అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణానికి టెండర్లు

24 Apr, 2021 03:43 IST|Sakshi

రూ.180 కోట్లతో 125 అడుగుల విగ్రహం

ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచిన ఏపీఐఐసీ

14 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలి

మే 7న మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు బిడ్‌ దాఖలుకు అనుమతి

సాక్షి, అమరావతి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు గౌరవ సూచకంగా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్‌మైదాన్‌ (పీడబ్ల్యూడీ గ్రౌండ్‌)లో 125 అడుగుల డాక్టర్‌ బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ రామ్‌జీ విగ్రహం ఏర్పాటుకు ఈపీసీ విధానంలో ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఈ విగ్రహ నిర్మాణ వ్యయాన్ని రూ.180 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ 14 నెలల్లో విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలి. టెండర్‌ డాక్యుమెంట్లు శుక్రవారం రాత్రి నుంచి అందుబాటులో ఉంచినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. మే 7వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేయడానికి అనుమతిస్తారు. టెండర్‌ దక్కించుకున్న సంస్థ 90 రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంటుంది.

249 కోట్లతో పార్కు అభివృద్ధి
స్వరాజ్‌ మైదాన్‌లో సుమారు 20 ఎకారల విస్తీర్ణంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ రామ్‌జీ అండ్‌ డెవలప్‌మెంట్‌ పార్కును రూ.248.71 కోట్లతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహం కింద భాగంలో జీ+1 తరహాలో 2,000 మంది కూర్చోవడానికి వీలుండే విధంగా కన్వెన్షన్‌ సెంటర్, ధ్యాన మందిరం నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పనులకు జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదం లభించడంతో ఏపీఐఐసీ విగ్రహ నిర్మాణానికి టెండర్లు పిలిచింది.  

మరిన్ని వార్తలు