ఇక కొత్త పథకాల జోరు.. ముగిసిన మూడు నెలల నిషేధం

1 Aug, 2022 05:22 IST|Sakshi

ఎన్‌ఎఫ్‌వోల ప్రారంభానికి ఫండ్స్‌ ఆసక్తి

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ కొత్త పథకాలు ఇక మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. కొత్త పథకాల ఆరంభంపై సెబీ విధించిన మూడు నెలల నిషేధం ముగిసిపోయింది. దీంతో అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఫండ్స్‌ సంస్థలు) కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క జూలైలోనే 28 పథకాలను కంపెనీలు ప్రారంభించాయి. ఈక్విటీ, డెట్, ఇండెక్స్, ఈటీఎఫ్‌ల విభాగాల్లో వీటిని తీసుకొచ్చాయి.

ఇన్వెస్టర్ల నిధుల పూలింగ్‌ విషయంలో తాను తీసుకొచ్చిన నిబంధనలను జూలై 1 నాటికి అమలు చేయాలని ఆదేశిస్తూ.. అప్పటి వరకు కొత్త పథకాలు ప్రారంభిచొద్దని ఈ ఏడాది ఏప్రిల్‌లో సెబీ ఆదేశించింది. జూలై 1తో నిషేధం ముగిసిపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో డ్యుయల్‌ అథెంటికేషన్, ఖాతా మూలాలను గుర్తించాలని కూడా సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కొత్త నిబంధనలు తెచ్చింది.

జూలైలో 28 ఎన్‌ఎఫ్‌వోలు  
జూలైలో 18 ఏఎంసీలు కలసి 28 కొత్త పథకాలను ప్రారంభించాయి. ఇందులో నాలుగు పథకాలు ముగిసిపోగా, 24 పథకాలు ఇంకా పెట్టుబడుల స్వీకరణలో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, బరోడా బీఎన్‌పీ పారిబాస్, కెనరా రొబెకో, డీఎస్‌పీ, మోతీలాల్‌ ఓస్వాల్, ఐడీఎఫ్‌సీ, మిరే అస్సెట్‌ నుంచి ఈ పథకాలు ప్రారంభమయ్యాయి.

ఇటీవల ప్రారంభమైన పథకాల్లో చాలా వరకు సెబీ విధించిన మూడు నెలల నిషేధానికి ముందే అనుమతి పొందినవిగా ఆనంద్‌రాఠి షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొడక్ట్స్‌ హెడ్‌ అమర్‌ రాను తెలిపారు. ప్యాసివ్‌ విభాగంలో పథకాలు లేకపోతే వాటా కోల్పోతామన్న ఉద్దేశ్యంతో.. ఏఎంసీలు ప్యాసివ్‌ ఇండెక్స్‌ పథకాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. యాక్టివ్‌ నిర్వహణతో కూడిన ఈక్విటీ పథకాల్లో మంచి రాబడులు లేకపోవడంతో.. ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను ప్యాసివ్‌ పథకాలకు మళ్లిస్తున్నట్టు అమర్‌రాను వెల్లడించారు. ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నుంచి ఈటీఎఫ్‌లకు ఆసక్తి పెరిగినట్టు మార్నింగ్‌ స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.

176 కొత్త పథకాలు..  
2021–22లో ఏఎంసీలు 176 కొత్త పథకాలను ఆవిష్కరించి, వీటి రూపంలో రూ.1.08 లక్షల కోట్లను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించాయి. అంటే సగటున ఒక్కో నెలలో 15 పథకాలు ప్రారంభమయ్యాయి. 2020–21లో 84 కొత్త పథకాలు రాగా, అవి రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. రానున్న రోజుల్లో మరిన్ని నూతన పథకాలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తాయని, వీటిల్లో డెట్, ఈక్విటీ విభాగం నుంచి ప్యాసివ్‌ (ఇండెక్స్‌ల్లో) స్ట్రాటజీతో ఉంటాయని ఎపిస్లాన్‌ మనీ మార్ట్‌ ప్రొడక్ట్స్‌ హెడ్‌ నితిన్‌రావు చెప్పారు.

మరిన్ని వార్తలు