కట్నం వేధింపులు.. ఐఆర్‌ఎస్‌ అధికారి అరెస్టు

18 Apr, 2017 19:52 IST|Sakshi
కట్నం వేధింపులు.. ఐఆర్‌ఎస్‌ అధికారి అరెస్టు
హైదరాబాద్‌: కట్నం వేధింపుల కేసులో ఐఆర్‌ఎస్‌ అధికారి కొత్తపాటి వంశీకృష్ణను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌- 2లోని ఉమెన్‌ కోఆపరేటివ్‌ సొసైటీలో నివసించే శ్రావణి వివాహం కొత్తపాటి వంశీకృష్ణ(27)తో 2015లో జరిగింది. ఐఆర్‌ఎస్‌ టాప్‌ర్యాంకర్‌ అయిన వంశీకృష్ణ విజయవాడ ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేస్తున్నారు. పెళ్లి సమయంలో భారీగా కట్నంతో పాటు ఆభరణాలు, ఒక ప్లాట్‌ను కూడా ఇచ్చారు.

పెళ్లయిన తర్వాత ఉమెన్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీలో కాపురం పెట్టారు. రెండు రోజులు గడిచిన తర్వాత ఆమె అత్త పని మనిషిని తొలగించి ఇంటి పనంతా బాధితురాలితో చేయించింది. పనిమనిషిలా మార్చేసింది శ్రావణి ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేక విషయం భర్తకు తెలిపినా ఫలితం లేకపోయింది. అంతేకాక మరింత అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేశారు. ఆమెకు తెలియకుండానే ఇటీవల వంశీకృష్ణ ఢిల్లీకి బదిలీ చేయించుకున్నాడు. అడ్రస్‌ తెలుసుకొని అక్కడికి వెళ్లగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో మోసపోయానని తెలుసుకొని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తతో పాటు మామ నర్సింహానాయుడు, అత్త పార్వతి, సోదరుడు గోపికృష్ణ, బోయల మదన్, మాధవి, పూర్ణ చందర్‌రావులపై కేసు పెట్టింది.

వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని వెల్లడించింది. గూండాలతో తనను హత్యచేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఏ క్షణంలో అయినా తన ప్రాణానికి హానీ ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు వంశీకృష్ణతో పాటు ఆయన తల్లిదండ్రులు, సోదరులపై ఐపీసీ సెక్షన్‌ 498(ఏ), 420, 406, 408, 354, 506, రెడ్‌విత్‌ 34, వరకట్న నిరోధక చట్టం 3, 4 కింద కేసులు నమోదు చేశారు. వంశీకృష్ణను నిబంధనల ప్రకారం మూడుసార్లు భరోసా కేంద్రానికి పంపించారు. ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని వార్తలు