రాజకీయాలతో ముడిపెట్టొద్దు: బొత్స

4 Oct, 2020 14:35 IST|Sakshi

సాక్షి, విశాఖ : ప్రభుత్వ భూముల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీతమ్మధారలో మాజీ మేయర్ సబ్బం హరి ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి అధికారులు స్వాధీనం చేసుకోవడం తప్పు లేదన్నారు. అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి రాజకీయం చేయడం తగదని మంత్రి బొత్స హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిలో అందరూ సమానులే అని, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపును రాజకీయాలతో ముడి పెట్టడం సరికాదని అన్నారు. (చిత్తగించండి.. ఇదిగో ‘హరి’ చిట్టా..)

మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్‌ పనులను పరిశీలించారు. గత నెల ఫ్లై ఓవర్ తొలి దశ పనుల్లో భాగంగా విమానాశ్రయం నుంచి విశాఖ సిటీలోకి వెళ్లే రోడ్డు ప్రారంభమైంది.  తాజాగా తాటిచెట్ల పాలెం నుంచి గోపాలపట్నం వైపు వెళ్లే రోడ్డు పనులను మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యకు కేరాఫ్‌గా మారిన ఎన్‌ఏడీలో రెండు వైపులా రోడ్లు ప్రారంభం కావడంతో చాలా వరకు  సమస్య పరిష్కారమైందన్నారు.  ఏడాది చివరికల్లా ఫ్లైఓవర్ పనులు పూర్తవుతాయని తెలిపారు. త్వరితగతిన ఫ్లై ఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నగర దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ కమిషనర్‌ సృజన తదితరులు పాల్గొన్నారు. (ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏపీ పర్యాటకం)

మరిన్ని వార్తలు