ఉపాధ్యాయుల ‘పాజిటివ్‌’ బోధనలు

11 May, 2021 04:09 IST|Sakshi
ఉపాధ్యాయులకు అందజేసిన గూగుల్‌ షీట్‌

కోవిడ్‌ రోగుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి గుంటూరు జిల్లా కలెక్టర్‌ వినూత్న పంథా 

ఇంట్లో చికిత్స పొందుతున్న ఒక్కో రోగికి ఒక్కో ఉపాధ్యాయుడితో అనుసంధానం 

ఫోన్‌ ద్వారా రోజుకు రెండుసార్లు ఆరోగ్య పరిస్థితి వాకబు చేస్తున్న టీచర్లు 

ఇతర శాఖల ఉద్యోగులను వినియోగించుకునేందుకు ప్రణాళికలు

సాక్షి, అమరావతి బ్యూరో: హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కోవిడ్‌ రోగుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ వినూత్న పంథాకు శ్రీకారం చుట్టారు. ఇందుకు ఉపాధ్యాయులను రంగంలోకి దింపారు. ఇందులో భాగంగా ఒక్కో కోవిడ్‌ రోగికి ఒక్కో ఉపాధ్యాయుడిని కేటాయించారు. తమకు కేటాయించిన రోగికి ఉపాధ్యాయులు రోజుకు రెండుసార్లు ఫోన్‌ చేసి వారి ఆరోగ్య సమాచారం తెలుసుకోవడంతో తమ మాటల ద్వారా వారిలో సానుకూల దృక్పథం పెంపొందిస్తున్నారు. రోగులు మానసికంగా కుంగిపోకుండా ధైర్యవచనాలు చెబుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.

ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు.. ఏయే మందులు వాడుతున్నారు.. ఆరోగ్యం ఎలా ఉంది తదితర వివరాలను రోజూ తెలుసుకుంటున్నారు. రోగులకు నిత్యం ఫోన్‌లో అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ తమకు కేటాయించిన గూగుల్‌ షీట్‌లో నమోదు చేస్తున్నారు.  ఇలా గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 9,947 మంది ఉపాధ్యాయులు ఇంట్లో ఉంటూ ఫోన్‌ ద్వారా కేర్‌టేకర్‌లుగా పనిచేస్తున్నారు. కాగా, ప్రస్తుతం జిల్లాలో 17,575 యాక్టివ్‌ కేసులు ఉండగా, 9,947 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇతర శాఖల ఉద్యోగులను వినియోగించుకోనున్నాం.. 
కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి అన్ని సదుపాయాలు, సేవలు అందుతున్నాయా, లేదా అనే విషయం తెలుసుకోవడంతోపాటు వారికి మానసికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో కేర్‌టేకర్‌ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఉపాధ్యాయులను రోగులకు కేటాయించడం వల్ల పర్యవేక్షణ బాగుంటుంది. అంతేకాకుండా వారు త్వరగా కోలుకుంటారు. ఇతర శాఖల ఉద్యోగులను కూడా కేర్‌టేకర్లుగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 
 – వివేక్‌ యాదవ్, జిల్లా కలెక్టర్, గుంటూరు 

సంతృప్తినిస్తోంది.. 
ఇంట్లో ఉంటున్న కోవిడ్‌ బాధితులకు మా వంతు సాయం అందిస్తుండటం చాలా సంతృప్తినిస్తోంది. వారికి అవసరమైన సమాచారం ఇవ్వడంతోపాటు మా మాటల ద్వారా వారికి భరోసా ఇస్తున్నాం. దీన్ని బరువుగా కాకుండా సామాజిక బాధ్యతగా భావిస్తున్నాం.  
 –కె.బసవలింగారావు, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు  

మరిన్ని వార్తలు