సినిమాల ప్రభావం.. కరెంట్‌ చెత్తతో ఐరన్‌మ్యాన్‌ సూట్‌! అడ్రస్‌ కోసం ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

20 Sep, 2021 14:22 IST|Sakshi

సినిమాల ప్రభావం మిగతావాళ్ల మీద ఎలా ఉంటుందో తెలియదుగానీ.. ఆ కుర్రాడి మీద మాత్రం భలేగా చూపించింది. హాలీవుడ్‌ సినిమాల స్ఫూర్తితో ఆ పేదింటి బిడ్డ ఆవిష్కరణలకు ప్రయత్నించాడు. కన్నతల్లి అందించిన ప్రొత్సాహంతో  ఐదేళ్లు కష్టపడి రియల్‌ ఐరన్‌మ్యాన్‌ సూట్‌ తయారు చేశాడు. ఆ కష్టమే అతని చెల్లి చదువుకు సాయపడింది. ఇప్పుడు తన కల నెరవేర్చుకునేందుకు సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.  


నింగోంబమ్‌ ప్రేమ్‌.. వయసు 20.  ఉండేది మణిపూర్‌ రాష్ట్రం థౌబల్‌ జిల్లా హెయిరోక్‌(2) గ్రామం. చదివేది ఇంఫాల్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్స్‌. ఆరేళ్ల క్రితం.. ఓరోజు స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్‌ ఫోన్‌లో ఐరన్‌ మ్యాన్‌ సినిమా చూశాడట. మనోడికి ఆ సినిమా తెగ నచ్చేసింది. అప్పటి నుంచి వరుసగా హాలీవుడ్‌ సినిమాలు చూస్తూ.. మైండ్‌లో ప్రింట్‌ అయిన ‘ఐరన్‌మ్యాన్‌ సూట్‌’ బొమ్మను పేపర్‌పై గీసుకున్నాడు. ఎలాగైనా ఆ సూట్‌ను తయారు చేయాలని బలంగా ఫిక్స్‌ అయ్యాడు ఆ కుర్రాడు. టెక్నికల్‌ నాలెడ్జ్‌ లేదు. అందుకోసం హాలీవుడ్‌ సినిమాలు, ఇంటర్నెట్‌ను ఆశ్రయించాడు.  ఈ రెండూ అతని బుర్రను రాటుదేల్చాయి.

తల్లి అండ.. చెల్లికి దన్ను
సూట్‌ తయారు చేయాలనే ఆత్మ విశ్వాసం ప్రేమ్‌లో నిండింది. కానీ, మెటీరియల్‌ కోసం డబ్బులు లేవు. మగదిక్కులేని ఆ కుటుంబానికి ప్రేమ్‌ తల్లి సంపాదనే ఆధారం. కానీ, ఆమె కొడుకును ‘ఏదో ఒకటి సాధించాలంటూ’ వెన్నుతట్టి ప్రోత్సహించింది.  చెత్త కుప్పల వెంట తిరిగి  ఎలక్ట్రానిక్ వేస్టేజ్‌ను సేకరించాడు.  కార్డ్‌బోర్డ్‌ సాయంతో  ఐదేళ్లు కష్టపడి ఐరన్‌మ్యాన్‌ సూట్‌కి ఒక రూపాన్ని తీసుకొచ్చాడు. ఈ సూట్‌తో పాటు మధ్య మధ్యలో కొన్ని ఆవిష్కరణలు చేశాడు.  వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో చెల్లిని సైతం చదివిస్తున్నాడు.
 
తన ఆవిష్కరణలు మరికొందరిలో స్ఫూర్తి ఇస్తే చాలంటున్నాడు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చేయాలని ఉందట. కానీ, డబ్బుల్లేక ఆగిపోయాడు. ఈ విషయం రీసెంట్‌గా ఓ వీడియో ద్వారా వ్యాపారదిగ్గజం ఆనంద్‌ మహీంద్రాకు చేరింది. టోనీ స్టార్క్‌(మార్వెల్‌ ఐరన్‌మ్యాన్‌)ను పక్కకి తప్పుకోమంటూ.. ప్రేమ్‌ను  రియల్‌ ఐరన్‌ మ్యాన్‌గా పొడిగారు ఆనంద్‌ మహీంద్రా.  అంతేకాదు అతనికి, అతని సోదరికి సాయం అందిస్తానని మాటిచ్చారు. వాళ్లను సంప్రదించేందుకు సాయం చేయాలని ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. 

చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..!

మరిన్ని వార్తలు