వ్యాపారుల దోపిడీకి చెక్‌

12 Nov, 2023 01:30 IST|Sakshi
పాడేరు వారపు సంతలో జీసీసీ ఏర్పాటుచేసిన రిటైల్‌ అమ్మకాల స్టాల్‌

గిరిజన సహకార సంస్థ సేవలనుమరింత విస్తరిస్తోంది. ఇప్పటి వరకు గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తున్న జీసీసీ ఇప్పుడు వారపు సంతల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి నిత్యావసర, కిరాణ సామగ్రి అమ్మకాలు చేపట్టి వ్యాపారుల దోపిడీకి చెక్‌ పెట్టింది. నకిలీల బారిన పడి మోసపోకుండా నాణ్యమైనవస్తువులను విక్రయిస్తూ గిరిజనులకు మరింత చేరువవుతోంది.

సాక్షి,పాడేరు: అగ్గిపెట్టె నుంచి ఇతర నిత్యావసరాలు, కిరాణాను గిరిజనులు వారపుసంతల్లోనే కొనుగోలు చేస్తారు. ప్రతివారం దగ్గరలోని వారపుసంతలకు వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల విక్రయించి వచ్చే ఆదాయంతో తమ ఇంటి అవసరాలకు గాను వారానికి సరిపడే సామగ్రిని కొనుగోలు చేస్తుంటారు. దీంతో వారపు సంతలే గిరిజనులకు షాపింగ్‌ మాల్స్‌గా గుర్తింపు పొందాయి.

అక్రమాలకు అడ్డుకట్ట

గిరిజనుల అమాయకత్వాన్ని అసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు వారు సంతల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. అధిక ధరలకు విక్రయించడంతో పాటు, కొన్ని సామాన్లలో నాణ్యతను పక్కనబెట్టి చాలావరకు నాసిరకం సరకులు అమ్ముతుంటారు. జీసీసీ వారపు సంతల్లో విక్రయాలు చేపట్టడం వల్ల వ్యాపారుల అక్రమాలకు చెక్‌ పడనుంది.

తక్కువ ధరలకే అమ్మకం: జీసీసీ రెండు వారాల నుంచి వారపుసంతల్లో రిటైల్‌ కిరాణా దుకాణాలను నిర్వహిస్తోంది. మార్కెట్‌లో నిత్యావసర, కిరాణా, ఆయిల్‌ సామగ్రి ధరల హెచ్చుతగ్గులను ప్రతి రోజు బేరీజు వేసుకుని జీసీసీ సిబ్బంది సరసమైన ధరలకు అమ్ముతున్నారు. దీంతో గిరిజనులు కూడా నాణ్యమైన సరుకులును పొందుతున్నారు.

ధరల్లో ఎంతో వ్యత్యాసం

పాడేరు మండలం గుత్తులపుట్టు సంతలో గురువారం ఫ్రీడమ్‌ ఆయిల్‌ కిలో రూ.130కు వ్యాపారులు విక్రయించగా, జీసీసీ రిటైల్‌ మార్ట్‌లో మాత్రం రూ.120కు అమ్మింది. వంటనూనె ధర తగ్గడంతో శుక్రవారం పాడేరు వారపు సంతలో జీసీసీ ఫ్రీడమ్‌ ఆయిల్‌ కిలో రూ.116కు విక్రయించింది. వ్యాపారులు మాత్రం ధర తగ్గించకుండా కిలో ఆయిల్‌ను రూ.125 నుంచి రూ.130కు విక్రయించారు. ఇదే విధంగా ధరల వ్యత్యాసం మిగతా సరకుల్లోను ఉంది. జీసీసీ లాభాపేక్ష లేకుండా విక్రయించడంతో గిరిజనుల నుంచి మంచి ఆదరణ నెలకొంది.

పాడేరు డివిజన్‌లో..: పాడేరు డివిజన్‌లో పాడేరు, అరకు, హుకుంపేట, జి.మాడుగుల, అన్నవరం, చింతపల్లి, ఆర్‌వీనగర్‌, తాజంగి, సీలేరు, ధారకొండ, సప్పర్ల, గుత్తులపుట్టు, పెదబయలు, మద్దిగరువు, ముంచంగిపుట్టు, రూడకోట, గోమంగి, బూసిపుట్టు, కించుమండ, సుంకరమెట్ట, డముకు, కాశీపట్నం వారపు సంతలు ఉన్నాయి. వీటిలో గిరిజన సహకార సంస్థ కిరాణా సరకులతో స్టాళ్లు ఏర్పాటు చేసింది.

వారపు సంతల్లో జీసీసీ రిటైల్‌ స్టాళ్లు

నిత్యావసర సరుకుల అమ్మకాలు

గిరిజనులకు తప్పిన నకిలీల బెడద

నాణ్యమైన సేవలు లక్ష్యం

వారపుసంతల్లోను రిటైల్‌ కిరాణా దుకాణాలను ఏర్పాటు చేస్తున్నాం. సంతలకు వచ్చే గిరిజనులకు నాణ్యమైన నిత్యావసర, కిరాణా సామగ్రిని వ్యాపారుల కన్నా తక్కువ ధరకే విక్రయిస్తున్నాం. వారపు సంతల్లో అమ్మకాలు చేపట్టడం వల్ల గిరిజనులు వ్యాపారుల బారిన పడి మోసపోకుండా ఉపయోగపడుతున్నాయి.

– డి.సింహాచలం, జీసీసీ డీఎం, పాడేరు డివిజన్‌

మరిన్ని వార్తలు