‘సిప్’ చేయడమే బెటర్!

22 Mar, 2015 03:53 IST|Sakshi
‘సిప్’ చేయడమే బెటర్!

 సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ఆదిత్య రెండేళ్ల నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదామని ఎదురు చూస్తున్నాడు. మార్కెట్లు భారీగా పడితే ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే.. గత రెండేళ్లుగా స్టాక్ సూచీలు ఎటువంటి భారీ పతనాలు లేకుండా పెరుగుతూ వచ్చాయి. ఒకవేళ ఒకటిరెండు సెషన్లు పడినా వెంటనే మళ్లీ పెరిగిపోతున్నాయి. మొన్న బడ్జెట్ తర్వాత సెన్సెక్స్ 30,000 మార్కును కూడా అధిగమించేసింది. ఇక విశ్లేషకులైతే సెన్సెక్స్ తదుపరి లక్ష్యం 50,000 అని ఒకరు... లక్ష అని ఒకరు చెబుతున్నారు. ఇక ఆగలేక దాచుకున్న సొమ్మును ఒకేసారి ఇన్వెస్ట్ చేశాడు. దురదృష్టమేంటో గానీ... ఇన్వెస్ట్ చేసిన మర్నాటి నుంచీ మార్కెట్లు పడుతున్నాయి. 6శాతం నష్టపోయాయి.  దీంతో ఆదిత్యలో ఆందోళన మొదలయింది.
 
  ఆదిత్య వైఖరితో ఆయనకు జరిగిన నష్టాలు రెండు. ఒకటి... రెండేళ్లుగా ఆలస్యం చెయ్యటం వల్ల ఈ మధ్యకాలంలో బాగా పెరిగినందున ఆ లాభాల్ని కోల్పోయాడు. రెండు... ఒకేసారి ఇన్వెస్ట్ చేశాడు కనక ఆ తరవాత 6 శాతం పడితే ఆందోళన చెందుతున్నాడు. ఇలా ఆదిత్యలా ఆలోచించే వారు మనలో చాలామందే కనిపిస్తుంటారు. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం. స్టాక్ మార్కెట్లో కనిష్ట స్థాయిని, గరిష్ట స్థాయిని అంచనా వేయటం అసాధ్యం. ఇక్కడి వరకు పెరిగింది కనక ఇక తగ్గుతుందనిగానీ, ఇంతవరకూ తగ్గింది కనక ఇక పెరుగుతుందని గానీ చెప్పటం దాదాపు అసాధ్యం. అదే... ఆదిత్య సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానాన్ని (సిప్) ఎంచుకుని ఉంటే ఎలాంటి ఆందోళనా ఉండేది కాదు. ఈ రెండేళ్ల లాభాన్ని పొందటంతో పాటు ఇపుడు తగ్గినపుడు మరింత ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని పొందేవాడు. ఈ విధాన మేంటో వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...
 
 స్టాక్ మార్కెట్‌లో హెచ్చు తగ్గులు సహజం. సూచీలు పెరుగుతున్నాయా లేక తగ్గుతున్నాయా అన్న విషయాలతో సంబంధం లేకుండా ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయటమే సిప్. అంటే మీ దగ్గర ఉన్న సొమ్మంతా ఒకేసారిగా కాకుండా అదే మొత్తాన్ని సమాన భాగాలుగా విభజించి నెలకు కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవడమన్నమాట. దీని వలన ఇన్వెస్టర్లకు ఆర్థిక క్రమశిక్షణ అలవడటమే కాకుండా మార్కెట్ల కదలికలపై  ఎటువంటి అందోళనలు పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండవచ్చు.  ఉదాహరణకు రెండేళ్ళ క్రితం స్నేహితులు శివ, సతీష్‌లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నారు.
 
  అనుకున్న వెంటనే శివ తన దగ్గరున్న రూ.2.40 లక్షలు ఒకేసారి గోల్డ్‌మాన్ శాక్స్ నిఫ్టీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాడు. సిప్ ప్రయోజనం, స్టాక్ మార్కెట్ కదలికలపై బాగా అవగాహన ఉన్న సతీష్ మాత్రం అలాకాక నెలకు రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. ఈ రెండేళ్ళలో ఈ ఫండ్ సగటున 25 శాతం రాబడిని అందించింది. అంటే 50 శాతం పెరిగినట్లన్న మాట. సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసిన సతీష్‌కు కూడా ఇదే విధమైన రాబడి వచ్చింది.
 
 కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే... శివ తన దగ్గరున్న మొత్తమంతా ఒకేసారి ఇన్వెస్ట్ చేశాడు. దీంతో స్టాక్ మార్కెట్లో ఏ మాత్రం చిన్న సర్దుబాటు వచ్చినా... తీవ్ర ఆందోళనకు గురయ్యేవాడు. కానీ సతీష్ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్లు పడుతున్నా.. ఆందోళన చెందేవాడు కాదు. ఎందుకంటే మార్కెట్లు పడితే ఎక్కువ యూనిట్లు వస్తాయి.. అదే పెరుగుతుంటే తక్కువ యూనిట్లు  వస్తాయి. దీర్ఘకాలంలో సగటున తక్కువ రేటుకే ఎక్కువ యూనిట్లను పొందే అవకాశం కలుగుతుంది.
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
 అధిక లాభాలు..
 ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లు కుప్ప కూలితే వచ్చే నష్టాలను ఊహించలేం. మార్కెట్ కష్ట నష్టాలను ముందే తెలుసుకోలేం. భయాలు సాధారణంగా వెంటాడు తుం టాయి. ముఖ్యంగా అధిక రిస్క్ ఉండే సెక్టోరియల్, థిమాటిక్ ఫండ్స్ విషయంలో ఈ భయాలు మరీ ఎక్కువ. ఇలాంటి నష్టభయానికి సిప్ చెక్ పెడుతుంది. మార్కెట్లు పడకుండా పెరుగుతున్న సమయంలో సిప్ వలన కొద్దిగా లాభాలు తగ్గినా నష్టభయం ఆందోళనకు దూరంగా ఉండొచ్చు. అదే ఒడిదుడుకుల మార్కెట్లో అయితే సిప్ అధిక లాభాలను కూడా అందిస్తుంది.
 
 మరింత రాబడి..

 గత రెండేళ్ల స్టాక్ మార్కెట్ ర్యాలీని పరిశీలిస్తే బ్యాంకింగ్ షేర్లు ముందుండి నడిపిస్తున్నాయి. బ్యాంకు షేర్లలో ర్యాలీని ముందే అంచనా వేసిన జగన్, ఫణి బ్యాంకింగ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవగా జగన్ తనదగ్గరున్న మొత్తాన్ని మార్చి, 2013లో ఇన్వెస్ట్ చేశాడు. అదే ఫండ్‌లో ఫణి మాత్రం సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేశాడు. ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన జగన్‌కి ఏడాదికి సగటున 32 శాతం రాబడి వస్తే అదే సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసిన ఫణికి మాత్రం 40 శాతం రాబడి వచ్చింది. అదీ సిప్ ప్రయోజనం.
 
 కొత్త సిప్‌లొస్తున్నాయ్..
 ఫండ్ సంస్థలు వివిధ సిప్ ప్రొడక్టులను ప్రవేశపెడుతున్నాయి.  ఫండ్స్‌తో పాటు బ్రోకింగ్ సంస్థలు షేర్లను కూడా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నెలకు  కాకుండా ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసే  డైలీ సిప్, ఆన్‌లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేసే  ఐ-సిప్‌లను, అవసరమైతే మధ్యలో సిప్‌కి బ్రేక్ ఇవ్వడం వంటి పథకాలను ప్రవేశపెడుతున్నాయి.  ముందుగా తక్కువ రిస్క్ ఉండే డెట్ పథకాల్లో ఒకేసారిగా ఇన్వెస్ట్ చేసి, దాని నుంచి ఈక్విటీ ఫండ్‌లోకి ప్రతినెలా ఇన్వెస్ట్ చేసే విధంగా సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.
 

మరిన్ని వార్తలు