చిన్నారి లేఖకు స్పందించిన ఆర్‌బిఐ గవర్నర్

15 May, 2014 19:34 IST|Sakshi
లైలాతో రఘురామ్ రాజన్

 కిందటి సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం డాలరుకి రూపాయి మారకం విలువను పెంచడానికి ఎంతో ప్రయత్నం చేసింది. తగ్గిపోతున్న రూపాయి విలువను ఎలా పెంచాలా అని తర్జనభర్జన పడింది. ఆ విషయం తెలుసుకున్న పదేళ్ల బాలిక 20 డాలర్ల నోటును రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌కి పంపుతూ, దేశ ఆర్థికవ్యవస్థను బాగుచేయమని ఒక ఉత్తరం రాసింది.  రఘురామ్ రాజన్ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా 2013, సెప్టెంబరు 4 వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ మరుసటి రోజే లైలా ఇందిరా ఆల్వా ఆయనకు ఒక ఉత్తరం పంపింది.
 ‘‘నేను వార్తలలో మన ఆర్థికవ్యవస్థ కుంటుపడుతోందని విన్నాను. అలాగే డాలర్‌కి రూపాయి మారకం విలువ పడిపోతుందని కూడా విన్నాను’’ అని రాసింది.

 ఢిల్లీ శివార్లలోని గుర్‌గావ్‌లో నివసిస్తున్న లైలాకు కూడా మిగతా అందరి బాలికల్లాగే స్నేహితులతో ఆడుకోవడమంటే చాలా ఇష్టం. ఇంకా చదువుకోవడం, పాటలు పాడటం, గిటార్ వాయించడం, ఈత కొట్టడం... ఇలా ఎన్నో.  అయితే కిందటి వేసవికాలంలో మన ఎకానమీ గురించి, ప్రతిరోజూ డాలర్‌తో రూపాయి విలువ తగ్గిపోతోందనీ, కరెంట్ అకౌంట్‌లో లోటు నానాటికీ పెరిగిపోతోందనీ, ఇటువంటి వార్తలు వినవలసి వచ్చినందుకు చాలా బాధ పడింది.  ఆమె తల్లిదండ్రులు తెచ్చిన అనేక వార్తాపత్రికలు చదివి కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంది.

 ‘‘లంచగొండితనం, ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని నాకు తెలుసు. ఈ విషయం నేను వార్తాపత్రికల్లో చదివాను, మా తల్లిదండ్రులు కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు’’ అంటోంది లైలా.  ‘‘ప్రజలకు సుఖంగా జీవించడానికి తగినంత ఆదాయం లేదు. వారంతా పేదరికంలోనే జీవిస్తున్నారు’’ అని బాధపడుతోంది లైలా.

 లైలా తల్లి ప్రియా సోమయ్యా ఆల్వా , ఆమె భర్త తరచుగా లైలాతోను, పదమూడుసంవత్సరాల ఆమె అన్నయ్యతోనూ వార్తల గురించి చర్చిస్తుంటారు. ‘‘కిందటి సెప్టెంబర్, మేమంతా భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటున్నాం. నేను మా వారు డాలర్ ధర గురించి చర్చించుకుంటున్నాం. మిస్టర్ రాజన్ రిజర్వ్‌బాంక్ గవర్నరుగా పదవీబాధ్యతలు తీసుకుంటున్నారని వార్తలో చూశాం’’ అన్నారు. మరుసటి రోజు, లైలా స్కూల్ నుంచి తిరిగి వచ్చాక, ఆమె తల్లితో ‘‘నేను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కి ఉత్తరం రాస్తాను. ఆయన మన ఎకానమీని ఇంప్రూవ్ చేస్తారు’’ అని చెప్పింది.  ‘‘అలాగే. నువ్వు చిన్న పిల్లవు, నువ్వు ఏం కావాలనుకుంటే అది చెయ్యొచ్చు’’ అంది ప్రియా.

 ‘‘డా.రఘురామ్‌రాజన్! దయచేసి మీరు కొత్త కొత్త ఆలోచనలతో మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయండి. విదేశాల నుంచి ప్రజలంతా భారతదేశానికి రావాలని కోరుకుంటున్నాను. అంతేకాని మన దేశం గురించి ఏ ఒక్కరూ లంచగొండి దేశమనీ, చెత్త నిండిన దేశమనీ భావించకూడదు’’ అని ఉత్తరం రాసింది.  ఆ ఉత్తరం ఇటీవలే ఆమె చదువుతున్న స్కూల్ మ్యాగజీన్‌లో ప్రచురించారు.  తాను 20 డాలర్ల నోటును ఇవ్వడానికి నిశ్చయించుకుంది. ఆ నోటు కూడా ... సెలవులకు కిందటి సంవత్సరం ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు ఆమెకు తల్లిదండ్రులు ఇచ్చారు. ఆ నోటును ఇప్పుడు బ్యాంకుకి ఇవ్వాలనుకుంటోంది లైలా. దేశానికి ఈ నోటుతో ఎంతో అవసరం ఉందని భావించింది.

 ‘‘ఏదైనా సరే చిన్న మొత్తంతో ప్రారంభమై పెద్ద మొత్తంగా చేకూరుతుందని చాలామంది చెబుతుంటారు. అందుకే నేను 20 డాలర్ల నోటు ఇద్దామని నిశ్చయించుకున్నాను. ప్రజలకు సరైన ఆలోచనా ధోర ణి ఉంటే, వారు ఈ మొత్తాన్ని పెద్ద మొత్తంగా చేయగలరు. ప్రతిఒక్కరూ ఎంతో కొంత సహాయం అందచేసి, మన ఆర్థికవ్యవస్థను మెరుగుపరచి, దేశ ప్రగతికి పాటుపడాలని కోరుకుంటున్నాను’’ అంటుంది లైలా.  పది రోజుల తర్వాత, ఒక అధికారిక ఉత్తరం లైలా పేరుతో వచ్చింది. ఆ ఉత్తరం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ ఉత్తరం రిజర్వ్‌బ్యాంక్ నుంచి వచ్చింది. ‘‘నీ ఆలోచనకు నేను చలించిపోయాను. ప్రస్తుతం దేశానికి ఇదొక పెద్ద సవాలు. నిస్సందేహంగా మన  ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుంది’’ అని సమాధానమిచ్చారు ఆ ఉత్తరంలో.  ఆ కవర్‌లో లైలా పంపిన 20 డాలర్ల నోటు కూడా ఉంది. ‘‘నేను నీకు 20 డాలర్ల నోటు వెనక్కు పంపుతున్నాను. ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచడానికి రిజర్వ్‌బ్యాంక్ దగ్గర తగినంత నిధులు ఉన్నాయి’’ అని రాస్తూ, ఈసారి ముంబై వచ్చినప్పుడు తనను కలవమన్నారు.  ‘‘నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది’’ అంది లైలా తనకు వచ్చిన జవాబు చూస్తూ.  ‘‘రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌కి ఉత్తరం రాయడం సర్వసాధారణం అయ్యి ఉండవచ్చు. నా ఉత్తరం నిజంగా ఆయన చదవలేదనుకున్నాను. ఎవరికో చెప్పి సమాధానం రాయించి ఉంటారు’’అనుకుంది లైలా

 ఆమెకు తను పంపిన 20 డాలర్ల నోటు వెనక్కు రావడం ఆనందంగా లేదు. ‘‘బహుశ ఇలా తీసుకోవడం వాళ్లకి చిన్నతనం కావచ్చు’’ అనుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం, ‘‘దేశానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా సహాయపడతారు’’ అని ఆమెను సముదాయించారు.  కిందటి నవంబరులో లైలా తండ్రి వ్యాపార నిమిత్తం ముంబై వెళ్లారు. తండ్రితో పాటు లైలా కూడా ముంబై వెళ్లింది, గవర్నర్‌ని కలవడానికి.  ‘‘లైలాకి ఎంతో ఆనందం కలిగింది. ఆర్‌బిఐ బిల్డింగ్ చూడగానే మురిసిపోయింది. కాయిన్ మ్యూజియం చూసింది. డ బ్బును ఒకరి నుంచి ఒకరికి ఎంత సులువుగా అందచేయవచ్చో అక్కడ చూసింది. ఆమెకు అన్నిటి కంటె వింత మామా గురించి’’ అన్నారు ప్రియా.  ‘‘ఆయన చాలా పొడవుగా వున్నారు’’ కళ్లు ఇంతింత చేసుకుని చెప్పింది లైలా. ‘‘మేమిద్దరం ఫొటో తీయించుకున్నాం. ఆయన పొడుగ్గా జెయింట్‌లా వున్నారు’’ అంది లైలా.

 రాజన్‌తో ఆమె సమావేశమైనప్పుడు, ఆమె ‘‘ఆర్‌బిఐ పేదల కోసం ఎందుకని ఎక్కువ నోట్లు ప్రింట్ చేయదు’’ అని ప్రశ్నించింది. అప్పుడు ఆయన ద్రవ్యోల్బణం గురించి, డబ్బు ఏ లెక్కన అచ్చు వేస్తారో ఆమెకు వివరంగా చెప్పారు.  ఆయన వెనక ఉన్న గోడ మీద ఉన్న చిత్తరువులు చూసి, ‘‘ఒక్క లేడీ గవర్నర్ కూడా లేరేంటి?’’ అని ప్రశ్నిస్తే, ‘‘బహుశ భవిష్యత్తులో నువ్వే అవుతావేమో’’ అన్నారు రాజన్.  ఆమెను పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే, ‘‘ నాకు మాత్రం ముందుగా ఫొటోగ్రాఫర్ కావాలని కోరికగా ఉంది. ఆ తరువాత గాయనిగా! బహుశ ఆ తరువాత గవర్నర్ అవుతానేమో’’ అని సమాధానమిచ్చింది.  ప్రస్తుం ఆమె ఆర్థికవ్యవస్థ మీద మరీ దృష్టి సారించట్లేదు.  కిందటి సంవత్సరం డాలర్‌కి 70 రూపాయలు.  ప్రస్తుతం ఆ ధర 60 రూపాయలకు చేరుకుంది.  20 డాలర్ల నోటు గురించి ప్రస్తుతం ప్రశ్నిస్తే, ఒకప్పుడు తాను ఆ నోటును రూపాయలలోకి మార్చి, ఖర్చు చేయాలనుకుంది, కానీ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకుంది.  ‘‘ఉత్తరంతో పాటు ఈ నోటును ఫ్రేమ్ చేయించాలనుకుంటున్నాను’’ అంటోంది లైలా.

మరిన్ని వార్తలు