అమెజాన్‌-ఫ్యూచర్‌-రిలయన్స్‌ కేసు! విచారణ వాయిదా ఎందుకంటే..

9 Jul, 2021 12:10 IST|Sakshi

Amazon-Future-Reliance Case  ఫ్యూచర్‌–రిలయన్స్‌ ఒప్పందంపై అమెజాన్‌ దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు ఈ నెల 20న విచారించనుంది.

న్యూఢిల్లీ:  ఫ్యూచర్‌–రిలయన్స్‌-అమెజాన్‌ కేసు విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్‌ నారీమన్,  కేఎం జోసెఫ్, బీఆర్‌ గవాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు గురువారం ఈ వివాదం విచారణకు వచ్చింది. అయితే ఇదే కేసుపై జూలై 12న నుంచీ సింగపూర్‌ ట్రిబ్యునల్‌ విచారణ జరపనుందని, ఈ పరిస్థితుల్లో వారం పాటు కేసు విచారణను వాయిదా వేయాలని ధర్మాసనానికి ఫ్యూచర్స్‌ తరఫు సీనియర్‌ అడ్వకేట్‌ హరీష్‌ సాల్వే విజ్ఞప్తి చేశారు. 

మరోవైపు ఈ విషయంలో తనకూ అభ్యంతరం ఏదీ లేదని అమెరికా ఈ కామర్స్‌ దిగ్గజం– అమెజాన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది గోపాల సుబ్రమణియన్‌ కూడా పేర్కొనడంతో కేసు తదుపరి విచారణను 20కి వాయిదావేస్తూ బెంచ్‌ నిర్ణయం తీసుకుంది. 

వివాదంలో రూ.24,713 కోట్ల డీల్‌.. 
రిలయన్స్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌ తన రిటైల్‌ అండ్‌ హోల్‌సేల్, లాజిస్టిక్స్‌ బిజినెస్‌ను విక్రయిస్తూ 2020లో కుదుర్చుకున్న  రూ.24,713 కోట్ల డీల్‌పై అమెజాన్‌ న్యాయపోరాటం చేస్తోంది.  ఫ్యూచర్‌ అన్‌లిస్టెడ్‌ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో (బీఎస్‌ఈ లిస్టెడ్‌ ఫ్యూచర్‌ రిటైల్‌లో  ఫ్యూచర్స్‌ కూపన్స్‌ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్‌ వారెంట్స్‌ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్‌ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ,  ఫ్యూచర్‌ కూపన్స్‌ డీల్‌ కుదుర్చుకున్నప్పుడే మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఫ్యూచర్‌ రిటైల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్‌ పేర్కొంది. 

అయితే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ నుంచి అమెజాన్‌కు వ్యతిరేక రూలింగ్స్‌ వచ్చాయి. వీటిపై సుప్రీంకోర్టును అమెజాన్‌ ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకుంది. ఇదే కేసు సింగపూర్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఐఏసీ) కూడా విచారించనుంది.

మరిన్ని వార్తలు