సొంత జిల్లాలో బాబుకు చుక్కెదురు

4 Mar, 2021 03:46 IST|Sakshi

చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ హవా 

58 డివిజన్లు, 71 వార్డులు ఏకగ్రీవం 

మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో క్లీన్‌స్వీప్‌ 

వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లు! 

సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత జిల్లాలో మరోసారి చుక్కెదురైంది. చిత్తూరు జిల్లాలో ఎన్నికలు ఏవైనా వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని రుజువైంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 10 ఏళ్లు ప్రతిపక్షనేతగా చెప్పుకొనే చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ భంగపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగింది. జిల్లాలో మొత్తం 58 డివిజన్లు, 71 వార్డులు వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. నగిరి మున్సిపాలిటీలో మాత్రమే టీడీపీకి ఒక వార్డు ఏకగ్రీవమైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో క్లీన్‌స్వీప్‌ చేశారు. ఇక్కడ మొత్తం 31 వార్డుల్ని వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. పలమనేరు, మదనపల్లె ఎన్నికలు ఏకపక్షంగా నిలవనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో 84 శాతం విజయకేతనం ఎగురవేసిన వైఎస్సార్‌సీపీ మున్సిపోల్స్‌లో కూడా సత్తా చాటుకుంది. మొత్తం 130 స్థానాలు ఏకగ్రీవమైతే, అందులో 129 వైఎస్సార్‌సీపీవే. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా నిలిచింది. ఇప్పుడు పుంగనూరు మున్సిపాలిటీ కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 

కార్పొరేషన్లలో.. 
చిత్తూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లకుగాను 37 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు మేయర్‌ పీఠం వైఎస్సార్‌సీపీకి దక్కడం లాంఛనమే. తిరుపతి కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు 22 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 28 డివిజన్లలో కూడా పోటీ ఏకపక్షమేనని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో తిరుపతి మేయర్‌ పీఠం కూడా వైఎస్సార్‌సీపీకే దక్కనుంది. 

పలమనేరు, మదనపల్లెలో హవా
పలమనేరులో 26 వార్డులకుగాను 18 వార్డుల్ని వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఈ మున్సిపల్‌ చైర్మన్‌ పదవి గెలుచుకునేందుకు అవసరమైన బలం ఇప్పటికే లభించింది. మదనపల్లెలో 35 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రెండుచోట్ల ఎన్నికలు ఏకపక్షమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నగరి మున్సిపాలిటీలో 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో 6 వార్డుల్ని వైఎస్సార్‌సీపీ, ఒక వార్డును టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. పుత్తూరు మున్సిపాలిటీలో 1 వార్డును వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మొత్తంగా పరిశీలిస్తే చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని, తెలుగుదేశం పార్టీ జవసత్వాలు కోల్పోయిందని నిరూపణ అయింది.   

మరిన్ని వార్తలు