భారత్‌లో 5జీ ఫోన్‌లను తెగ కొనేస్తున్నారు!

8 May, 2023 08:29 IST|Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్లు (కంపెనీల నుంచి విక్రయదారులకు రవాణా) జనవరి–మార్చి త్రైమాసికంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం తగ్గి 3.1 కోట్ల యూనిట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఐడీసీ ప్రకటించింది. గడిచిన నాలుగేళ్లలో మొదటి త్రైమాసికంలో అతి తక్కువ షిప్‌మెంట్‌ ఇదేనని ఐడీసీ పేర్కొంది. రియల్‌మీ, షావోమీ ఫోన్ల షిప్‌మెంట్‌లో ఎక్కువ క్షీణత నమోదైంది. ఇవి మార్కెట్‌ వాటాను కూడా నష్టపోయాయి.

2023లో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో వృద్ధి ఫ్లాట్‌గా ఉంటుందని ఐడీసీ అంచనా వేసింది. ఇక స్మార్ట్‌ఫోన్ల రవాణాలో క్షీణత ఉన్నప్పటికీ.. శామ్‌సంగ్‌ 20.1 శాతం మార్కెట్‌ వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 17.7 శాతం వాటాతో వివో ఉంది. ఒప్పో 17.6 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. అంతేకాదు మార్చి త్రైమాసికంలో షిప్‌మెంట్‌ పరంగా వృద్ధిని చూపించిన ఏకైక సంస్థగా ఒప్పో నిలిచింది. షావోమీ షిప్‌మెంట్‌ 41.1 శాతం తగ్గి 50 లక్షల యూనిట్లుగా ఉంది. మార్కెట్‌ వాటా 2022  మొదటి త్రైమాసికంలో 23.4 శాతంగా ఉంటే, అది ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 16.4 శాతానికి తగ్గింది. ఆ తర్వాతి స్థానంలో 9.47 శాతం వాటాతో రియల్‌మీ ఉంది. 29 లక్షల యూనిట్లను రవాణా చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రియల్‌మీ మార్కెట్‌ వాటా 16.4 శాతంగా ఉండడం గమనార్హం.

‘‘అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వినియోగ డిమాండ్‌ బలహీనంగా ఉంది. 2022 ద్వితీయ ఆరు నెలల్లో పండుగలకు ముందు విక్రేతలు స్టాక్‌ పెంచుకోవడంతో, వారి వద్ద నిల్వలు అధికంగా ఉన్నాయి’’అని ఐడీసీ నివేదిక తెలిపింది. ఇక మొత్తం షిప్‌మెంట్లలో 5జీ స్మార్ట్‌ఫోన్ల వాటా 45 శాతానికి పెరిగింది. తక్కువ ధరల 5జీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి.   

మరిన్ని వార్తలు