వీల్‌చైర్‌లో.. పొట్టచుట్టూ బంగారంతో బామ్మ!

15 Feb, 2016 19:35 IST|Sakshi
వీల్‌చైర్‌లో.. పొట్టచుట్టూ బంగారంతో బామ్మ!

దుబాయ్ నుంచి రూ.1.27 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళను బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ)లో అధికారులు అరెస్టుచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... కడపకు చెందిన 52 ఏళ్ల కమలమ్మ దుబాయ్ నుంచి తెల్లవారుజామున కేఐఏ చేరుకుంది.


వీల్ చైర్‌లో కూర్చొని అనుమానాస్పదంగా తిరుగుతుండగా గమనించిన తనిఖీ అధికారులు ఆమె శరీరాన్ని స్కానింగ్ చేశారు. పొట్ట చుట్టూ కాటన్‌లో చుట్టిన 38 బంగారు బిస్కెట్ల ఉన్నట్లు గమనించారు. మొత్తం బిస్కెట్ల బరువు 4.4 కిలోలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ బంగారం విలువ మార్కెట్‌లో రూ.1.27 కోట్లుగా ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. అయితే ఈ బంగారానికి సంబంధించి సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో కమలమ్మను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.

న్యాయస్థానం ఆమెను ఈనెల 29 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కమలమ్మ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరి అక్కడ ఓ వ్యక్తికి సదరు బంగారు బిస్కెట్లు అందజేయాల్సి ఉంది. చివరి క్షణంలో ప్రణాళికలో మార్పు రావడంతో నిందితురాలు బెంగళూరుకు చేరుకుని ఆ వ్యక్తి కోసం ఎదురుచూస్తూ అధికారులకు దొరికిపోయింది. ఆరునెలల క్రితం తాను ఉపాధి వెదుక్కొంటూ దుబాయ్ వెళ్లానని కమలమ్మ విచారణలో అధికారులకు తెలిపింది. సదరు బిస్కెట్లను ప్రణాళిక ప్రకారం ఆ వ్యక్తికి అందజేస్తే రూ.4.5 లక్షలు అందజేసేవారని కమలమ్మ విచారణలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు