మృత్యు మృదంగ ‘ కేంద్రం’ | Sakshi
Sakshi News home page

మృత్యు మృదంగ ‘ కేంద్రం’

Published Wed, Jan 20 2016 10:53 PM

మృత్యు మృదంగ ‘ కేంద్రం’

సందర్భం

 

ఈ దేశంలో శిక్షలు వేసే పద్ధతి క్రింది కులాల వారికి ఒక రకంగాను అగ్ర వర్ణాల వారికి మరో రకంగానూ ఉందని, ఒకే తప్పుకు తక్కువ కులాల వారు ఎక్కువ శిక్షలు అనుభవిస్తున్నారని అనేక వందల ఏళ్ల క్రితం రాసాడో విదేశీ యాత్రికుడు. లిఖిత రూపేణా చట్టం పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అని చెప్తున్నప్పటికీ అమలులో అలా లేదు. అమలు పరిచే వారు ఇప్పటికీ అగ్రవర్ణాల వారే ఎక్కువగా వుండటం చేత శిక్షలు తరతమ భేదంతోనే అమలు అవుతున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులు యాకూబ్ మెమన్‌కి పడిన శిక్ష కూడా అలాటిదే అని భావించి ఉండొచ్చు.

 

అది అలా ఉంచితే ప్రపంచంలోని వందకి పైగా దేశాలు ఉరి శిక్షను రద్దు పరిచాయి. అత్యంత అనాగరి కమయిన ఈ శిక్షను అమలు పరుస్తున్న వాటిల్లో కొన్ని ముస్లిం దేశాలతో పాటు అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటున్న భారత దేశం కూడా వుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంబేడ్కర్ స్టూడెంట్ అసోసి యేషన్ విద్యార్థులు ఈ విషయాన్ని గర్హిస్తూ  శిక్షించడం అవసరమే కానీ ఉరిశిక్ష అమానుషం అని  నిరసన తెలిపారు. వారి ఈ ప్రశ్నకు చెల్లిం చిన రుసుము ఒక ప్రతిభావంతుడయిన విద్యార్థి ప్రాణం.

 

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మొదటి నుంచీ కూడా అభ్యుదయ భావాలున్న యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీతో నాకున్న 15 ఏళ్ళ అనుభవం ప్రకారం కొండొకచో తప్పించి అక్కడ పనిచేసే అధ్యాపకులు కూడా కుల మత భావాలు లేని ఉన్నత వ్యక్తులే. అన్ని అస్తిత్వ పోరాటాలలోను ఇక్కడ విద్యార్థులతోపాటు, అధ్యాపకులు కూడా ఏదో ఒక రకంగా భాగమ వుతూ వస్తున్నారు. కానీ యూనివర్సిటీ పుట్టిన ప్పటి నుంచీ ఇప్పటి వరకూ అక్కడి నుంచి ఒక్క టైస్టూ పుట్టిన దాఖలాలు లేవు. అంత దాకా ఎందుకు.. ఒక్క నక్సలైట్‌ను కూడా ఆ యూని వర్సిటీ ఉత్పత్తి చేసిన చరిత్ర లేదు. మరి బండారు దత్తాత్రేయ.. యాకూబ్ మెమన్ ఉరిని వ్యతిరేకిం చడం అనే ఒక్క ఉదాహరణ చేత ఆ నిరసన అంతటినీ ’జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు’ అని ఎందుకు అనేసారు? కుల కంపు కొడ్తుందని ఎందుకు అన్నారు?

 

ఒక యూనివర్సిటీలో ఒక చిన్న గుంపు వ్యక్తపరిచిన నిరసన కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ వరకూ వెళ్ళడమూ, ఆ మంత్రి దానిని అంత తీవ్రంగా పరిగణించడమూ  వట్టి కాకతాళీయ ఘటనగా అనుకోవడానికి లేదు. వృద్ధ బండారుకి ఉద్యమాలు అర్థం కాలేదనీ, స్మృతి ఇరానీకి యూనివర్సిటీ చదువు లేకపోవడం చేత యూనివర్సిటీ ప్రజాస్వామిక ప్రతి ఘటనలను సరిగా అర్థం చేసుకోలేకపోయారనీ తేలికగా అనుకుంటే అది పొరపాటు. ఈ సంఘటన అతి పెద్ద ప్రజాస్వామిక దేశమయిన భారత్.. భావ ప్రకటనా స్వేచ్ఛ అనే తన ప్రాధమిక హక్కును కోల్పోతుందని చెప్పడానికి ఒక నిదర్శనం. ఈ దేశం హిందూ మత పద ఘట్టనల కింద కిక్కురుమనకుండా ఉండాలనే బీజేపీ ఆకాంక్ష ఎంత తీవ్రంగా వుందో, చిన్న చిన్న నిరసనలను కూడా సహించలేని వారి మత దురహంకార నియంతృత్వ వైనమేమిటో మనకు తెలియపరుస్తుంది. ఆమిర్‌ఖాన్ ఈ దేశంలో ఉండటానికే భయమేస్తోంది అన్నా, కల్బుర్గి సంఘటన అయినా, అకాడమీ అవార్డులు తిరిగి ఇచ్చినా, చివరికి రోహిత్ ‘అవును ఏబీవీపీ జెండాను చించాను’ అని ప్రకటించినా అది ఈ నియంతృత్వాన్ని గుర్తించి ప్రశ్నించడంలో భాగమే.

 

అదే విషయాన్ని బలంగా నొక్కి ప్రశ్నిస్తూ, ఆమిర్‌ఖాన్ చెప్పినట్లు ఈ దేశంలో ఉండటానికి మనందరం భయపడే తీరాలి అని మరోసారి గుర్తు చేస్తూ వెళ్లిపోయాడు రోహిత్. అత్యధిక సంఖ్యలో పేదలున్న ఈ దేశంలో మానవ వనరు ఒక పెట్టుబడి . రోహిత్ తల్లిదండ్రులు రూక రూక పెట్టి పిల్లవాడిని పెంచుకున్నది ఆ పిల్లవాడు తమ వృద్ధాప్యంలో అక్కరకి వస్తాడు అని మాత్రమే కాదు, వెలి వాడల నుంచి తమకి విముక్తిని ఇస్తాడని కూడా. ఈ రోజు ఆ తల్లికి కడుపు కోత పెట్టడమే కాక ఈ రాజ్యం వారి భవిష్యత్తును అంధకారం కూడా చేసింది. 27 ఏళ్ల రోహిత్ విలువ ఈ రోజు 50,000 రూపాయలు అనుకుంటే మొత్తం అతని జీవితానికంతా జీతం లెక్క కడితే దాదాపు పది కోట్లు అవుతుంది. ఆ పది కోట్ల రూపాయలను ఇవాళ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా రూపంలో ఆ తల్లిదండ్రులకు చెల్లించాలి.

 

దేశమంతా ఎక్కడ ఏ యూనివర్సిటీలలో విద్యార్థులు మరణించినా, మరణించే వాళ్లందరూ అణచివేతకు గురైన కులాల వారే ఎందుకవు తున్నారో ఎవరయినా సీరియస్‌గా పరిశో ధించాలి. అంతే కాదు ఈ సారి నుంచి ఏదయినా కమిటీలు వేయదలచుకుంటే మతాలుగా, కులా లుగా ఉన్న భారతీయులతో కాకుండా, ప్రతి ష్టాత్మకమైన అంతర్జాతీయ విశ్వ విద్యాలయాల్లో పనిచేసే ప్రగతిశీల విదేశీ ప్రొఫెసర్లతో కమిటీలు వేయడం మంచిది. అన్నిటికంటే ముందుగా పరిస్థితి ఏదయినా సరే మనిషిగా బతకడ మనేదే ఒక గొప్ప సంతోషకరమయిన విషయమనీ, ఆత్మహత్య ఏ విధంగానూ తిరుగుబాటుకు చిహ్నం కాదనే విషయాన్ని పిల్లల మెదళ్లలోకి ఇంకించే వర్క్ షాపులను మన యూనివర్సి టీలలో అత్యవసరంగా మొదలు పెట్టాలి.

 

- సామాన్య

 వ్యాసకర్త రచయిత్రి

 మొబైల్ : 80196 00900

Advertisement
Advertisement