూపులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వారు చిలమత్తూరులో 5వ తేదీ సమావేశం ఎలా నిర్వహిస్తారో చూస్తామని, వారిని ఇక్కడ అడుగుపెట్టనివ్వబోమని ఎంపీపీ భర్త మన్సూర్, నాయకులు అన్సార్, అంజినప్ప సవాల్‌ చేశారు.

ర్యాలీకి లబ్ధిదారులు.. సభకు సంఘాల మహిళలు
చిలమత్తూరు మండలంలో కొత్తగా పింఛన్లు మంజూరైన 502 మందినీ పింఛన్లు ఇస్తామని చెప్పి మండల కార్యాలయానికి పిలిపించారు. తమతో వస్తేనే పింఛన్‌ ఇస్తామని చెప్పి శేఖర్‌ అనుకూల వర్గీయులు వారిని గురువారం ర్యాలీకి తీసుకెళ్లారు. అలాగే దేమకేతేపల్లి, గాడ్రాళ్లపల్లి, బ్రహ్మేశ్వరంపల్లి, తదితర గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు సమావేశం ఉందని చెప్పి పిలిపించి ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు పాల్గొనేలా చూశారు.

మూకుమ్మడి రాజీనామాలకు సై
విభేదాలు ముదిరిన నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచులు, ముఖ్యనాయకులు అసమ్మతివాదుల వైపు చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే తాము కూడా మూక్ముడిగా రాజీనామాలు చేస్తామని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రాము, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు ఆర్‌ఎంఎస్‌ షఫీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సీసీ వెంకటరాముడు ఇంట్లో సమావేశం ఏర్పాటు చేయగా నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

చైర్‌పర్సన్‌ లక్ష్మీ అనుకూలురైన కౌన్సిలర్లు కూడా అసమ్మతివాదులతో చేరిపోయారు. శేఖర్‌ను హిందూపురం నుంచి సాగనంపడానికి ఒక పథకం ప్రకారం ఇదంతా జరుగుతోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని నాయకులందరూ మూకుమ్మడిగా వ్యతిరేకించడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ తన ముఖ్య అనుచరుడి వైపు మొగ్గుచూపుతారా? నాయకుల ఒత్తిడికి తలవంచుతారా? అనేది వేచి చూడాల్సిందే.  


 

Advertisement
Advertisement