Adani-Hindenburg Row: హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు: అదానీకి భారీ ఊరట

19 May, 2023 17:09 IST|Sakshi

సాక్షి, ముంబై: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూపు వివాదంలో గౌతం అదానీ భారీ ఊరట లభించింది. అదానీ గ్రూప్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు నియమించిన ఆరుగురు సభ్యులు  పానెల్‌ కీలక వ్యాఖ్యలు చేసింది.  అదానీ గ్రూప్ ఇప్పటికే ఉన్న సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించినట్లు గుర్తించలేదని తెలిపింది. ప్రస్తుత దశలో అదానీ గ్రూప్ షేర్ల ధరలను తారుమారు ఆరోపణలపై నియంత్రణ వైఫల్యం జరిగినట్లు నిర్ధారించటం సాధ్యం కాదని చెప్పింది.  

ఎలాంటి ఆధారాలు లేవు
అదానీ గ్రూప్ ప్రస్తుత మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు  ఎలాంటి ఆధారాలు లభించలేదని సుప్రీం ‍ప్యానెల్‌ తన నివేదికలో పేర్కొంది. తద్వారా  స్టాక్  మానిప్లులేషన్స్‌తో అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడిందంటూ చేసిన హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను కొట్టిపారేసింది. అలాగే ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులకు సంబంధించి 2018 నిబంధనలు మారినప్పటికీ వాటినే అనుసరిస్తోందని కమిటీ వ్యాఖ్యానించింది. 

సెబీకి మూడు నెలల గడువు
మరోవైపు  సెబీకూడా ఈ వ్యవహారంలో దర్యాప్తునకు మరింత సమయం కావాలని కోరింది.  హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తును పూర్తి చేయడానికి సెబీకి సుప్రీంకోర్టు మూడు నెలల పొడిగింపును మంజూరు చేసింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ స్టాక్ ధరల తారుమారు ఆరోపణలపై దర్యాప్తుపై అప్‌డేట్ చేసిన స్టేటస్ రిపోర్ట్‌ను ఆగస్టు 14లోగా సమర్పించాలని సుప్రీం సెబీకి సూచించింది. దీంతో శుక్రవార నాటి మార్కెట్లో అదానీగ్రూపు షేర్లలో భారీ కొనుగోళ్లు  కనిపించాయి. 

కాగా హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఇది సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ గ్రూప్ ఏదైనా ఉల్లంఘనకు పాల్పడిందా అనే దానిపై దర్యాప్తు చేసే బాధ్యతను జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ  మే 8న తన నివేదికను సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు సమర్పించింది.  
 

మరిన్ని వార్తలు