పోలీస్‌స్టేషన్‌కు యూకేజీ పిల్లోడు.. ‘మీరంతా వచ్చి ట్రాఫిక్‌ క్లియర్‌ చేయండి’

20 Mar, 2022 04:40 IST|Sakshi
ట్రాఫిక్‌ సమస్యపై సీఐ భాస్కర్‌కు ఫిర్యాదు చేస్తున్న బుడతడు, (ఇన్‌సెట్‌లో) కార్తికేయ

పోలీస్‌స్టేషన్‌కొచ్చి పట్టుబట్టిన యూకేజీ చిన్నోడు

బుడతడి ధైర్యానికి మెచ్చి స్వీట్‌ కొనిచ్చిన సీఐ 

పలమనేరు: తమ పాఠశాల వద్ద జేసీబీ, ఇతర వాహనాలను అడ్డుగా నిలపడంతో స్కూల్‌ బస్సులు ఆపాలన్నా, బడికి వెళ్లాలన్నా ట్రాఫిక్‌ వల్ల ఇబ్బందిగా ఉందని ఓ యూకేజీ పిల్లోడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో యూకేజీ చదువుతున్న కార్తికేయ (06) నిత్యం బడి వద్ద ట్రాఫిక్‌ సమస్య తలెత్తడాన్ని గమనించాడు. ఈ సమస్య తీరాలంటే ఎవరితో చెప్పాలని తన తండ్రిని అడగ్గా పోలీసులకు చెప్పాలంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో శనివారం ఉదయం కార్తికేయ పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం నాన్నా.. అంటూ మారాం చేయడంతో తండ్రి స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లాడు.

వెంటనే లోనికెళ్లిన బుడతడు సీఐ భాస్కర్‌ వద్దకెళ్లి.. వెంటనే మీరంతా వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయండి అంటూ బుడిబుడిమాటలతో ధైర్యంగా అడిగాడు. ఓ కానిస్టేబుల్‌ను పంపుతామని సీఐ చెప్పడంతో వద్దు సార్‌.. మీరే రావాలని పట్టుబట్టాడు. ఆ పిల్లాడి ధైర్యానికి సంబరపడిపోయిన సీఐ ఓ మిఠాయి తినిపించి అభినందించాడు.

ఏ ప్రాబ్లమ్‌ వచ్చినా నాకు ఫోన్‌ చేయమంటూ సీఐ మాటవరసకు చెప్పగా.. ఆ బుడతడు వెంటనే ‘ఫోన్‌ నంబర్‌ ఇస్తే కదా’ అనడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. తర్వాత సీఐ ఓ పేపర్‌పై తన సెల్‌ నెంబరు రాసిచ్చి పంపాడు. అనంతరం ఓ కానిస్టేబుల్‌ను పంపి స్కూల్‌ వద్ద ట్రాఫిక్‌ విధుల్లో ఉంచారు. దీన్నంతా సెల్‌ఫోన్లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఇప్పుడా వీడియో నెట్టింట హల్‌చల్‌ సృష్టిస్తోంది.

మరిన్ని వార్తలు