మదనపల్లె హత్యకేసులో నిందితులు రుయాకు తరలింపు

30 Jan, 2021 08:49 IST|Sakshi

మదనపల్లె నిందితులకు కౌన్సెలింగ్‌  

మానసికంగా బాధపడుతున్నట్టు నిర్ధారణ  

విశాఖకు రెఫర్‌ చేసిన రుయా వైద్యులు 

తిరుపతి: ‘పద్మజ, పురుషోత్తంనాయుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీరికి సుమారు నాలుగు గంటల పాటు కౌన్సెలింగ్‌ ఇచ్చాం. వైద్యపరీక్షలు చేశాం. మేం అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పారు. విపరీతమైన దైవ చింతనతోనే వారు ఈ సమస్య బారినపడ్డారు. స్కిజోఫ్రేనియా, మేనియా తదితర మానసిక సమస్యల లక్షణాలు వీరిలో ఉన్నాయి. మరింత కౌనెల్సింగ్‌ అవసరం’. అని రుయా మానసిక వైద్యనిపుణులు తేల్చారు. మదనపల్లెలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు నిందితులు పురుషోత్తంనాయుడు, పద్మజను భారీ బందోబస్తు నడుమ శుక్రవారం రుయాకు తీసుకొచ్చా రు. వీరిని పరీక్షించిన వైద్యులు అధునాత పరీక్షలు, మరింత కౌన్సెలింగ్‌ కోసం విశాఖ మానసిక వైద్యశాలకు రెఫర్‌ చేశారు. ఇదిలావుండగా ఆర్థిక స్థితిగతులను చూసి కొందరు వీరిపై కన్నేసి ఉండొచ్చన్న అనుమానాలతో హైకోర్టు అడ్వ కేట్‌ రజినీ నిందితులను విచారించేందుకు సిద్ధమయ్యారు.

విశాఖకు రెఫర్‌ చేశాం  
రుయాలో ప్రత్యేక బృందంతో నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించాం. సుమారు ఐదు గంటల పాటు విడివిడిగా వారి మానసిక స్థితిని అంచనా వేశాం. వైద్యపరీక్షల్లో వారు పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించాం. వీరికి మరిన్ని వైద్యపరీక్షలు అవసరం. అందుకోసం విశాఖకు రెఫర్‌ చేశాం. 
–డాక్టర్‌ భారతి, రుయా సూపరింటెండెంట్‌  

అదో లోకానికి వెళ్లిపోయారు! 
నాపేరు దిలీప్‌. మాది చిత్తూరు అరగొండ దగ్గర విలేజ్‌. మేం ముగ్గురు అన్నదమ్ములం. పురు షోత్తం నాయుడు నాకు స్వయాన అన్న. వదిన పద్మజకు దైవభక్తి ఎక్కువ. పెద్దమ్మాయి మా వదినలా పూజలు చేసేది. వదిన, పెద్దపాప అలేఖ్య విపరీత ఆధ్యాత్మిక భావనతో మానసికంగా అదో లోకానికి వెళ్లిపోయారు. –దిలీప్, (పురుషోత్తం నాయుడి సోదరుడు)  

ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు  
రుయా మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్‌ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితులు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. విపరీతమైన దైవ చింతనతోనే వారు ఈ సమస్య బారినపడ్డారన్నారు. స్కిజోఫ్రేనియా, మేనియా తదితర మానసిక సమస్యల్లో ఉండే లక్షణాలు వీరిలో ఉన్నాయన్నారు. పద్మజ తండ్రి, మేనత్తలు సైతం మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. రుయాలో కస్టోడియల్‌ కేర్‌ లేకపోవడంతో వీరిని విశాఖకు రెఫర్‌ చేసినట్లు వివరించారు.
 
వైద్యులను తికమక పెట్టిన పద్మజ 

తాను మూడోకన్ను తెరిస్తే భస్మమవుతారని వైద్య పరీక్షలకు వచ్చిన పద్మజ రుయా డాక్టర్లను తొలుత బెదిరించారు. వైద్యులు ఒకింత అయోమయానికి లోనైట్లు తెలిసింది. 

వైద్య పరీక్షల కోసం తిరుపతి రుయా మానసిక చికిత్స విభాగానికి తీసుకువచ్చిన పోలీసులు 

మరిన్ని వార్తలు