ఉగ్రవాదంపై నిఘా ‘నేత్రం’

9 Jan, 2016 01:54 IST|Sakshi
ఉగ్రవాదంపై నిఘా ‘నేత్రం’

జాతిహితం
దోవల్‌ది ఆవశ్యకంగా ఆపరేషన్స్ ఆలోచనా ధోరణి అని ఆయన గురువుల నుంచి శిష్యుల వరకు అందరి అభిప్రాయం. కాబట్టే పఠాన్‌కోటలో జరుగుతున్నది సైనిక చర్య అనిపించిన మరుక్షణమే జాతీయ భద్రతా బలగాలను పంపాలని నిర్ణయించారు. అది అత్యంత సున్నితమైన సైనిక చర్య. పూర్తి మిలిటరీ వాతావరణంలో సాగిన ఎత్తుగడలపరమైన ఆపరేషన్. ఉగ్రవాద వ్యతిరేక సైనిక చర్యకూ, ఒక కీలక ప్రాంతంలోని సువిశాల వైమానిక దళ స్థావరం పెద్ద ముప్పును ఎదుర్కోవడానికీ మధ్య తేడా ఉంది.
 
భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)అధికారిగా అజిత్ దోవల్ వృత్తి జీవితం అద్భుతమైనదని అత్యధికులు గుర్తిస్తారు. మా ఇద్దరి వృత్తి జీవి తాలు వేటికవిగానే అయినా ఒక విధంగా సమాంతరంగా సాగాయని కొన్నేళ్ల క్రితం ‘జాతిహితం’లో సైతం రాశాను. ఆయన వివిధ సందర్భాల్లో సంక్లిష్ట పరిస్థితులలో పనిచేస్తుండటం, నేను వాటి  వార్తా కథనాలను నివేదిస్తుండటంగానే మా సమాంతర ప్రయాణం ఎక్కువగా సాగింది. అయితే సీనియారిటీ, వయస్సు కారణంగా ఆయన నాకంటే ఎప్పుడూ రెండడుగులు ముందే ఉండేవారు. జనవరి 20కి ఆయనకు 71 ఏళ్లు వస్తాయి. ఆ తర్వాతా ఆయన గురించిన కథనాలు మిగిలే ఉంటాయి. అయినా ఆయన గురించి మాట్లాడుకోవాల్సినంత గుర్తింపు ఆయనకు ఇప్పటికే ఉంది. ఈశాన్య భారత్ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కొత్త కరెస్పాం డెంట్‌గా నేను 1981 జనవరిలో మిజోరామ్‌కు మొదటిసారిగా వెళ్లాను. నాటి ముఖ్యమంత్రి టి. సైలో గతం గురించి, భవిష్యత్తు గురించి సుదీర్ఘోప న్యాసం ఇచ్చారు. ‘‘ఏకే దోవల్‌లాంటి అధికారులు మనకు ఇంకొందరు ఉంటే ఇంకా చాలా బావుండేది’’ అని ఆయన ఆ సందర్భంగా నాతో అన్నారు. దోవల్ అప్పట్లో మిజోరాం ఐబీ యూనిట్‌కు (దాన్ని అనుబంధ ఇంటెలిజెన్స్ బ్యూరోగా పిలిచే వారు) అసిస్టెంట్ డెరైక్టర్.

ఇంటెలిజెన్స్ లెజెండ్
సరిగ్గా ఒక ఏడాది తర్వాత, చోగ్యాల్ పాల్డెన్ (లేదా మాజీ చోగ్యాల్... 1975లో ఆ రాష్ట్రం విలీనమైన తర్వాత ఇందిరాగాంధీ ఆ బిరుదును రద్దు చేశారు కాబట్టి) తొండుప్ నంగ్యాల్ అంత్యక్రియల వార్తా కథనం కోసం గాంగ్‌టక్‌కు వెళ్లాను. ప్రశంసాపూర్వకంగానో, సంభ్రమంగానో అక్కడ అప్పటికే దోవల్ పేరు తరచూ ప్రస్తావనకు వస్తుండేది. ఇటీవల సైతం ఆయన అక్కడ ఉన్నారు, అప్పుడూ తనదైన ముద్రను వేశారు. ఆ తదుపరి మరో పెద్ద కథనం కోసం నేను తరచూ పంజాబ్‌కు వెళ్లాల్సివచ్చేది. అప్పుడాయన నిజానికి సరిహద్దుకు ఆవల పాకిస్తాన్ రాజధాని ఇస్లామా బాద్‌లోని భారత దౌత్య కార్యాలయంలో పూర్తి చట్టబద్ధంగానే ఉండేవారు. నా జ్ఞాపకం సరైనదే అయితే, ఆయన అక్కడ వాణిజ్య విభాగానికి అధిపతిగా ఉండేవారు. అప్పట్లో భారత్-పాక్‌ల మధ్య పెద్దగా ద్వైపాక్షిక వాణిజ్యమేమీ జరగడంలేదని నా విశ్వాసం. కాబట్టి ఆ నియామకం ఆయనకు ముసుగు మాత్రమే. అయినా దోవల్ ఎప్పుడూ పనితో తలముకలవుతూనే ఉండేవారు. విద్రోహ కార్యకలాపాలు తదితర విషయాలతో పాటూ ఆయన... పాక్‌లోని ప్రవిత్ర స్థలాల సందర్శనకు వచ్చే సిక్కులు వేర్పాటువాద ప్రచారం ప్రభావానికి గురయ్యే అవకాశంపై కూడా కన్నేసి ఉంచేవారు. పాక్ గూఢచార సంస్థ నిర్దేశకత్వంలోనే, పూర్తిగా అదే ప్రేరేపించిన దురదృష్టకరమైన ఒక వికృత ఘటనలో ఆ పవిత్ర స్థలాలలో ఒక చోట జరిగిన జాతాలో (సాయుధ ప్రదర్శన) ఆయనపై దాడి జరిగింది.

దోవల్, 1969 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఐబీలో ఆయనకు ముందు ఆయనంతగానూ జానపద కథానాయక ఖ్యాతి గడించిన ఎమ్‌కే నారాయణన్ లాంటి  ఇతర అధికారులలాగే దోవల్ కూడా జీవితమంతా ఐబీ మనిషిగానే ఉన్నారు. నారాయణన్ కూడా దోవల్‌లాగే కేరళ క్యాడర్‌కు చెందిన అధికారికావడం విశేషం. భారత్‌కు తిరిగి వచ్చిన మరుక్షణమే దోవల్ నేరుగా పంజాబ్/సిక్కు సంక్షోభంలోకి ప్రవేశిం చారు. దాదాపు దశాబ్దిపాటూ, తిరుగుబాటు అంతమయ్యే వరకు అక్కడే తీరుబడి లేకుండా ఉన్నారు. పునరుజ్జీవం పొందిన ఐబీ అందించిన కీలక సహాయంతో కేపీఎస్ గిల్ నేతృత్వంలోని పంజాబ్ పోలీసు యంత్రాంగం అక్కడి తిరుగుబాటును తుదముట్టించింది. ఆ కాలాన్ని ఆ ఉగ్రవాద దశాబ్దిలోని మూడవ, సుదీర్ఘ దశగా తరుచూ అభివర్ణిస్తుంటారు. గిల్, నాకు ఆయనతోనూ, కీలకమైన అధికారులతోనూ మాట్లాడే అవకాశం కల్పించడం మాత్రమే కాదు, జలంధర్‌లోని పంజాబ్ ఆర్మ్‌డ్ పోలీస్ సెంటర్లో నిర్బంధంలో ఉన్న ఒకప్పటి అగ్రశ్రేణి (వారిని ఏ, బీ కేటగిరీలుగా వర్గీకరిం చారు) మిలిటెంట్లతో మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించారు. అందుకు నేను ఆయనకు రుణపడి ఉన్నాను.

‘బ్లాక్ థండర్’కు ఇంటెలిజెన్స్ అండ
ఆ మిలిటెంట్లు లొంగిపోయిన తీరు విస్మయకరం. అంతకు కొన్ని నెలల క్రితం వరకు వాళ్లు పంజాబ్ పశ్చిమ జిల్లాలలో చాలా భాగాన్ని శాసించినవారు. వారిలో చాలా మంది మహా అయితే 20ల మధ్య వయస్కులు. వారి మాటల్లో కొంత అమాయకత్వం ధ్వనించేది. వారిలో ఒకరు తనకు తానుగానే ‘‘మేజర్ జనరల్’’గా ప్రకటించుకున్నవాడు.  వాస్తవానికి తాను ఆ స్థాయికి చేరడం కోసం అప్పటికే 87 మంది హిందువులను చంపినట్టు అతను తెలిపాడు. మరో 13 మంది హిందువులను లేదా ముగ్గురు పోలీసులను (ఒక పోలీసు ఐదుగురు హిందువులకు సమానం) చంపివుంటే తనకు ‘‘లెఫ్టినెంట్ జనరల్’’ హోదా లభించేదన్నాడు. ఆ మిలిటెంట్ల కథనాలను బట్టి పంజాబ్ పోలీసుల విజయం స్థానిక పోలీసులదీ, ఐబీదేనని నాకు స్పష్టమైంది. ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ (1989-90) దశలో, ఏ లేదా బీ కేటకిరీకి చెందిన మిలిటెంటును ఎవరినైనా హతమార్చిన లేదా పట్టుకున్న ప్రతిసారీ నేను... గిల్ బౌలింగ్‌లో దోవల్ క్యాచ్ పట్టారంటూ ఒక విధమైన అర్ధ పరిహాస ధోరణిలో మాట్లాడేవాడిని. పంజాబ్ ఉగ్రవాదం చివరి దశలో దేశవ్యాప్తంగా ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆనుపానులను కనిపెట్టడంలో దోవల్ మరింత  చురుగ్గా పాల్గొన్నారు. ఎప్పటిలాగే తనదైన సొంత శైలిలోనే ఆ బాధ్యతలను నిర్వహించారు.  

పంజాబ్‌లో ఉగ్రవాదం అంతమైంది. కానీ ఈలోగా కశ్మీర్‌లో మరో పూర్తిస్థాయి సంక్షోభం వృద్ధి చెందింది. దోవల్, తానెంతగానో ప్రేమించే ఆపరేషన్స్ విభాగానికి వెళ్లారు. కశ్మీర్ నుంచి దావూద్ వరకు చాలా ముఖ్య ఆపరేషన్స్‌లో ఆయనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పద్ధతులు ఆయన సీనియర్లలో కొందరు ‘‘సరైన’’ అధికారులకు అంగీకారయోగ్య మైనవి కావు. అయితే ఫలితాలను సాధించగల ఆయన సామర్థ్యాన్ని అత్యధికులు గౌరవించేవారు. యూపీఏ ప్రభుత్వం, 2004 మేలో ఆయనను ఇంటెలిజెన్స్ బ్యూరో డెరైక్టర్‌గా నియమించింది. ఆ తరువాతనే దోవల్ పదవీ బాధ్యతల గురించే సాపేక్షికంగా అందరికీ ఎక్కువగా తెలిసింది.

వివేకానంద ఫౌండేషన్ ఏర్పాటు వెనుక ప్రధాన చోదక శక్తి ఆయనే. మధ్యేవాద మితవాద చింతనాపరులకు సంబంధించి నెలకొన్న శూన్యాన్ని అది పూడ్చింది. అన్నాహజారే ఉద్యమం సహా అవినీతికి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా సాగిన ప్రచారానికి వెనుకనున్న కీలకమైన బుర్ర కూడా ఆయనదే. వివేకానంద ఫౌండేషన్, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రతిభను అందించే కీలక వనరుగా మారింది. మోదీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా కూడా అందులోని వారే. మరీ పట్టువిడుపులు లేనివారిగా దోవల్‌కు ఉన్న పేరు వల్ల, ఆయన చుట్టూ నిర్మితమై ఉన్న జానపద కథానాయక ఖ్యాతి ఫలితంగా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) పదవికి ఆయన సహజమైన వ్యక్తి అయ్యారు.

‘పఠాన్‌కోట’ ముప్పుకు సరైన సమాధానం
ఇప్పటికీ ఆయన ఆవశ్యకంగా ఆపరేషన్స్‌కు సంబంధించిన వ్యక్తేనని ఆయనను తీర్చిదిద్దినవారు, సహచరులు, ఆయన శిష్యులు అంతా చెప్పే సత్యం. పఠాన్‌కోటలో అప్పుడు జరుగుతున్నది సాయుధ చర్యని అనిపించిన మరుక్షణమే ఆయన, కనీసం ఆలోచనల్లోనే అయినా తిరిగి ఆ రంగంలోకి దూకారు. కాబట్టే తక్షణమే జాతీయ భద్రతా బలగాలను (ఎన్‌ఎస్‌జీ) పఠాన్ కోటకు పంపాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే సంప్రదాయ గూఢచర్యం లేదా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌కూ, సువిశాలమైన వైమానిక దళ స్థావర కీలక ప్రాంతానికి ఎదురైన అంతకంటే పెద్ద ముప్పును ఎదుర్కోవడానికీ మధ్య తేడా ఉంది.

ఇదే గందరగోళానికి, విషయం కలగాపులగం కావడానికి దారితీసింది. దోవల్ ఆ ఆపరేషన్‌ను నియంత్రిస్తున్నట్టు ఎక్కువగా అనిపించడంతో దాన్ని నిరాకరించే అవకాశం ఆయనకు లేకుండాపోయింది. నిష్కపటంగా చెబు తున్నా.. నాకు కూడా ఆ విషయం కచ్చితంగా తెలియదు. అయితే తరచుగా కాల్పనిక గాథలు వాస్తవం కంటే బలమైనవిగా ఉంటాయి. ఎనభైలు, తొం భైల నాటి దోవల్ ప్రశంసకులందరికీ ఆయన అత్యంత ప్రతిభావంతుడైన, ‘కొంటె బుర్ర’ గూఢచారని తెలుసు. పఠాన్‌కోటలో జరిగనది అత్యంత సున్నితమైన, సైనిక వాతావరణంలో సాగిన ఎత్తుగడలపరమైన ఆపరేషన్.

దోవల్ మన ఐదో ఎన్‌ఎస్‌ఏ. కొన్ని విధాలుగా, భద్రతకు సంబం ధించి, ఆయన ఇంతవరకు మన అత్యంత శక్తివంతమైన ఎన్‌ఎస్‌ఏ. మొదటి ఎన్‌ఎస్‌ఏ బ్రిజేష్ మిశ్రా, ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అయితే ఆయన ప్రధాని కార్యాలయ నిర్వహణపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించే వారు. ఆ తదుపరి యూపీఏ ఆ బాధ్యతలను జీఎన్ దీక్షిత్ (విదేశాంగ విధానం), భద్రత (ఎమ్‌కే నారాయణన్)లకు మధ్య పంచింది. బ్రిజేష్ మరణించేవరకు ఆ విభజన కొనసాగింది.

నారాయణన్ ఇంటెలిజెన్స్‌ను, విదేశాంగ విధానపరమైన కీలక మీటలను  నియంత్రిస్తూ... పరిపాలనను టీకేఏ నాయర్‌కు వదిలిపెట్టారు. శివశంకర్ నాయర్ అంతా అనుకున్నట్టే విదేశాంగ విధానంపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించారు. సైన్యంపైన కూడా ఆయన దృష్టిని కేంద్రీకరించినా... ఏకే ఆంటోనీ సంభాషణాపరుడు కాకపోవడం, ఆయన నిర్ణయరాహిత్యం కారణంగా ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికే అది పరిమితమైంది. ఇప్పుడు దోవల్ ఆ పదవికి ఆపరేషనల్ మేధస్సును అందించారు. ఆ మేరకు ఆయన ఎన్‌ఎస్‌ఏ పదవిని ఎక్కువగా వార్తల్లో ఉండేదిగా మార్చారు.


శేఖర్ గుప్తా,    twitter@shekargupta

>
మరిన్ని వార్తలు