‘రైతుల ఆందోళనపై బాబు రాజకీయం మానుకోవాలి’

5 Nov, 2021 14:27 IST|Sakshi

షుగర్‌ ఫ్యాక్టరీ, రైతుల మధ్య వివాదంపై మంత్రి బొత్స సమీక్ష

సాక్షి, విజయనగరం: ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీతో  రైతుల బకాయిల వివాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతుల డిమాండ్, యాజమాన్య వైఖరిపై చర్చించారు. ఈ సందర్భంగా పోలీసులపై దాడి, పోలీస్ సిబ్బందికి గాయాల విషయాన్ని జిల్లా ఎస్‌పీ దీపికా మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి  రైతులకు త్వరగా న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాజమాన్యంతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స పేర్కొన్నారు. షుగర్ ఫ్యాక్టరీ రైతుల ఆందోళనపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ రాజకీయం చేయడం మానుకోవాలని రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉందని పేర్కొన్నారు. రైతుల ఆందోళనను ప్రభుత్వం అర్ధం చేసుకుందని తెలిపారు. రైతులపై లాఠీచార్జ్‌ చేశారని అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రైతుల ముసుగులో వామపక్షనాయకలు పోలీసులపై రాళ్లు రువ్వారని అన్నారు. పోలీసులకు గాయాలు అయ్యాయని అయినా పోలీసులు సంయమనం పాటించారని గుర్తుచేశారు. ఏ ఒక్క రైతుపై చేయిచేసుకోలేదన్నారు. ఎన్‌సీఎస్‌ యాజమన్యానికి చెందిన 24 ఎకరాల భూమి వేలం వేయడానికి న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అదుపులో 34వేల బస్తాల పంచదార ఉందని, వీటిని విక్రయించి రైతుల బకాయి రూ. 16కోట్ల  చెల్లిస్తామని అన్నారు. 2013-2014 రైతుల బకాయిలు రూ. 20 కోట్లు 2019లో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చాక సెటిల్ చేశామని తెలిపారు.

చదవండి: 14 ఏళ్లు సీఎంగా ఉండి కనీసం మంచి నీళ్లు ఇవ్వలేకపోయారు: పెద్దిరెడ్డి

చంద్రబాబు తన 5 ఏళ్ల కాలంలో ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. యాజమాన్యంపై ప్రభుత్వానికి నమ్మకం లేదని, 2019-20కి సంబంధించిన బకాయిలు ప్రతి రైతుకు పైసాతో సహా చెల్లింపులు జరపాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.సాగు చేసిన చెరుకును ఇతర ఫ్యాక్టరీలకు మళ్లించే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడే గంజాయి సాగు జరుగుతోందని చంద్రబాబు అంటున్నారని, కానీ ఆయన పాలనా కాలంలోనే ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా గంజాయి ఎగుమతి అవుతోందని అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు అనడం నిజం కాదా అని నిలదీశారు.  అమరావతి రైతులు ఎక్కడున్నారు అది టీడీపీ రాజకీయ పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. విశాఖ రాజధాని కాకుండా న్యాయస్థానాలను ఆశ్రయించి జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు మేలు చేయండని పవన్ కళ్యాణ్ అడగడం లేదని, బిర్యానీ, భోజనం పెడతా ఆందోళన చేద్దాం రండని పిలుపు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

చదవండి: CM YS Jagan: సీఎం జగన్‌ని కలిసిన అజేంద్ర బహదూర్‌సింగ్‌

>
మరిన్ని వార్తలు