సింగ్ ఈజ్ కింగ్!

11 Mar, 2017 11:38 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్ లో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్‌ సారథి కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలో హస్తం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అకాలీదళ్‌-బీజేపీ కూటమి మట్టికరిచింది. ఎన్నికల ఫలితాల సరళితో కాం‍గ్రెస్‌ ఘన విజయం ఖాయమైంది.

ఈ రోజు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న అమరీందర్ సింగ్ కు కాంగ్రెస్‌ విజయంతో అపురూపమైన కానుక దక్కినట్టైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గినట్టుగానే కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. చావోరేవో తేల్చుకునేందుకు బరిలోకి దిగిన అమరీందర్ కు అన్ని అంశాలు కలిసివచ్చాయి. మాజీ క్రికెటర్ నవజ్యోత్‌ సింగ్ చేతులు కలపడం, ప్రభుత్వంపై వ్యతిరేకత భారీ స్థాయిలో వ్యక్తం కావడంతో హస్తం పార్టీకి తిరుగులేకుండా పోయింది.

తమ పార్టీ విజయం సాధించకుంటే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఎన్నికలకు ముందు అమరీందర్ ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్ బాదల్ పోటీ చేస్తున్న లాంబిలో నియోజకవర్గంలో బరిలోకి దిగి సవాల్ విసిరారు. పాటియాలా(పట్టణ) స్థానంలో ఆర్మీ మాజీ చీఫ్‌ జేజే సింగ్‌పైనా పోటీకి దిగారు.

మరిన్ని వార్తలు