కట్టుబాట్లలో.. కరోనా కట్టడిలో

17 May, 2021 05:24 IST|Sakshi
అడిగుప్ప గ్రామం

ఆదర్శంగా నిలుస్తున్న అడిగుప్ప గ్రామం 

గ్రామంలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులే 

అయినా సమష్టి కృషితో కరోనాపై విజయం

గుమ్మఘట్ట: ఆ గ్రామం పేరు చెబితే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఆదర్శవంతమైన ఆ ఊరి కట్టుబాట్లు. ఊరిలో ఎక్కువ శాతం మంది నిర్లక్ష్యరాస్యులే. అయితేనేం.. కరోనా విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొంటూ తమ ఊరిని చుట్టుపక్కల గ్రామాలకు మార్గదర్శకంగా నిలిపారు. కట్టుబాట్లలోనే కాదు.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలోనూ ఆదర్శంగా నిలుస్తోన్న ఆ గ్రామం పేరు అడిగుప్ప. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో గుమ్మఘట్ట మండల పరిధిలో అడిగుప్ప గ్రామం ఉంది. 150 కుటుంబాలు, 500 మందికిపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. పట్టణానికి వివిధ అవసరాల నిమిత్తం నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయినా ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాకపోవడం విశేషం.  

జాగ్రత్తలే శ్రీరామరక్ష.. 
గ్రామంలో కొందరు యువత కరోనా పట్ల చెప్పిన జాగ్రత్తలే వారికి శ్రీరామరక్షగా నిలిచాయి. గ్రామంలో మాసు్కలేకుండా ఏ ఒక్కరూ బయట కనిపించరు. ఇప్పుడు ఆలయాలు, రచ్చకట్టల వద్ద గుంపులుగా కూర్చోవడం లేదు. పని ఉంటే తప్ప బయటకు రావటం మానేశారు. కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు కోడి మాంసం, కోడి గుడ్లు తరచూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నప్పటికీ ఈ గ్రామంలో ఆ రెండూ ముట్టుకోరు. పూర్వీకుల కాలం నుంచి ఉన్న గ్రామ దేవుడి ఆచారాలకు కట్టుబడి కోడి మాంసం, కోడి గుడ్డులకు దూరంగా ఉంటూనే కరోనాపై విజయం సాధించారు. 

ధైర్యంగా ఉంటున్నాం.. 
మా పక్క గ్రామాల్లో కరోనా విలయతాండవం చేస్తున్నా, భయపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. గ్రామంలోని విద్యావంతులు ఎప్పటికప్పుడు కరోనా పట్ల గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ జాగ్రత్త పడేలా చూస్తున్నారు.     
– రాజేష్, గ్రామస్తుడు 

సమిష్టి కృషి.. 
కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలిచిన అడిగుప్ప గ్రామం మా పంచాయతీ పరిధిలో ఉండడం గర్వంగా ఉంది. మద్యం విక్రయాలు, కోడి, కోడి గుడ్డు లాంటి వాటికి దూరంగా ఉండడం, ఎవ్వరూ నేరం చేసి పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కకూడదు వంటివి ఈ గ్రామంలో ఆదర్శాలు. ఇప్పుడు గ్రామస్తుల సమష్టి కృషితో కరోనా కట్టడిలోనూ ఆదర్శంగా నిలిచింది.   
 – ఎన్‌ రమేష్, సర్పంచ్,కేపీదొడ్డి పంచాయతీ  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు