ఎవరీ హార్దిక్ పటేల్..?

26 Aug, 2015 09:21 IST|Sakshi
ఎవరీ హార్దిక్ పటేల్..?

రెండు నెలల క్రితం వరకు అతనెవరో ఎవరికీ తెలియదు. నేడు గుజరాత్ లో ఈ యువకుడి పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. అతనికి రాజకీయ నేపథ్యం లేదు..  కానీ గుజరాత్ రాజకీయ నేతలకు వణుకు పుట్టిస్తున్నాడు. మధ్యతరగతి కుర్రాడు కావచ్చు.. పిలుపినిస్తే లక్షలాది మంది తరలి వస్తున్నారు. చదువులో టాపర్ కాదు కానీ.. వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు.  ఈ కుర్రాడే హార్దిక్ పటేల్. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హార్దిక్ పేరు తెరమీదకు వచ్చింది.

గుజరాత్లో పటేల్ సామాజిక వర్గానికి హార్దిక్ పటేల్ ఇప్పుడు హీరో. పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ హార్దిక్ ఉద్యమబాట పట్టాడు.  తమ డిమాండ్ నెరవేర్చకపోతే  2017  గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని హెచ్చరిస్తున్నాడు. గుజరాత్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న హార్దిక్  బుధవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాడు.  


21 ఏళ్ల హార్దిక్ బీకాం పట్టభద్రుడు. అహ్మదాబాద్ సమీపంలోని వీరంగామ్  అతని సొంతూరు. తండ్రి చిన్న వ్యాపారం చేస్తుంటారు. డిగ్రీ పూర్తయ్యాక తండ్రి వ్యాపారంలో చేదోడుగా ఉన్న హార్దిక్.. పటేల్ సామాజిక వర్గం కోసం ఉద్యమించాడు. పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) కన్వీనర్గా గుజరాత్లో ఊరూవాడా తిరుగుతూ పటేల్ సామాజిక వర్గాన్ని ఏకం చేశాడు. అతని సమావేశాలకు లక్షల్లో పటేల్ కులస్తులు హాజరవుతున్నారు. దీంతో సాఫీగా సాగిపోతున్న గుజరాత్ ప్రభుత్వానికి కొత్త సమస్య వచ్చిపడింది. ముఖ్యంగా పటేల్ సామాజికవర్గ నాయకులు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది.

రాజస్థాన్లో గుజ్జర్ల తరహాలో గుజరాత్లో పటేల్ సామాజిక వర్గం ఆందోళన బాటపట్టింది. తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రం చేశారు. గుజరాత్లో ఈ రోజు బంద్ సందర్భంగా చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. చాలా ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేశారు. మంగళవారం రాత్రి పోలీసులు హార్దిక్ను నిర్బంధించారు.

ఈ వార్త తెలియగానే వేలాది పటేల్ సామాజికవర్గ యువకులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో గంటలోనే అతన్ని విడుదల చేశారు. ఎలాంటి హింస జరగకుండా శాంతియుత మార్గంలో బంద్ పాటించాలని హార్దిక్ పిలుపునిచ్చాడు. అతని నాయకత్వంలో ఈ రోజు అహ్మదాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హార్దిక్పై పలు విమర్శలు, ఫిర్యాదులు వచ్చినా.. సొంత సామాజికవర్గంలో హీరోగా మారిపోయాడు.

'పటేల్ కులానికి చెందిన విద్యార్థికి 90 శాతం మార్కులు వచ్చినా ఎంబీబీఎస్ కోర్సులో సీటు రావడం లేదు. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 45 శాతం మార్కులతో అడ్మిషన్ పొందుతున్నారు. మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు వ్యతిరేకం కాదు. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలన్నదే మా డిమాండ్' అన్నది హార్దిక్ వాదన.

గుజరాత్లో అధికార బీజేపీకి పటేళ్లు గట్టి మద్దతుదార్లు. ఆ రాష్ట్ర జనాభాలో ఈ సామాజికవర్గం వారు 15 శాతం మంది ఉన్నారు. దీంతో బీజేపీ పటేళ్లను దూరం చేసుకునే పరిస్థితి లేదు. అయితే ఇప్పటికే రిజర్వేషన్లు 50 శాతం మించడంతో పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చడం సాధ్యంకాదని గుజరాత్ సీఎం ఆనందీబెన్ చెబుతున్నారు. ఆమె కూడా పటేల్ సామాజికవర్గానికి చెందినవారే. గుజరాత్లో రాజకీయ, వ్యాపార రంగాల్లో పటేల్ సామాజికవర్గం వారు కీలక స్థాయిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు