అత్యవసర మందుల కొరతకు చెక్‌

5 Jun, 2022 05:28 IST|Sakshi

నూతన విధానం ప్రవేశపెడుతున్న వైద్య శాఖ  

డీ–సెంట్రలైజ్డ్‌ విధానంలో అత్యవసర మందుల సరఫరా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు అత్యవసర మందుల సరఫరాలో కొత్త విధానాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా మెడికల్‌ ఏజెన్సీలు, చెయిన్‌ ఫార్మసీల నుంచి ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) టెండర్లను ఆహ్వానించింది.

రాష్ట్రంలో డీఎంఈ పరిధిలో 32, వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 13 జిల్లా ఆస్పత్రులున్నాయి. వీటిలో చికిత్సకు సాధారణంగా వినియోగించే మందులను సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి ఏపీఎంఎస్‌ఐడీసీ సరఫరా చేస్తోంది. స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ చికిత్సల్లో వినియోగించే మందులు స్థానికంగా కొనుగోలు చేయడానికి మొత్తం మందుల బడ్జెట్‌లో డీఎంఈ ఆస్పత్రులకు 20 శాతం, జిల్లా ఆస్పత్రులకు 10 శాతం బడ్జెట్‌ను ఆయా ఆస్పత్రుల ఖాతాల్లో ఏపీఎంఎస్‌ఐడీసీ వేస్తుంది.

ఈ నిధులతో స్థానిక అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను ఆస్పత్రులు స్థానికంగానే కొనుగోలు చేస్తాయి. అయితే ఈ విధానంలో కొన్ని చోట్ల అధిక ధరలకు మందులు కొనుగోలు చేయడం, మందుల సరఫరాలో ఆలస్యం సహా పలు ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ, చెయిన్‌ ఫార్మసీల ద్వారా డీ–సెంట్రలైజ్డ్‌ విధానంలో అత్యవసర మందుల సరఫరా చేపట్టాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బోధనా, జిల్లా ఆస్పత్రికి సమీపంలో మందుల దుకాణాలున్న వారి నుంచి టెండర్లు స్వీకరిస్తున్నారు. ఎమ్మార్పీపై ఎక్కువ డిస్కౌంట్‌తో మందులు సరఫరా చేసే సంస్థను ఎంపిక చేసి కాంట్రాక్ట్‌ అప్పజెప్పనున్నారు.  

నేరుగా చెల్లింపులు.. 
ఆస్పత్రి సూపరింటెండెంట్‌లు ఇండెంట్‌ పెట్టిన ఎంత సమయంలోగా మందులు సరఫరా చేయాలన్నదానిపై నిబంధనలు రూపొందించారు. చాలా అత్యవసరమైన మందులను ఆరు గంటల్లోగా ఫార్మసీ సంస్థ సరఫరా చేయాల్సి ఉంటుంది.  

రెగ్యులర్‌ మెడిసిన్‌ అయితే 24 గంటల్లో, బల్క్‌ మెడిసిన్‌ను వారంలోగా సరఫరా చేయాలని గడువు విధించారు. సరఫరా చేసిన మందులకు బిల్లులను ఏపీఎంఎస్‌ఐడీసీనే నేరుగా చెల్లిస్తుంది.  ఈ విధానం వల్ల మందుల సరఫరాలో కాలయాపన తగ్గడంతో పాటు, వినియోగంపై స్పష్టత రావడంతో పాటు, ఆడిటింగ్‌కు ఆస్కారం ఉంటుంది.

కొరతకు తావివ్వకూడదనే.. 
అత్యవసర మందుల సరఫరాకు టెండర్లు పిలిచాం. వచ్చే వారంలో ఫైనల్‌ చేస్తాం. ఆస్పత్రుల సూపరింటెండెంట్లు మొబైల్‌ యాప్‌ ద్వారా ఆర్డర్లను ఇచ్చే విధానాన్ని తీసుకొస్తాం. ఆర్డర్‌ ఇచ్చిన వెంటనే మందులు ఆస్పత్రులకు సరఫరా అవుతాయి.  మందుల కొరతకు తావుండకూడదని నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. 
– మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ, వైస్‌ చైర్మన్‌ 

మరిన్ని వార్తలు