Conocarpus: ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా?

28 Jul, 2022 16:58 IST|Sakshi

ఆత్మకూరు రూరల్‌(కర్నూలు జిల్లా): వృక్షోరక్షితి రక్షతః అంటారు పెద్దలు. అంటే  వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం. అయితే, అన్ని చెట్లు అలాంటివి కావని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కోనో కార్పస్‌. పచ్చదనం మాటున విరివిగా  పెరుగుతున్న ఈ వృక్షాలు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారనున్నాయి.  దుబాయి చెట్టుగా పిలువబడుతున్న ఈ  వృక్షం  ఇప్పటికే పలు దేశాలను కలవరపెడుతోంది.
చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! 

శంకురూపంలో ఉండే కోకో కార్పస్‌.. అమెరికా ఖండాల్లోని తీరప్రాంతం మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్‌ జాతి మొక్క.  వేగంగా  పెరిగే ఈచెట్టు పచ్చదనాన్ని అంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అరబ్, మధ్య ప్రాచ్యదేశాల్లో ఏడారినుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుపాన్ల నుంచి, వేడిగాలుల నుంచి  రక్షణగా ఉండేందుకు ఈ మొక్క ను  దిగుమతి చేసుకుని రహదారులు, గార్డెనింగ్, కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్లలో విస్తృతంగా పెంచుతున్నారు.

మనదేశంలోకి ప్రవేశించిందిలా.. 
వేగంగా పెరుగుతూ అధిక పచ్చదనాన్ని కలిగిన కోనోకార్పస్‌పై మనదేశంలోని నర్సరీ పెంపకం దారులు, ల్యాండ్‌స్కేప్‌ ఎక్స్‌పర్ట్‌ల దృష్టిపడింది. పచ్చదనంతో వెంచర్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఈ మొక్కలను తీసుకొచ్చారు.  అలా ఈ మొక్క మనదేశంలో ప్రవేశించింది. అనంతరం నగరాల్లోని మున్సిపల్‌ కార్పొరేషన్లు మొదలు సాధారణ నగర పంచాయతీల వరకు ఈ మొక్కలను డివైడర్లపై, రహదారుల్లో విరివిగా నాటడం మొదలు పెట్టారు.

తూర్పుకనుమల్లో భాగమైన నల్లమల అడవుల కేంద్రీయ స్థానమైన నంద్యాల జిల్లాలో కూడా దుబాయ్‌ మొక్క ప్రభంజనం తక్కువేమి కాదు. ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్‌ తదితర మున్సిపాలిటీలలో దుబాయ్‌ మొక్కలను రహదారుల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో పెద్ద ఎత్తున నాటుతున్నారు. జీవవైవిధ్యానికి మారు పేరైన నల్లమల సమీప ప్రాంతాల్లో ఈ ఖండాంతర మొక్క ప్రవేశంతో  పర్యావరణ పరిస్థితులు తల్లకిందులయ్యే అవకాశం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

కోనోకార్పస్‌ను నిషేధించిన తెలంగాణ  సర్కారు 
పలు పర్యావరణ సమస్యలకు కారణమవుతోందన్న కారణంతో కోనోకార్పస్‌ మొక్కలను నాటడాన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. హరితవనం కార్యక్రమంలో తొలుత ఈ మొక్కలనే ఎక్కువగా వినియోగించిన  ప్రభుత్వం త్వరలోనే వీటి దుష్ప్రభావాలను గుర్తించడం గమనార్హం.

వన్యప్రాణులకు సంకటం
వేరే ఖండాలనుంచి తెచ్చి పెంచే మొక్కలతో పర్యావరణ సమతుల్యతకు విఘాతమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అలాంటి వాటిని ఎక్సోటిక్‌ వీడ్‌ గా పిలుస్తుంటారు. ఇవి ప్రపంచంలో ఒక ప్రాంతం నుంచి సహజంగా అవి ఉండని మరో ప్రాంతంలో ప్రవేశ పెట్టబడినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వీడ్స్‌(కలుపు మొక్కలు)తో స్థానిక వృక్ష, గడ్డి జాతుల విస్తరణకు ఆటంకం ఏర్పడుతుంది.

దీంతో హెర్బీవోర్స్‌(గడ్డితినే జంతువులు)కు ఆహార కొరత ఏర్పడి అది కార్నీవోర్స్‌( మాంసాహార జంతువులు)ఉనికికే ప్రమాదకారణమవుతుంది. కోనోకార్పస్‌తో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తనున్నాయి. ఇది వేగంగా పెరిగే నిత్య పచ్చదనం మొక్క కావడంతో ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి ఇతర స్థానిక జాతి మొక్కలను, గడ్డిని ఎదగనీయదు.అలాగే పక్షులకు తమ జీవావరణంలో వచ్చిన ఈ కొత్త మొక్క గందరగోళానికి గురి చేయడంతో సహజ రక్షణలో గూళ్లు కట్టుకోవడంలో వైఫల్యం చెంది పునరుత్పత్తి అవకాశాలను తగ్గించుకుంటాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. 

పలు ఆరోగ్య సమస్యలకూ కారణం
కోనోకార్పస్‌మొక్కపర్యావరణాన్ని హాని చేయడంతో పాటు ప్రజారోగ్య సమస్యలకు కారణమవుతుందని  పొరుగుదేశమైన పాకిస్తాన్‌ గుర్తించింది. ముఖ్యంగా కరాచీ నగరంలో హఠాత్తుగా పెరుగుతున్న ఊపిరి తిత్తుల వ్యాధిగ్రస్తుల సంఖ్యకు ఈ మొక్కలే కారణమని పరిశోధనల్లో  తేల్చింది.  గా లిలో ఎక్కువ సంఖ్యలో పుప్పొడి రేణువులు కనిపించడం అవి కోకోకార్పస్‌ పుష్పాలివిగా తెలియడంతో ఈ మొక్కల పెంపకాన్ని పూర్తిగా నిషేధించింది.అధిక సంఖ్యలో భూగర్భజలాలను వినియోగించుకునే సామర్థ్యం కలిగిన ఈ మొక్కలతో పర్యావరణానికి  చేటు అని  మరికొన్ని అరబ్‌దేశాలు గుర్తించాయి.

దుబాయ్‌ మొక్కలతో పలు సమస్యలు 
దుబాయ్‌ మొక్కలు  స్థానిక పర్యావరణ పరిస్థితులకు  ముప్పుగా మారుతున్నాయి. చాలా మంది ఈ మొక్క గురించి తెలుసుకోకుండా పెంచుతున్నారు. ఆకురాల్చు అడవులున్న  మన ప్రాంతంలో నిత్య పచ్చదనం కలిగిన దుబాయి మొక్కలు ఇతర వృక్షజాతుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయి. వీటి పుష్పాలు వెదజల్లె పుప్పొడి వల్ల పలు శ్యాసకోశ వ్యాధులు, అలర్జీ సమస్యలు తలెత్తుతాయి.
 – విష్ణువర్ధన్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి,ఆత్మకూరు 

ఈ మొక్కలను నిషేధించాలి
మహారాష్ట్రలోని పూణే, మన పొరుగున ఉన్న తెలంగాణలో  దుబాయి మొక్కలను నాటడాన్ని నిషేధించినట్లుగానే మన రాష్ట్రంలో కూడా నిషేధించాలి. పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలిగించే ఏ అంశానైనా  ప్రభుత్వాలు అడ్డుకోవాలి.
– సుబ్బయ్య ఆచారి, పర్యావరణ ప్రేమికుడు, ఆత్మకూరు  

మరిన్ని వార్తలు