శశికళ వర్సెస్ ఓపీఎస్: రాష్ట్రపతి పాలనకే ఓటు

9 Feb, 2017 23:30 IST|Sakshi
శశికళ వర్సెస్ ఓపీఎస్: రాష్ట్రపతి పాలనకే ఓటు
తమిళనాడులో సీఎం పీఠం కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు, పార్టీ కేర్టేకర్ శశికళకు మధ్య రేగిన చిచ్చు ఆ రాష్ట్ర రాజకీయాల్లో క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది.  తమిళనాడులో నెలకొన్న ఈ సంక్షోభంపై ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో నెటిజన్లు అనూహ్యమైన తీర్పునిచ్చారు. మెజార్టి సభ్యులు అంటే 54 శాతం మంది తమిళనాడులో రాష్ట్రపతి పాలనకు అనుకూలంగా ఓటు వేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో సంక్షోభం పరిష్కారానికి ఓ నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు సాయంత్రం ఆ రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాలను కలిసిన తర్వాత ఓ ప్రకటన ఆయన  నిర్ణయం తీసుకోనున్నారు.
 
పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం మళ్లీ ఆ పీఠం కోసం పోరాటం సాగిస్తుండగా.. జయ నెచ్చెలి శశికళ ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ తమిళనాట నెలకొన్న తాజా పరిస్థితులపై ఈ సర్వే నిర్వహించింది. దీనిలో 54 శాతం మంది ప్రెసిడెంట్ రూల్కు అనుకూలంగా ఓటు వేస్తూ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో అసెంబ్లీ నిర్ణయిస్తుందని  34 శాతం మంది పేర్కొన్నారు.

ఇంటర్నెల్గా అన్నాడీఎంకే నేతలు నిర్ణయిస్తారని 10 శాతం మంది అభిప్రాయపడ్డారు. మెజార్టి సభ్యులు కోరుతున్న ప్రెసిడెంట్ రూల్ను బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా మోదీ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అన్నాడీఎంకేలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని అనుకూలంగా తీసుకున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే కూడా తాజా ఎన్నికలకు పట్టుబడుతోంది.

 చదవండి :
'ఎమ్మెల్యేల సంతకాలన్నీ ఫోర్జరీ'

 
మరిన్ని వార్తలు