లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి బెటర్ ఆప్షన్ ఏదంటే?

11 Sep, 2023 07:05 IST|Sakshi

దీర్ఘకాలం కోసం లార్జ్‌క్యాప్‌ లేదా ఫ్లెక్సీక్యాప్‌ పథకాల్లో ఏది బెటర్‌?  – సుశాంక్‌
దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలని అనుకుంటే పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు చెప్పుకోతగ్గ స్థాయిలో ఉండాలి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో కొన్ని ఉప విభాగాలు కూడా ఉన్నాయి. అందులో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్, ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ భాగం. లార్జ్‌క్యాప్‌ పథకాలు లార్జ్‌క్యాప్‌ (పెద్ద మార్కెట్‌ విలువ) కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. చిన్న ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న పరిమిత పెట్టుబడులతో విడిగా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ను ఎక్కువగా (ఒకటికి మించి కంపెనీలు) కొనుగోలు చేయలేరు. 

అటువంటి వారు ఒక లార్జ్‌క్యాప్‌ పథకం ద్వారా ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుంటుంది. ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ అలా కాదు. వివిధ మార్కెట్‌ విలువ కలిగిన (లార్జ్, మిడ్, స్మాల్‌) కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. లార్జ్‌క్యాప్‌ మాదిరిగా ఏదో ఒక మార్కెట్‌ విలువకే పరిమితం కావు. వివిధ రంగాల్లోని, వివిధ స్థాయి కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. పన్ను పరంగా చూస్తే ఈ రెండు ఈక్విటీ పథకాలే కనుక ఒకే మాదిరి ఉంటుంది. ఏడాది లోపు లాభాలపై 15 శాతం, ఏడాది మించిన లాభాలపై (రూ.ఒక లక్ష తర్వాత) 10 శాతం పన్ను పడుతుంది. 

2013 నుంచి లార్జ్‌క్యాప్, ఫ్లెక్సీక్యాప్‌ విభాగాల్లో చెరో రూ.10,000 చొప్పున సిప్‌ ద్వారా ఇన్వెస్టి చేసి ఉంటే, 2022 జూన్‌ నాటికి రూ.11.60 లక్షల మొత్తం పెట్టుబడి పెట్టి ఉంటారు. కానీ, రాబడుతో కలిపి మొత్తం నిధి ఫ్లెక్సీక్యాప్‌లో రూ.24.63 లక్షలు అయి ఉండేది. అదే లార్జ్‌క్యాప్‌లో రూ.22.78 లక్షలు సమకూరేది. అంటే ఫ్లెక్సీక్యాప్‌ విభాగం రూ.1.84 లక్షల అధిక రాబడి ఇచ్చింది. లార్జ్‌క్యాప్, ఫ్లెక్సీక్యాప్‌ రెండూ పూర్తిగా ఈక్విటీల్లోనే పెట్టుబడులు పెడతాయి. కనుక అస్థిరతలు ఉంటాయని మర్చిపోవద్దు. మార్కెట్లలో ఆటుపోట్లను, స్టాక్‌ మార్కెట్‌ పనిచేసే తీరును అర్థం చేసుకున్న వారికి ఇవి అనుకూలం.  కేవలం లార్జ్‌క్యాప్‌ కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యం కోరుకునే వారు లార్జ్‌క్యాప్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. దాదాపు ఇన్వెస్టర్లు అందరికీ లార్జ్‌క్యాప్‌ అనుకూలం. 

మార్కెట్లో ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్‌ చేసే సౌలభ్యంతో ఉండేవి ఫ్లెక్సీక్యాప్‌ పథకాలు. కొంచెం అదనపు రిస్క్‌ తీసుకునే వారికి అనుకూలం. పేరులో ఉన్నట్టు.. మార్కెట్‌లో ఎక్కడ అనుకూల అవకాశాలు ఉంటే అక్కడికి పెట్టుబడులు మళ్లించే వెసులుబాటు ఫ్లెక్సీక్యాప్‌ పథకాలకు ఉంటుంది. కానీ, లార్జ్‌క్యాప్‌ పథకాలకు ఈ స్వేచ్ఛ ఉండదు. కనుక వైవిధ్యం కోరుకునే వారికి ఫ్లెక్సీక్యాప్‌ అనుకూలం. కనీసం ఐదేళ్లు, అంతకుమించి కాలానికి వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసినప్పుడే అసలైన రాబడులు కనిపిస్తాయి. అందుకని పెట్టుబడుల లక్ష్యాలు, రిస్క్‌ ఎంత మేరకు తీసుకోగలరు, ఎంత కాలం పెట్టుబడి పెట్టగలరనే అంశాల ఆధారంగా వీటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాలి. సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవడం మెరుగైన మార్గం అవుతుంది.  

షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్, బంగారం వీటిల్లో ఏది మెరుగైనది?  – రాజేంద్రన్‌
వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో బంగారం స్థిరంగా ఉండడమే కాకుండా, రాబడినిస్తుంది. అనిశ్చిత పరిస్థితుల్లో ఇది సురక్షిత సాధనం. అయితే, ఇది సిద్ధాంతం మాత్రమే. నిజానికి బంగారంలోనూ ఎన్నో అస్థిరతలు ఉంటాయని నిరూపితమైంది. ఎన్నో కారణాలు ఈ అస్థిరతలకు దోహదం చేస్తుంటాయి. ఇందులో ఒకటి డిమాండ్‌-సరఫరా. పైగా బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీ ఒకటి. 

మన దేశం పెద్ద ఎత్తున ఏటా బంగారం దిగుమతి చేసుకుంటోంది. అనుత్పాదక సాధనం కనుక బంగారం దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం సుంకాలను విధిస్తుంటుంది. ఇవి ధరలపై ప్రభావం చూపిస్తాయి. కనుక స్వల్ప కాలం కోసం అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ డెట్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పెరుగుతున్న వడ్డీ రేట్ల సైకిల్‌ను అధిమించడానికి ఇదే మెరుగైన మార్గం అవుతుంది.


ధీరేంద్ర కుమార్‌ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

మరిన్ని వార్తలు