హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నూతనోత్సాహం

9 Apr, 2021 00:00 IST|Sakshi

జనవరి–మార్చిలో 7,721 గృహాల విక్రయాలు 

11 లక్షల చ.అ. కార్యాలయ లావాదేవీలు 

బెంగళూరులో హౌసింగ్, ఆఫీస్‌ స్పేస్‌ రెండింట్లోనూ క్షీణతే

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నూతనోత్సహం నెలకొంది. ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరు రియల్టీ గృహాలు, ఆఫీస్‌ స్పేస్‌ రెండింట్లోనూ తిరోగమనంలో పయనిస్తుంటే.. హైదరాబాద్‌లో మాత్రం జోరుమీదుంది. 2021 జనవరి–మార్చి మధ్య కాలంలో నగరంలో 38 శాతం వృద్ధి రేటుతో 7,721 గృహాలు విక్రయమయ్యాయని రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజ్‌ ప్రాప్‌టైగర్‌ తెలిపింది. గతేడాది ఇదే 3 నెలల్లో 5,554 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక దేశంలోని 8 ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు చూస్తే.. 5 శాతం క్షీణించి 66,176 యూనిట్లకు చేరాయి.

గతేడాది తొలి మూడు నెలల కాలంలో 69,555 గృహాలు విక్రయాలు జరిగాయి. ఆర్ధిక వ్యవస్థ క్రమంగా రికవరీ వైపు పయనిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్‌బీఐ తీసుకుంటున్న వివిధ చర్యల సానుకూల ప్రభావం రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ విభాగం మీద కూడా ఉంటుందని కంపెనీ సీఈఓ ధ్రువ్‌ అగర్వాల్‌ తెలిపారు. ద్రవ్య లభ్యత, కొనుగోలుదారుల నుంచి సానుకూల స్పందనలు డెవలపర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయని తెలిపారు. 


ఇతర నగరాల్లో.. 
ఈ ఏడాది తొలి మూడు నెలల్లో అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 4% పెరిగి 4,687 యూనిట్లకు చేరాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 14 శాతం వృద్ధి చెంది 6,188 యూనిట్లకు, చెన్నైలో 23% పెరిగి 4,468కి, కోల్‌కతాలో 23% పెరిగి 3,382 ఇళ్లకు, బెంగళూరు, ముంబై, పుణే నగరాల్లో మాత్రం గృహాలు విక్రయాలు క్షీణించాయి. గతేడాది తొలి మూడు నెలల్లో బెంగళూరులో 8,197 ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది 9 శాతం క్షీణించి 7,431 యూనిట్లకు పరిమితయ్యాయి. అలాగే ముంబైలో 23,969 యూనిట్ల నుంచి 18,574 (23 శాతం) క్షీణించాయి.


11 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌.. 
ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో హైదరాబాద్, కోల్‌కతా, పుణే నగరాల్లో మాత్రమే ఆఫీస్‌ స్పేస్‌ నికర లావాదేవీలు పెరిగాయి. ఈ ఏడాది జనవరి–మార్చిలో హైదరాబాద్‌లో 11 లక్షల చ.అ. లీజింగ్స్‌ జరిగాయి. గతేడాది ఇదే కాలంలో 9 లక్షల చ.అ.లుగా ఉంది. 

మరిన్ని వార్తలు