నేరస్తులు ఎవరో బట్టబయలు చేయాలి: మధు

15 Sep, 2020 14:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సీపీఎం ఆహ్వానిస్తోంది. ఇది మంచి పరిణామం.. నేరస్తులు ఎవరో బట్టబయలు చేయాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చాలాకాలం నుంచి రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగింది. కొందరు అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వంలో వుండి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ చేసి ప్రయోజనాలు పొందారని.. వాటిపై విచారణ జరపాలని ప్రజలు కోరారు. హై కోర్టులో కేసు సైతం వేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది.. అయితే ఇది సరైనది కాదని సుప్రీంకోర్టు రాష్ట్ర కోర్టు ఇచ్చిన తీర్పుపై వ్యాఖ్యనం చేసింది. ఇది హర్షించదగ్గ పరిణామం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు ఎవరైతే పాల్పడ్డారో మొత్తం వివరాలు బట్టబయలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దానికి అనుగుణంగానే ఏసిబి కేసు నమోదు చేసింది. ఇది శుభపరిణామం’ అన్నారు.(చదవండి: చంద్రబాబు, లోకేష్‌లకు అవకాశం..)

అంతేకాక ‘ఈ ప్రాంతంలో రాజధానిని అడ్డం పెట్టుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని కొందరు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. అసైన్డ్ భూముల విషయంలో మీకు న్యాయమైన ధర రాదు, నష్టపరిహారం రాధని అధికారంలో ఉన్న వారు రైతులను బెదిరించి.. భయపెట్టి మభ్యపెట్టి ఆ భూమలన్నీ వారే కాజేశారు. ఇలాంటి అవినీతి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు’ అన్నారు మధు.
 

>
మరిన్ని వార్తలు