ఉద్యోగుల సమస్యకు కమిటీ

10 Sep, 2015 01:06 IST|Sakshi

తామే ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు ధర్మాసనం  
చెరో నలుగురి పేర్లను సిఫారసు చేయాలని ఆదేశం
రిటైర్డ్ న్యాయమూర్తిని చైర్మన్‌గా సిఫారసు చేస్తామని వెల్లడి
విచారణ ఈనెల 11కు వాయిదా

 
 హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం వ్యవహారంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున, ఇక సమస్య పరిష్కారానికి తామే ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చెరో నలుగురి పేర్లను రెండు రోజుల్లో సిఫారసు చేయాలని ఉభయ రాష్ట్రాలను ఆదేశించింది. ఇరు రాష్ట్రాలతో సంబంధంలేని వ్యక్తిని, వీలైనంతవరకు ఓ రిటైర్డ్ న్యాయమూర్తిని తాము సిఫారసు చేస్తామని, ఆ వ్యక్తి కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించేలా యోచన చేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ తొమ్మిదిమంది కలిసి వివాద పరిష్కార బాధ్యతలను చేపడుతారని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. అలాగే రిలీవ్ అయిన ఉద్యోగులకు జీతాల చెల్లింపు వ్యవహారాన్ని కూడా శుక్రవారం తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాల వాదనలు ఇలా ఉన్నాయి.

 ఏపీ జెన్‌కోలో 3,129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి: తెలంగాణ సీఎస్
 ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పోస్టులను విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కోకు 9,251 పోస్టులు, టీఎస్ జెన్‌కోకు 7,440 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ రెండింటితో కలిపి మొత్తం 16,691 పోస్టులు ఉన్నాయి. అపాయింటెడ్ డే నాటికి మొత్తం పోస్టుల్లో 12,091 మందే పనిచేస్తున్నారు. తాత్కాలిక కేటాయింపుల కింద టీఎస్ జెన్‌కోకు 5,897, ఏపీ జెన్‌కు 6,122 మందిని కేటాయించారు. తద్వారా టీఎస్ జెన్‌కోలో 1,543 పోస్టులు టీఎస్ జెన్‌కోలో 3,129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీ జెన్‌కో కేటాయించి, బదిలీ చేసిన 512 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను ఖాళీగా ఉన్న 3,129 పోస్టుల్లో సులభంగా చేర్చవొచ్చు. స్థానికత ఆధారంగా మేం రిలీవ్ చేసిన 1,242 ఉద్యోగులను కొత్త పోస్టులు సృష్టించకుండానే ఖాళీగా ఉన్న 3,129 పోస్టుల్లో చేర్చవచ్చు. ఉద్యోగుల విభజన పరిష్కార బాధ్యతలను రిటైర్డ్ అధికారిణి షీలా బిడే నేతృత్వంలోని కమిటీకి అప్పగించాలన్న ఏపీ వాదన మాకు ఆమోదయోగ్యం కాదు.

 జనాభా ప్రాతిపదికనే జరగాలి: ఏపీ సీఎస్
 ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగుల విభజన జనాభా ప్రాతిపదికన జరగాలి. అలా జరగని పక్షంలో పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం మూసివేతకు దారి తీయవచ్చు. ఆస్తుల, అప్పుల విభజన, ఉద్యోగుల విభజన కలిపి ఒకేసారి చేయాలి. పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజన పరస్పర చర్చల ద్వారానే జరగాలి తప్ప, ఏకపక్షంగా కాదు. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన విభజన మాకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.
 
 

>
మరిన్ని వార్తలు